నా సక్సెస్ కి ఆయనే కారణం

By iDream Post May. 21, 2020, 05:56 pm IST
నా సక్సెస్ కి ఆయనే కారణం

2011లో రవిబాబు తీసిన నువ్విలా అనే సినిమా తీసినప్పుడు అందులో ఎక్కువసేపు కనిపించని క్రికెటర్ పాత్రలో ఓ కుర్రాడు నటించాడు. యూత్ యాక్టర్స్ ఎక్కువగా ఉండటంతో పాటు బాక్స్ ఆఫీస్ ఫలితం చేదుగా రావడంతో అది ఎవరికి గుర్తులేకుండా పోయింది. ఆ తర్వాత 2012లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీస్తే అందులోనూ అదే సమస్య. రిజల్ట్ కూడా సేమ్. మూడేళ్లు గ్యాప్. 2015లో నాగ అశ్విన్ దర్శకత్వంలో ఎవడే సుబ్రహ్మణ్యంలో చేసిన ఋషి పాత్రతో అతనేంటో తెలిసింది. హీరో నాని కాబట్టి క్రెడిట్ ని షేర్ చేసుకోవాల్సి వచ్చింది.

2016లో తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లి చూపులతో మొదటి బ్రేక్ అందుకున్నాడు ఆ అబ్బాయి. అతనే విజయ్ దేవరకొండ. ఇక అర్జున్ రెడ్డి తో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. యూత్ లో హాట్ ఫెవరెట్ గా మారిపోయాడు. గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూ నచ్చేశాడు. ఆ తర్వాత ఫలితాల పరంగా కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఫాలోయింగ్ విషయంలో స్టార్లకు సైతం పోటీనిస్తున్న విజయ్ ప్రస్తుతం పూరితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండకు ఈ స్టార్ డం అంత సులభంగా వచ్చింది కాదు. మొదట్లో బంధువులు స్నేహితులలో నిరాశపరిచిన వారే ఎక్కువ. ఏదైనా ఉద్యోగమో వ్యాపారమో చూసుకోక ఎందుకొచ్చిన సినిమా తిప్పలని నిరాశపరిచేవారు.

అయినా విజయ్ అవన్నీ లెక్క చేయలేదు. ఎంత డౌన్ లో ఉన్నా నాన్న గోవర్ధన్ రావు ప్రోత్సాహంతో అలా ముందుకు సాగుతూనే ఉన్నాడు. స్వతహాగా బుల్లితెర నటుడైన గోవర్ధన్ రావు కొడుక్కి ఈ పరిశ్రమలో ఉండే కష్టనష్టాలు వివరిస్తూనే ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పేవారట. అందుకే విజయ్ దేవరకొండ తన సక్సెస్ కు మూల కారణం ఆయనే అని చెబుతాడు. ఉన్నది సూటిగా చెప్పడంలో పేరున్న విజయ్ ఆటిట్యూడ్ కి బోలెడు ఫ్యాన్స్ ఉన్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో వస్త్ర ఉత్పత్తుల్లో కూడా ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవలే కరోనా బాధితులకు సహాయం చేయడం కోసం మధ్యతరగతి అవసరార్థులను లక్ష్యంగా పెట్టుకోవడం అందరి మెప్పు పొందింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ కూడా దొరసానితో గత ఏడాది తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp