టేకప్ చేసే హీరో ఎవరున్నారు

By iDream Post May. 25, 2020, 11:05 am IST
టేకప్ చేసే హీరో ఎవరున్నారు

థియేటర్లు, షూటింగులు మూతబడి డెబ్భై రోజులు అవుతోంది. ఇంకెంత కాలం కొనసాగుతుందో అర్థం కావడం లేదు. ఇటీవలే జరిగిన మీటింగ్ లో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కానీ సినిమా హాళ్ల విషయం మాత్రం కేంద్రం చేతిలో ఉంది. సో అక్కడి నుంచి నిర్ణయం రావాల్సిందే. స్టార్లతో మొదలుకుని చిన్న యాక్టర్ల దాకా అందరూ ఇళ్లలో బందీ అయిపోయారు. ఇది జీవితంలో ఎవరూ ఊహించనిది. ఇన్నేసి రోజులు తమతో ఏకాంతంగా గడిపినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం సంతోషంగానే ఉన్నారు. ఎటొచ్చి దినసరి ఆదాయం మీద ఆధారపడే సినీ కార్మికుల కష్టాలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా జూన్ నుంచి సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆఘమేఘాల మీద వీలైనన్ని ఎక్కువ ఎపిసోడ్లు షూట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఫుల్ స్క్రిప్ట్ లతో సిద్ధం ఉన్నారు. పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఈసారి చాలా ఎక్కువ ముందు జాగ్రత్త తీసుకోవడం ఖాయం. ఇక బిగ్ బాస్ 4కి సంబంధించి స్టార్ మా ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నా పార్టిసిపెంట్స్ దొరకడం అంత ఈజీ కాదు. ఎవరికి వాళ్ళు యమా బిజీలో ఉంటారు. అలాని ఎవరిని బడితే వాళ్ళను తెచ్చి షో నడిపితే రేటింగ్స్ రావు.

దీన్ని ఏదోలా మేనేజ్ చేస్తారు అనుకుంటే అసలు యాంకర్ గా చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అనేదే భేతాళ ప్రశ్న. నాగార్జున పేరు గట్టిగా వినిపించింది కానీ లాక్ డౌన్ అవ్వగానే ఆయన వైల్డ్ డాగ్ తో పాటు బంగార్రాజు పనుల్లో బిజీ అయిపోతారు. నాని, జూనియర్ ఎన్టీఆర్ లను ఆశించడం కూడా అత్యాశే. వెంకటేష్ వ్యాక్సిన్ వచ్చే వరకు సినిమా సెట్ కే వచ్చే ఆలోచనలో లేరని ఇప్పటికే టాక్ ఉంది. అలాంటిది షోకి ఎస్ చెప్పడం అసాధ్యం. ఇవన్నీ చూస్తూనే బిగ్ బాస్ సీజన్ 4కు అడుగు ముందుకు వేయడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇప్పుడు కాదు అనుకుంటే మళ్ళీ వచ్చే ఏడాది వేసవి దాకా ఛాన్స్ ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా ఇంకో రెండు నెలల తర్వాత కానీ వెలువడే ఛాన్స్ లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp