'విజయ' బాపినీడు జ్ఞాపకాల్లో - Nostalgia

By Ravindra Siraj Feb. 12, 2020, 08:27 pm IST
'విజయ' బాపినీడు జ్ఞాపకాల్లో - Nostalgia

1991....

రాయలసీమలోని ఓ చిన్న పట్టణం....

తేదీ సరిగా జ్ఞాపకం లేదు. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లే కాబట్టి ఈ మాత్రం గుర్తుండటమే సన్మానం చేయించుకోదగ్గ గొప్ప విషయం...

ఇంట్లో ఫ్యామిలీ అందరం చిరంజీవి సినిమాకు బయలుదేరుతున్నాం. అప్పుడు మా నాన్న చేసే ప్రైవేట్ గుమస్తా ఉద్యోగానికి సెకండ్ షో తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. రాత్రి 9 అవుతోంది. ఇంటికి కాస్త దగ్గరలోనే వసంత థియేటర్. అప్పటికది 30వ రోజు కాబట్టి టికెట్లు సులువుగా దొరికేస్తాయనే వెర్రి భ్రమలో ముందస్తు రికమండేషన్లు ఏమి లేకుండా నేరుగా రిక్షాలో హాల్ కు వెళ్లిపోయాం. మనసంతా సంబరం. అప్పటికే స్కూల్ లో ఈ సినిమా ప్రభంజనం గురించి విని విని చెవులు తుప్పుపట్టిపోయాయి. కట్ చేస్తే పది నిమిషాల్లో థియేటర్ దగ్గరున్నాం. కానీ అక్కడ సీన్ వేరుగా ఉంది. మిగిలినవాళ్ల సంగతేమో కానీ నాకైతే గుండెలు జారిపోయాయి.....

టికెట్ కౌంటర్ దగ్గర జనం విపరీతంగా తొక్కేసుకుని రక్కేసుకుని కొట్టుకుంటున్నారు. ఇంకా కౌంటర్ ఊచల కిటికీ పైన ఉండే బల్బు వేయనే లేదు. సెకండ్ షోలకు అంత జనం వస్తారని జీవితంలో మొదటిసారి తెలుసుకున్నా. వెనక్కు వెళ్ళక తప్పదేమో అనుకుంటే ఆపద్బాంధవుడిలా నాన్నకు తెలిసిన స్నేహితుడొకరు ఏవో మంత్ర తంత్రాలు ఉపయోగించి లోపలికి వెళ్లి మాక్కావలసిన ఐదు బాల్కనీ టికెట్లు పట్టుకొచ్చారు. ఆ క్షణంలో అతనే నాకు చిరంజీవి కన్నా గొప్పోడిగా కనిపించాడు.....

ఆట మొదలైంది. టైటిల్ "గ్యాంగ్ లీడర్"

ఏమి వినిపించడం లేదు. ఒకటే గోల. మా ఊళ్ళో దెయ్యాలు ఎందుకు లేవో అప్పుడర్థమయ్యింది. ఇలా రాత్రిళ్ళు ఇంతేసి కేకలు ఈలలు వేస్తే అవి ఊళ్ళో ఎందుకు ఉంటాయి. తెలిసి తెలియని చిన్నతనం కాబట్టి ఏదో తన్మయత్వంలో చూస్తూ పోతున్నా. పాటలకు నేల క్లాసులో ఎవరూ కింద కూర్చోవడం లేదు. పాట స్పీకర్ లో నుంచి వస్తోందా వాళ్ళ అరుపుల్లో నుంచి వస్తోందా అర్థమైతే ఒట్టు. చిరు స్టెప్పులకు ఒంట్లో ఏవో వైబ్రేషన్లు. పోలీస్ స్టేషన్ లో డిజిపికి చిరు చెయ్యి చూపించి వార్నింగ్ ఇచ్చే సీన్ తో దద్దరిల్లడం అంటే ఏంటో అర్థమయ్యింది. మురళీమోహన్ ని చంపినప్పుడు నిర్మలమ్మ సెంటిమెంట్ కి పక్కనున్న మా అమ్మను కాసేపు మర్చిపోయా. నలుగురు ఫ్రెండ్స్ ని విలన్ రావు గోపాల్ రావు చంపించాక చాలా రోజులు అనంత్ రాజ్ అంటే మనసులో విపరీతమైన భయం అలాగే ఉండిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే తెగేది కాదు కానీ మొత్తానికి సినిమా అయిపోయాక మనసు నిండా గ్యాంగ్ లీడర్ జ్ఞాపకాలతో ఆ నిద్ర పోలేదని ఖచ్చితంగా చెప్పగలను.

ఆ సమయంలో నాలాంటి ప్రేక్షకులకు అనిపించింది ఒకటే

"ఎవడ్రా ఈ డైరెక్టర్. ఫ్యామిలి సినిమాకు ఇంత మాస్ గా పిచ్చెక్కిపోయేలా చేసాడు. మళ్లీ మళ్లీ చొక్కాలు చినిగిపోయినా పర్వాలేదు ఇంకోసారి చూడాల్సిందే అనిపించేలా తీసాడు"

ముగ్గురు అన్నదమ్ములు, ఒక అమ్మ, ఇద్దరు చిన్న పిల్లలు, అనాధగా ఈ కుటుంబాన్ని చేరిన హీరోయిన్, సామాన్య ప్రేక్షకుడికి చేరడానికి ఇంత కన్నా మెటీరియల్ ఏం కావాలి. మాస్ పల్స్ ని పట్టడం అంటే ఇదా. బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించుకోవడం అంటే ఇలా ఉంటుందా. అలా మొదలైన గ్యాంగ్ లీడర్ ప్రభంజనం వంద రోజులైనా అలాగే సాగుతూనే ఉంది...

చిరు మీద అభిమానం పెరగడంలో గ్యాంగ్ లీడర్ పోషించిన పాత్ర గురించి మాటల్లో చెప్పడం అంటే జరిగే పని కాదు. అయినా ఈ చిన్ని సాహసం చేసాను.

సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజు రెగ్యులర్ వర్క్ లో పడబోతుండగా మిత్రుడి మెసేజ్

"విజయబాపినీడు పోయారట"

--నీ బొంద ఆయన పోవడం ఏమిటి. ఎక్కడికి వెళ్ళలేదు. మనం ప్రేమించిన గ్యాంగ్ లీడర్, మగమహారాజు, ఖైదీ నెంబర్ 786లు యుట్యూబ్లో, శాటిలైట్ ఛానెల్స్ లో, హార్డ్ డిస్కుల్లో ఉన్నంత కాలం సజీవంగానే ఉంటారు...
అంతుచిక్కని అనారోగ్యాలు డాక్టర్లకు ఇంకా సవాళ్లు విసురుతూనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి మహానుభావులు దేహాన్ని విడిచి వెళ్తారు తప్పించి మానసికంగా మన చుట్టూనే ఉంటూ సినిమా ప్రేమికుల, వర్ధమాన దర్శక రచయితల భుజాలు తడుతూనే ఉంటారు. మనం గుర్తించలేం అంతే...

విజయబాపినీడు గారికి అక్షర నివాళి అర్పిస్తూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp