పవన్ మళ్ళీ రప్పించగలరా

By iDream Post Jun. 14, 2021, 11:30 am IST
పవన్ మళ్ళీ రప్పించగలరా
థియేటర్లు తెరుచుకునే మార్గాలు సుగమం అవుతున్నాయి. నిన్న వైజాగ్ జగదాంబని క్రాక్ ఒక్క షోతో మొదలుపెట్టడం ఇండస్ట్రీ శుభసూచకంగా భావిస్తోంది. ఇదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో కూడా హాళ్లు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే అసలు సమస్య కొత్త సినిమాలు లేకపోవడం. బడ్జెట్ చిత్రాల నిర్మాతలు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీని ప్రకటించి అన్ని థియేటర్లు తెరుచుకున్నాకే రిలీజ్ డేట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇదంతా జరగడానికి కూడా జూన్ ఆఖరుదాకా వేచి చూడాల్సిందే. అలా అనుకున్నా ఇంకా 15 రోజుల సమయం ఉంది.

అప్పటిదాకా రీ రిలీజులు చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఏప్రిల్ 9ని వకీల్ సాబ్ విడుదల చేసినప్పుడు దానికి కేవలం ఇరవై రోజుల రన్ మాత్రమే దొరికింది. ఆ వెంటనే లాక్ డౌన్ వచ్చి పడింది. అయినా కూడా 85 కోట్ల దాకా రాబట్టి పవన్ తన స్టామినా చాటాడు. ఇప్పుడు అదే స్థాయి రెస్పాన్స్ రావడం అసాధ్యం కానీ దానికో మార్గంగా ఎడిటింగ్ లో డిలీట్ చేసిన సీన్లు కలిపి కొత్త వెర్షన్ తరహాలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. అలా పక్కనపెట్టేసిన ఫుటేజ్ సుమారు 20 నిమిషాలకు పైగానే ఉందని ల్యాబ్ నుంచి వినిపిస్తున్న మాట.

దీంతో పాటు ఉప్పెన, జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్లను కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇలాంటివి కొన్ని ఇప్పటికే శాటిలైట్ ఛానల్స్ లో వచ్చేశాయి. ఇప్పుడు అదే పనిగా జనం థియేటర్ దాకా వచ్చి చూస్తారా అంటే అనుమానమే. అందులోనూ కరోనా భయాలు పూర్తిగా తొలగిపోని తరుణంలో. ఇప్పుడు దాదాపు ప్రతి సినిమా ఓటిటిలో అందుబాటులో ఉంది. కొత్త కంటెంట్ వస్తే కానీ జనాన్ని హాళ్ల దగ్గర ఆశించలేం. అందుకే వీలైనంత త్వరగా చిన్న నిర్మాతలు ముందుకు వచ్చి విడుదల తేదీలు ప్రకటించుకుంటేనే పరిస్థితిలో కొంత మెరుగుదల ఆశించవచ్చు. చూద్దాం ఏం జరగబోతోందో
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp