రంగమార్తాండ జాడ ఏదీ

By iDream Post Sep. 17, 2020, 07:09 pm IST
రంగమార్తాండ జాడ ఏదీ

ఒకప్పుడు దర్శకుడు కృష్ణవంశీ పేరు ఒక బ్రాండ్. స్టార్ లేకుండా గులాబీ లాంటి బ్లాక్ బస్టర్ తో పరిచయమై ఒక్క సినిమాతోనే అందరి దృష్టి తనవైపు మళ్లేలా చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్. నాగార్జునకు నిన్నే పెళ్లాడతా రూపంలో ఫ్యామిలీ కథతో ఇండస్ట్రీ హిట్టు కొట్టడం ఆయనకే చెల్లింది. మహేష్ బాబులోని అసలైన నటుడిని మురారితో పరిచయం చేసినా కాజల్ అగర్వాల్ సత్తాని చందమామతో చాటినా, అంతఃపురంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా కృష్ణవంశీ ట్రాక్ రికార్డు ఏమంత ఆశాజనకంగా లేదు.

రామ్ చరణ్ పిలిచి మరీ గోవిందుడు అందరివాడేలే చేస్తే నిరాశపరిచారు. ఇక నక్షత్రం సంగతి సరేసరి. తన స్థాయి మూవీ రావడం లేదని అభిమానులు ఎప్పటి నుంచో బాధ పడుతున్నారు. అలాంటి సమయంలో గత ఏడాది ప్రకాష్ రాజ్ హీరోగా రంగమార్తాండ ప్రారంభించారు. భార్య రమ్యకృష్ణనే మరో కీలక పాత్రలో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతంతో షూటింగ్ కు ముందే ఓ రేంజ్ అంచనాలు రేపారు. అంతా సవ్యంగా షూట్ జరిగిపోతోందనుకుంటున్న టైంలో లాక్ డౌన్ వచ్చి పడింది. ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మెల్లగా కుదుటపడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ఇటీవలే కెజిఎఫ్ 2 షూటింగ్ లో పాల్గొన్నారు కూడా. కానీ ఇంకా రంగమార్తాండకు సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు.

సగానికి పైగానే పూర్తయ్యిందని మార్చి ముందు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం అంతా గప్ చుప్ గా ఉన్నారు. ఇది మరాఠి హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్. నానా పాటేకర్ అద్భుతంగా పోషించిన టైటిల్ రోల్ నే ప్రకాష్ రాజ్ తెలుగులో చేస్తున్నారు. నాటకరంగంలో గొప్ప గుర్తింపు పొందిన కళాకారుడు నిజ జీవితంలో ఎదురుకున్న చేదు అనుభవాలతో ఈ కథ రూపొందింది. మరి రంగమార్తాండ ఇప్పుడేమయ్యాడు, పోస్ట్ ప్రొడక్షన్ ఏదైనా జరుగుతోందా లాంటి వివరాలు ఏవి తెలియవు. రాజా నేతృత్వంలో చాలా నెలల క్రితమే మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయి. మరి ఇప్పుడు ఈ మౌనానికి కారణం ఏమిటో, రంగమార్తాండ స్టేటస్ ఎక్కడుందో కృష్ణవంశీ కానీ ప్రకాష్ రాజ్ కానీ చెప్తే కానీ క్లారిటీ రాదు. థియేటర్లు అనుకూలంగా లేవు. ఓటిటి ఆప్షన్ పెట్టుకోవాలన్నా అసలు ఇంతకీ ఈ సినిమా ఏ స్టేజిలో ఉందో మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp