వకీల్ సాబ్ అవకాశాన్ని వాడుకుంటాడా

By iDream Post May. 23, 2020, 09:58 pm IST
వకీల్ సాబ్ అవకాశాన్ని వాడుకుంటాడా

లాక్ డౌన్ వల్ల ఇండస్ట్రీ స్థంభించిపోయి రెండు నెలలు దాటేసింది. పరిశ్రమ పెద్దలు నిన్న తెలంగాణ సిఎంని కలవడం, చర్చలు జరగడం అన్నీ జరిగిపోయాయి కానీ చాలా ప్రశ్నలకు సమాధానం త్వరలో అని మాత్రమే వస్తోంది. ఒకవైపు హడావిడి లేకుండా షూట్ పూర్తయిన సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్లు జరిగిపోతున్నాయి. కొత్త సీటింగ్ ప్లాన్లతో ఆగస్ట్ నుంచి థియేటర్లు తెరిచేలా త్వరలోనే ఆదేశాలు వెలువడతాయని టాక్ ఉంది కానీ ముందు ఏఏ సినిమాలు వస్తాయన్నది తేలడం లేదు.

ఎవరికి వారు లోలోపల గుబులుగానే ఉన్నారు. హాల్స్ తెరిచాక తీరా జనం అనుకున్న స్థాయిలో రాకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ నిర్మాతా తాము ముందు రిలీజ్ చేస్తామని చెప్పుకోవడం లేదు. ఓటిటి వార్తలైతే జోరుగా వస్తున్నాయి. వి, నిశ్శబ్దం, అరణ్య, ఉప్పెన, రెడ్ తదితరాలు అన్ని వెయిట్ అండ్ సి సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మీద ఉంది. ఇంకో ఇరవై శాతం షూటింగ్ చేసేస్తే అయిపోతుంది. కథ పరంగా బడ్జెట్ పరంగా భారీ సినిమా కాదు కాబట్టి వర్క్స్ ని త్వరగానే పూర్తి చేయొచ్చు. అయితే దిల్ రాజు ఈ ఏడాదే రిలీజ్ చేస్తారా అనేది మాత్రం ఇప్పటికిప్పుడు తేలేది కాదు.

ఒకవేళ జూన్ లేదా జులైలో వకీల్ సాబ్ బాలన్స్ ని మొదలుపెడితే అక్టోబర్ కంతా ఫస్ట్ కాపీ రెడీ చేయడం అసాధ్యం కాదు. నిజానికి ఇప్పుడు పవన్ రేంజ్ స్టార్ హీరో మూవీ అయితేనే మునుపటి లాగా థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూడగలం. బయ్యర్లు కూడా అదే కోరుకుంటున్నారు. వకీల్ సాబ్ కు ఫ్లాష్ బ్యాక్ పార్ట్ తీయాల్సి ఉంది. దానికి హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు. శృతి హాసన్ పేరు వినిపించింది కానీ ఆమధ్య తనే ఆ వార్తలను కొట్టిపారేసింది. మరి లాక్ డౌన్ గ్యాప్ లో ఎవరినైనా సెట్ చేసుకున్నారా లేదా అనేది తెలియదు. వకీల్ సాబ్ ఈ ఏడాది మిస్ చేసుకుంటే వచ్చే సంక్రాంతి తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. అసలు పవన్ వెంటనే షూటింగుల్లో పాల్గొంటాడా అనేది కూడా అనుమానంగానే ఉంది. సో ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎప్పుడు బ్రేక్ పడుతుందో చెప్పడం కష్టమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp