అర‌కు అందం - ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య

By G.R Maharshi Jul. 31, 2020, 06:19 pm IST
అర‌కు అందం - ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య

ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌, ఈ నోరు తిర‌గ‌ని టైటిల్ చూస్తే ఇదేదో హీరో విల‌న్ల‌ని చావ‌చిత‌క్కొట్టే సినిమానేమో అనుకుంటాం. అదేం లేదు. టైటిల్ సంస్కృతం, సినిమా ప‌క్కా లోకల్‌. దీంట్లో హింస లేదు, అంద‌మైన సినిమా. జ‌ల‌పాతం లాంటి హోరు లేకుండా నెమ్మ‌దిగా సాగే ఏరు.

రీమేక్‌ల‌తో స‌మ‌స్య ఏమంటే క‌థ మారుద్దామంటే , రేపు తేడా కొడితే అన‌వ‌స‌రంగా క‌థ మార్చి దెబ్బ తిన్నారు, ఒరిజిన‌ల్‌లోని సోల్ పోయిందంటారు. మార్చ‌క‌పోతే ఒరిజిన‌ల్‌లోని స్లోని మార్చుకోలేక పోయారు అంటారు. కంచ‌ర‌పాలెంలో వెంక‌టేష్‌ మ‌హా తానేంటో నిరూపించుకున్నాడు. రెండో సినిమాతో మ‌ల‌యాళం (మ‌హేషింటి ప్ర‌తీకారం) ఎంచుకున్నాడు. అది మ‌ల‌యాళంలో బాగానే ఆడింది కానీ, స్లో నెరేష‌న్. వాళ్ల‌కి న‌చ్చింది. థియేట‌ర్‌లో వ‌చ్చి ఉంటే ఇక్క‌డ క‌ష్ట‌మే. ప్లాప్ టాక్ వ‌చ్చి ఉండేది. ఎందుకంటే ఈ సినిమాలో చెప్పిన‌ట్టు క‌ళ‌కి కావాల్సింది టెక్నిక్ కాదు, ఎమోష‌న్. అది లేదు. దీనికి OTT క‌రెక్ట్‌. థియేట‌ర్‌లో Pause బ‌ట‌న్ వుండ‌దు. OTTలో మ‌న చేతిలో వుంటుంది.

డైరెక్ట‌ర్ As it is గా Cut Paste త‌ర‌హాలో మ‌ళ్లీ మాట్లాడితే Xerox తీయాల‌నుకున్నాడు, తీశాడు. గోర్కీ క‌థను మ‌నం అనువాదం చేస్తే, ప్ర‌తిభావంతుడైన అనువాద‌కుడ‌నే అంటారే కానీ, ర‌చ‌యిత అన‌రు. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. చివ‌రికి పాట‌ల్లోని మాంటేజ్‌స్‌ని కూడా వ‌ద‌ల్లేదు. అయితే ఒక మంచి పెయింటింగ్‌ని య‌ధాత‌థంగా వేయాలంటే కూడా ఆర్టిస్ట్ అయి ఉండాలి. అంద‌రూ చేయ‌లేరు.

ఈ సినిమాని కొంచెం కొంచెం ఆస్వాదించాలి. క‌థ‌లో ఏదో జ‌రిగిపోతుంది అని ఎదురు చూడ‌కుండా అర‌కు లోయ అందాలు, స‌హ‌జమైన మ‌నుషులు. చిన్న‌చిన్న కోపాలు, ఆవేశాలు , క్యూట్ ప్రేమ క‌థ‌లు అన్నీ ఉంటాయి. స్టార్ట్ అయిన ప‌ది నిమిషాల త‌ర్వాత మ‌న‌కు న‌టుల‌కు బ‌దులు క్యారెక్ట‌ర్లు క‌నిపిస్తే అది మంచి సినిమానే.

మొద‌ట స‌త్య‌దేవ్ గురించి చెప్పుకోవాలి. మ‌హేషుడిలో ఎంత ఇమిడిపోయాడంటే ఇద్ద‌ర్నీ వేరు చేసి చూడ‌డం క‌ష్టం. క‌థ‌ల‌తో ప్ర‌యోగం చేయాల‌నుకునే డైరెక్ట‌ర్ల‌కి స‌త్య‌దేవ్ ప్ల‌స్ పాయింట్. ఎక్స్‌ప్రెష‌న్స్ అవ‌లీల‌గా ప‌లికిస్తాడు. బ్రేక‌ప్‌లోని బాధ‌, మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిన సంతోషం, న‌లుగురిలో దెబ్బ‌తిన్న‌ప్పుడు అవ‌మానం, అన్నీ క‌ళ్ల‌లోనే! గ‌ట్టి క‌థ ప‌డితే దున్నేస్తాడు.

చిన్న ఊళ్లో ఫొటో గ్రాఫ‌ర్‌గా ఉండే మ‌హేషుడిని చూస్తే ఎవ‌రైనా జ్ఞాప‌కాల్లోకి వెళ్లిపోతారు. అన్ని ఊళ్ల‌లో ఉంటారు. గ‌డ్డం పైకెత్తు, భుజాలు దించు Smile అని కెమెరా క్లిక్‌మ‌నిపిస్తారు త‌ప్ప‌, ఎవ‌డికీ కిటుకు తెలియ‌దు. 1976లో అనంత‌పురం సుభాష్ రోడ్డు నిండా కుప్ప‌తెప్ప‌లు స్టూడియోలు వుండేవి. అన్ని చోట్లా మ‌హేషులే. లైట్స్ ఆన్ చేయ‌డం, క్లిక్‌మ‌నిపించ‌డం. ఇపుడైతే క‌డిగే ప‌నిలేదు. అప్ప‌ట్లో రెండు రోజుల త‌ర్వాత ర‌మ్మ‌నేవాళ్లు. ఫొటోని చూసి మ‌న‌ల్ని మ‌నం గుర్తు ప‌ట్ట‌డానికి కొంచెం టైం ప‌ట్టేది. నా టెన్త్ క్లాస్ ఫొటో నాది కాద‌నే అనుకుంటూ ఉంటా. మా ముందు జ‌న‌రేష‌న్‌లో ఫొటోగ్రాఫ‌ర్‌ న‌ల్ల‌టి దుప్ప‌టిలో దూరే వాడు. పిల్ల‌లు బూచాడ‌నుకుని కెవ్వున కేకేసే వాళ్లు.

Capture చేయాలే కానీ , కేర‌ళ‌కి మించిన అందాలున్నాయి అర‌కులో. ఉమామ‌హేశ్వ‌ర సుంద‌ర రూపాస్య అని పెట్ట‌కుండా టైటిల్‌ని Confuse చేశారు.
సినిమాలో బాగా గుర్తుండిపోయే క్యారెక్ట‌ర్ హీరో తండ్రి. ప్ర‌కృతిని ప్రేమించే వాళ్లే వేదాంతుల‌వుతారు, క‌ళాకారుల‌వుతారు. కొడుక్కి స్టూడియో ఇచ్చాడు కానీ, Art ఇవ్వ‌లేక‌పోయాడ‌ని బాధ‌. నిజ‌మైన కెమెరా మ‌న్‌కి ప్ర‌పంచంలో ప్ర‌తిదీ అందంగానే క‌నిపిస్తుంది. సాలెగూడు కూడా ప‌ట్టు చీర‌లా ఉంటుంది. అందాన్ని వాళ్లు వెత‌క‌రు. హృద‌యంలోనే ఉంటుంది. ర‌సాస్వాద‌న‌ అంటే ఇదే. ఎమోష‌న్ లేని వాడు ఆర్టిస్ట్ కాలేడంటారు. కొడుకు ఆర్టిస్ట్ అయిన‌ప్పుడు తానే ఎక్కువ ఎమోష‌న్ ఫీల్ అవుతాడు. త‌క్కువ‌గా మాట్లాడుతాడు, అర్ధ‌వంతంగా మాట్లాడ‌తాడు.

న‌రేష్ నాటు డాక్ట‌ర్ బాబ్జీగా చేశాడు. మ‌ల‌యాళంలో ఈ క్యారెక్ట‌ర్ డాక్ట‌ర్ కాదు. ఇది మాత్రం కొంచెం మారింది. క‌ట్లు క‌ట్టే వాడికి జాలి ఉండ‌కూడ‌దు అనే ఫిలాస‌ఫీ. ఇపుడు త‌గ్గిపోయారు కానీ, పుత్తూరు నాటుక‌ట్టు డాక్ట‌ర్లు ఒక‌ప్పుడు అన్ని ఊళ్ల‌లో ఉండేవారు. క‌ట్టు క‌ట్టేట‌ప్పుడు రోగి అరిచే అరుపుల‌కి , చుట్టుప‌క్క‌ల వాళ్లు పారిపోయే వాళ్లు. న‌రేష్‌కి అసిస్టెంట్‌గా సుహాస్‌. న‌రేష్‌తో కంటే ఆయ‌న కూతురితోనే ఎక్కువ ఉంటాడు.

స‌హ‌జ‌మైన క్యారెక్ట‌ర్లు సినిమా అంతా ఉంటాయి కానీ, వాటికో మొద‌లు, తుది ఉండ‌దు. ఇదో లోపం.

యాంక‌ర్‌గా ఫేమ‌స్ TNR మంచి క్యారెక్ట‌ర్ వేశాడు. ప‌లాస డైరెక్ట‌ర్ క‌రుణ కాసేపు క‌నిపించి న‌వ్విస్తాడు. మాట నిల‌క‌డ‌లేని క‌రుణ‌తో మాట్లాడి చిరాకు ప‌డిన TNRని జ‌బ‌ర్ద‌స్త్ రాంప్ర‌సాద్‌, ఇంకోడు క‌లిసి తంతారు. ఈ Episode హిలేరియ‌స్‌.

అయితే పంచాయ‌తీ మెంబ‌ర్ కూడా అయిన TNR అవేశంతో సైకిల్ తొక్కుతూ బ‌య‌ల్దేరితే ఏదో చేసేస్తాడ‌నుకుంటాం. కానీ ఏమీ చేయ‌డు. స‌ర్దుకుపోయే వాడికి అంత ఆవేశం ఎందుకో? మ‌ల‌యాళంలో కూడా ఈ క్యారెక్ట‌ర్ ఇలాగే ఉంది కాబ‌ట్టి, ఎందుకు రిస్క్ అనుకుని ఉంటారు.

ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. రూపా కొడ‌వ‌య్యూర్ బాగుంది. ఇంత‌కీ మ‌హేషుడి ఉగ్ర‌రూపం ఎందుకంటే, ఒక‌సారి రోడ్డు మీద ఒక‌డితో మ‌హేష్ త‌న్నులు తింటాడు. వాడిని తిరిగి కొట్టే వ‌ర‌కు మ‌ళ్లీ కాళ్ల‌కి చెప్పులు వేసుకోను అని శ‌ప‌థం చేస్తాడు. అత‌నికి చెప్పులంటే ఇష్టం. ఫ‌స్ట్ సీనే చెప్పులు క‌డుక్కోవ‌డంతో స్టార్ట్ అవుతుంది. తీరా చూస్తే వాడెవ‌డో కాదు, త‌న‌కి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. కొట్టాడా, లేదా ఇదే క్లైమాక్స్‌.

"వంద మందిని పంపు షేర్‌ఖాన్" అంటే చ‌ప్ప‌ట్లు కొట్టే టైప్ మ‌నం. ఇట్లాంటివి మ‌న‌కు ఎక్కుతాయా?

కేర‌ళ వాళ్ల‌కి కొబ్బ‌రి నూనె వంట‌లు న‌చ్చుతాయి. అవే తెచ్చి మ‌న‌కి వ‌డ్డిస్తే క‌ష్టం. క‌నీసం ఆయిల్ అయినా మార్చాలి. ఫైన‌ల్‌గా ఏమంటే అర‌కు సొగ‌సు, సున్నిత‌మైన హాస్యం Over లేకుండా నేల‌మీద న‌డిచే మ‌నుషులు, సిటీ బ‌స్సులో తిరిగే హీరోయిన్‌, చిన్న ఊరు, చిన్న ప్ర‌పంచం చూడాలంటే చూడండి.

ఒకేసారి రెండు గంట‌లు కాకుండా పాత సినిమా మేరానామ్ జోక‌ర్‌లా రెండు ఇంట‌ర్వెల్స్‌తో చూడండి. థియేట‌ర్ ఫీలింగ్ రావాలంటే బ‌య‌టికి వెళ్లి కిరాణా కొట్టులో చిప్స్‌, పాప్‌కార్న్ కొనుక్కోండి (మీ ఊళ్లో లాక్‌డౌన్ లేక‌పోతే). క‌రోనాతో ముగ్గిపోతున్న‌ప్పుడు నెట్ ప్లిక్స్ కిటికీ తెర‌వండి. అర‌కు ప‌చ్చ‌ద‌నం క‌నిపిస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp