ఉప్పెన విలన్ డబుల్ బొనాంజా

By iDream Post Aug. 11, 2020, 05:43 pm IST
ఉప్పెన విలన్ డబుల్ బొనాంజా

మనకు ఎక్కువ సినిమాల ద్వారా పరిచయం లేదు కానీ తమిళ మూవీస్ రెగ్యులర్ గా చూసేవాళ్లకు విజయ్ సేతుపతి ఎంత గొప్ప నటుడో బాగా తెలుసు. సైరాలో చిన్న క్యామియో ఇచ్చి వృధా చేసుకున్నారు కానీ మంచి పాత్ర ఇచ్చి ఉంటే ఎప్పటికీ మర్చిపోలేని పెర్ఫార్మన్స్ చూపించేవాడు. తమిళనాడులో న్యూ జనరేషన్ కమల్ హాసన్ గా ఇతన్ని పిలుచుకుంటారు. నటనతోనే కాక వ్యక్తిత్వంతో కూడా ఆకట్టుకోవడం ఇతని ప్రత్యేకత. ఇక విషయానికి వస్తే రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు విజయ్ సేతుపతి డబుల్ బొనాంజా అందించబోతున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఉప్పెనలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఊహించని రీతిలో ఈ పాత్రకు చాలా షేడ్స్ ఉంటాయని అందుకే అతను కథ వినగానే ఓకే చెప్పాడని ఇప్పటికే టాక్ ఉంది. హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ గుర్తింపు వచ్చినా ఆశ్చర్యం లేదని ఇన్ సైడ్ టాక్ ఉంది. ఇంకో రెండో ట్రీట్ విషయానికి వస్తే విజయ్ హీరోగా రూపొందుతున్న మాస్టర్ లో కూడా విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగానే నటిస్తున్నాడు. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. విజయ్ సేతుపతికి ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అందులో అతను ఉండడు. అక్కడ యంగ్ గా కనిపించే పాత్రలో మాస్టర్ మహేంద్రన్ అనే యువనటుడు కనిపిస్తాడు. కానీ డబ్బింగ్ మాత్రం ఇతనికీ విజయ్ సేతుపతినే చెబుతాడు. వెరైటీగా ఉంది కదా.

తన వయసు దృష్ట్యా తాను యువకుడిగా కనిపిస్తే అంతగా నప్పదేమో అన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ విజయ్ సేతుపతి దీనికి ఓకే చెప్పాడట. విజయ్-విజయ్ సేతుపతి మధ్య సన్నివేశాలు ఇప్పటిదాకా బెస్ట్ అని చెప్పుకుంటున్న విక్రమ్ వేదాను తలదన్నే స్థాయిలో ఉంటాయట. మాళవిక మోహనన్, ఆండ్రియా తదితరులు నటిస్తున్న మాస్టర్ కి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. పరిస్థితులు చక్కబడితే దీపావళికి విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సో తక్కువ గ్యాప్ లో విజయ్ సేతుపతి ఉప్పెన-మాస్టర్ రూపంలో డబుల్ బొనంజా ఇవ్వబోతున్నాడు. టైం ఇలా ఉండకపోతే అల్లు అర్జున్ పుష్ప కూడా చేసేవాడే కానీ కాల్ షీట్స్ సమస్య వల్ల ఇప్పుడా అవకాశం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp