'టక్' వేసుకున్న 'జగదీష్' మాస్

By iDream Post Feb. 23, 2021, 05:18 pm IST
'టక్' వేసుకున్న 'జగదీష్' మాస్

న్యాచురల్ స్టార్ గా ఇటు యూత్ లోనూ అటు ఫ్యామిలీస్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న నాని కొత్త సినిమా టక్ జగదీశ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న 25వ చిత్రం వి డిజిటిల్ లో రిలీజ్ కావడమే కాక డిజాస్టర్ కొట్టడంతో దీని మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు నాని. అందులోనూ తనతో నిన్ను కోరి రూపంలో ఆల్రెడీ సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వం అభిమానుల్లో అంచనాలు పెంచింది. గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఇది కుటుంబ ప్రేక్షకులను గట్టిగానే టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఇందాకా టీజర్ ని విడుదల చేసింది టీమ్. అదెలా ఉందో చూద్దాం.

దీన్ని చాలా డిఫరెంట్ గా కట్ చేశారు. ఎలాంటి మాటలు లేకుండా కేవలం ఓ పాటను వినిపిస్తూ అల వైకుంఠపురములో క్లైమాక్స్ సాంగ్ తరహాలో ఎడిట్ చేశారు. చూచాయగా కథేంటో క్లూస్ ఇచ్చారు. అనగనగా ఓ ఊళ్ళో చిన్న కుటుంబం. వేసిన టక్కు తీయకుండా చొక్కా నలక్కుండా స్టైల్ గా ఉండే జగదీష్(నాని)కి ఓ అన్నయ్య(జగపతి బాబు)తో పాటు అందమైన కుటుంబం ఉంటుంది. ప్రియురాలు(రీతువర్మ)కూడా. అయితే పచ్చని పొలం లాంటి ఆ గ్రామంలో ప్రాణాలు తీసేందుకు వెనుకాడని ఒక దుర్మార్గుడు(డేనియల్ బాలాజీ)ఉంటాడు. మరి జగదీశ్ జీవితంలో ఏం జరిగిందనేది ఏప్రిల్ 23న థియేటర్లలో చూడాలి

నాని టక్ వేసుకున్న ఫార్మల్ లుక్ లో మంచి స్టైలిష్ గా ఉన్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే క్యారెక్టర్ లా అనిపిస్తోంది. రీతూ వర్మ క్యూట్ గా ఉంది. జగపతిబాబు రెగ్యులర్ గా చేసే విలన్ పాత్రలకు భిన్నంగా ఇందులో మంచి హోమ్లీ పాత్ర దక్కించుకున్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పాట రూపంలో వినువిందుగా ఉంది. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం అందించిన టక్ జగదీష్ లో నాజర్, నరేష్, డేనియల్ బాలాజీ, రోహిణి, రావు రమేష్, ప్రవీణ్, దేవదర్శిని తదితరులతో ఫ్రేమ్స్ కలర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. లవ్ నుంచి ఫ్యామిలీ కం యాక్షన్ డ్రామాకు షిఫ్ట్ అయిన శివ నిర్వాణ టేకింగ్ చూస్తుంటే హ్యాట్రిక్ హిట్ పడేలానే ఉంది.

Teaser Link @ http://bit.ly/3kcZiOK

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp