లేడీ కిల్లర్ ఛాయస్ ఎవరో

By iDream Post Apr. 07, 2020, 06:01 pm IST
లేడీ కిల్లర్ ఛాయస్ ఎవరో

ప్రస్తుతం కరోనా బ్రేక్ డౌన్ వల్ల పరిశ్రమ మొత్తం ఇళ్లకే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. ఎప్పటికి నార్మల్ అవుతుందో అర్థం కావడం లేదు కానీ స్టార్లు ఒకపక్క కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరోపక్క దినసరి వేతనం మీద ఆధారపడే కార్మికులు మాత్రం విరాళాల సహాయంతో రోజులు నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మహమ్మారి ప్రభావం వల్ల పెళ్లితో పాటు రంగ్ దే కీలకమైన షెడ్యూల్ ని వాయిదా వేసుకున్న హీరో నితిన్ ఆ వెంటనే అందాదున్ రీమేక్ కు రెడీ కావాలి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించే ఈ సినిమా పూజా ఓపెనింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయిపోయింది.

ఇక ఇందులో కీలకమైన లేడీ విలన్ పాత్ర ఒకటుంది. వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేసే కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ రోల్ లో ఒరిజినల్ వెర్షన్ లో టబు అదరగొట్టింది. తెలుగుకు కూడా తననే తీసుకుంటారు అనుకుంటే డేట్స్ సమస్య వల్ల అది సాధ్యం కావడం లేదట. ఇప్పుడు రెండు ఛాయస్ లను నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ముందు యాంకర్ అనసూయను గట్టిగా అనుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల తను చేయకపోయే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. అందులోనూ కరోనా వల్ల కాల్ షీట్స్ సమస్య కూడా ఉందట.

ఇప్పుడు తనకు బదులుగా రమ్యకృష్ణను ఛాయస్ గా చూస్తున్నారట. ఇలాంటి పాత్రలకు ఆవిడ సూట్ అవుతుంది కానీ ఒప్పుకుంటారో లేదో అన్న సందేహం లేకపోలేదు. కథ మొత్తాన్ని మలుపు తిప్పే పాత్ర కావడంతో పెద్ద ఆర్టిస్టు అయితేనే న్యాయం జరుగుతుంది. అందుకే అనసూయ, రమ్యకృష్ణలను అనుకున్నారు నిర్మాతలు. వీళ్ళు కాకుండా నదియా, మధుబాల లాంటి వాళ్ళు ఉన్నారు కానీ సాఫ్ట్ అప్పీల్ ఈ పాత్రకు సూట్ అవ్వదు. అందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది హిందీలో టాప్ హిట్స్ ఓ ఒకటిగా నిలిచిన అందాదున్ తర్వాతే ఆయుష్మాన్ ఖురానా బిజీ ఆర్టిస్ట్ గామారిపోయాడు. నితిన్ కెరీర్ లో మొదటిసారి కళ్ళు లేని వాడిగా నటించబోతుండటం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp