కొండపొలంపై యువకుడి బ్రతుకు పోరు

By iDream Post Sep. 27, 2021, 04:30 pm IST
కొండపొలంపై యువకుడి బ్రతుకు పోరు

ఈ ఏడాది ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ దక్కించుకున్న మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా కొండపొలం. సుప్రసిద్ధ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫారెస్ట్ థ్రిల్లర్ పూర్తయ్యి చాలా రోజులు అయ్యింది. లాక్ డౌన్ వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చి ఒకదశలో ఓటిటి రిలీజ్ అనే ప్రచారం కూడా జరిగింది. ఉప్పెన ఫలితం వచ్చాక సమీకరణాలు మారిపోయాయి. అందుకే ఇప్పుడు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అన్నయ్య సాయి తేజ్ రిపబ్లిక్ అక్టోబర్ 1న వచ్చాక సరిగ్గా వారానికి తమ్ముడు 8న కొండపొలంతో పలకరించబోతున్నాడు. ఇందాకే ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

అనగనగా దట్టమైన నల్లమల అడవి. దాన్నే నమ్ముకుని జీవనం సాగించే గూడెం జనం. వాళ్ళ జీవనోపాధి అక్కడి వనరులే. అక్కడే పుట్టి పెరిగిన ఓ యువకుడు(వైష్ణవ్ తేజ్) ఉన్నత చదువులు పూర్తి చేశాడు. కానీ కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం రాదు. ఇంటర్వ్యూలకు వెళ్లి వెనక్కు వస్తాడు. తమకు ఆధారమైన కొండపొలం పైకి అందరితో కలిసి వెళ్తాడు. అక్కడో ప్రమాదకరమైన పులి ఉంటుంది. మరోవైపు అటవీ సంపదను దోచుకునే ముఠా కుట్రలు చేస్తూ ఉంటారు. ఇంత పెద్ద వలయంలోకి అడుగు పెట్టిన అతను ఆ జంతువుని, మృగాల్లాంటి ఆ మనుషులను ఎలా ఎదురుకున్నాడు అనేదే అసలు కథ. మెయిన్ లైన్ ఇదే అనిపించేలా వీడియో కట్ చేశారు.

Also Watch : Kondapolam Trailer

పరిమిత లొకేషన్లలో సైతం అద్భుతమైన విజువల్స్ తో కట్టిపడేశారు. జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో కనిపించింది. చాలా గ్యాప్ తర్వాత ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారనే చెప్పాలి. లంగా ఓణీలో రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ తో పాటు మంచి నటనను కనపరిచింది. లవర్ బాయ్ కథల జోలికి పోకుండా వైష్ణవ్ తేజ్ ఇలాంటివి ఎంచుకోవడం మెచ్చుకోదగినదే. లుక్స్ పరంగా ఇందులో కూడా సహజంగా అనిపించాడు. అయితే పెర్ఫార్మన్స్ గురించి ఈ రెండు నిమిషాలను బట్టి జడ్జ్ చేయలేం కానీ మొత్తానికి ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ తో వస్తున్న కొండపొలం మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా కనిపిస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp