నెడుముడి వేణు - బహుముఖ ప్రతిభా నటులు

By iDream Post Oct. 11, 2021, 04:30 pm IST
నెడుముడి వేణు - బహుముఖ ప్రతిభా నటులు

సరిగ్గా పాతికేళ్ల క్రితం వచ్చిన శంకర్ భారతీయుడు సినిమా గుర్తుందా. అందులో హత్యలు చేసి తప్పించుకుంటున్న వృద్ధ కమల్ హాసన్ ని పట్టుకునే ప్రయత్నంలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కనిపిస్తుంది. నిజాయితీకి ప్రతిరూపంగా ఉండే ఆ క్యారెక్టర్ ని పోషించింది నెడుముడి వేణు. తర్వాత అపరిచితుడులో కూడా నటించారు. ఇటీవలే వచ్చిన నవరసలో, రెండేళ్ల క్రితం రిలీజైన రాజీవ్ మీనన్ సర్వం తాళ మయంలోనూ చేశారు. ఇవాళ ఈయన కన్ను మూశారు. కరోనా వచ్చి కోలుకున్నాక కొంత కాలం విశ్రాంతి తీసుకున్న వేణుని నిన్న ఉన్నట్టుండి శ్వాసలో ఇబ్బంది మొదలవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది.

నెడుముడి వేణు వయసు 73. సుమారు 500పైగా సినిమాల్లో నటించిన అనుభవం వీరిది. మలయాళంలో స్టార్ డం అనుభవించిన హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మూడు జాతీయ అవార్డులతో పాటు కేరళ ప్రభుత్వం ఇచ్చే ఆరు పురస్కారాలను వేణు అందుకున్నారు. ఈయన మృదంగం వాయిస్తారు. మంచి ఫోక్ సింగర్ కూడా. రంగస్థల నటుడైన వేణు తొలుత జర్నలిస్ట్ గా పని చేశారు. 1978లో సినిమా రంగ ప్రవేశం చేసి మొదటి బ్రేక్ అందుకున్నారు. జి అరవిందన్ తీసిన తంబు డెబ్యూ మూవీ. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన నవరస సిరీస్ లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన సమ్మర్ అఫ్ 92లో నటించారు.

వేణు మరికొన్ని సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆఖరి చిత్రం మోహన్ లాల్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన మరక్కార్. ఇప్పటికే ఇది పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. 2007లో చౌహరేన్ అనే హాలీవుడ్ మూవీ కూడా వేణు నటించారు. తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ డేట్ల సమస్య వల్ల కోలీవుడ్ ఆఫర్లనూ సైతం తిరస్కరించాల్సి వచ్చేదని పలుమార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే ఈ రెండు భాషల్లో వేణు చాలా తక్కువగా కనిపిస్తారు. 2016లో సంస్కృతం సినిమా ఇష్టిలో కూడా నటించారు. చివరి శ్వాస దాకా నటనే ఊపిరిగా బ్రతికిన నెడుముడి వేణు మనకు కనిపించింది రెండు మూడు సినిమాల్లోనే అయినా వేసిన ముద్ర శాశ్వతం

Also Read : నిన్న నాగబాబు నేడు ప్రకాష్ రాజ్ గుడ్ బై

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp