ప్రభాస్ 20లో థ్రిల్లింగ్ ట్విస్ట్స్

By iDream Post Mar. 05, 2020, 11:41 am IST
ప్రభాస్ 20లో థ్రిల్లింగ్ ట్విస్ట్స్

బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ అయిపోయిన డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ మంచి స్పీడ్ తో జరుగుతోంది. ప్రపంచమంతా కోవిడ్ వైరస్ భయంతో వణికిపోతుంటే యూనిట్ భయపడకుండా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని తెలిసింది. తాజాగా మరో థ్రిల్లింగ్ అప్ డేట్ లీకైపోయింది. దాని ప్రకారం ఇందులో హీరోయిన్ పూజాహెగ్డే యువరాణి పాత్రను పోషిస్తోందని సమాచారం.

యూరోప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో పూజా యువరాణి అయితే మరి ప్రభాస్ పాత్ర ఏంటి అనే అనుమానం రావడం సహజం. ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఇన్ సైడ్ టాక్ ప్రకారం హీరో యుద్ధవిద్యలో ఆరితేరిన చిత్రకారుడిగా రెండు షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడట. అయితే ఇది పునర్జన్మల నేపథ్యంలో ఉంటుందా లేక రంగస్థలం టైపులో ఒక కాలానికి సంబంధించినదా అనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. గోపీచంద్ తో జిల్ తీసిన రాధాకృష్ణ నాలుగేళ్లు ఈ స్క్రిప్ట్ మీద పనిచేసి ప్రభాస్ కోసమే వెయిట్ చేశాడు.

సాహో ఫలితం నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ కు నార్త్ మార్కెట్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. అది అక్కడ కమర్షియల్ గా హిట్ కావడంతో ఇప్పుడీ సినిమాకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఊహించని మలుపులతో ప్రభాస్ ఇంతవరకు చేయని యాక్షన్ డ్రామాతో ఇది రూపొందిస్తున్నట్టు వినికిడి. ప్రభాస్ కూడా దానికి తగ్గట్టే బాగా కష్టపడుతున్నాడట. ఇటీవలే ప్రకటించిన నాగ అశ్విన్ సినిమా డిసెంబర్ లో మొదలవుతుంది కాబట్టి దీన్ని ఆగష్టులోపు పూర్తి చేసి దసరాకు రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది టీమ్. అన్ని సవ్యంగా జరిగి ఎలాంటి ఆటంకాలు రాకపోతే టార్గెట్ రీచ్ కావొచ్చు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారి స్వంత బ్యానర్ గోపికృష్ణతో యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి రాధే శ్యామ్, ఓ డియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp