సాయి తేజ్ క్షేమం - రక్షకుడికి ఇబ్బంది

By iDream Post Sep. 15, 2021, 04:30 pm IST
సాయి తేజ్ క్షేమం - రక్షకుడికి ఇబ్బంది

ఇటీవలే బైక్ యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. అపోలో డాక్టర్లు ఇస్తున్న సమాచారం మేరకు ఐసియు నుంచి రేపో ఎల్లుండో రెగ్యులర్ రూమ్ కి షిఫ్ట్ చేయబోతున్నారు. కాలర్ బోన్ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తవ్వడంతో ఎలాంటి ముప్పు లేదు. ఇంకో వారం పదిరోజుల్లో తను మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి రోజు ఈ వార్త కవరేజ్ కి సంబంధించి ఓ రెండు మీడియా ఛానల్స్ చేసిన ఓవరాక్షన్ కి నెటిజెన్లు గట్టిగానే తలంటారు. నిన్న మంచు మనోజ్ మానభంగానికి గురై చనిపోయిన ఆరేళ్ళ చిన్నపాప కుటుంబాన్ని పరామర్శించాక సాయి తేజ్ ప్రమాదం గురించి అతిగా హైలైట్ చేయడం మీద ఫైర్ అయ్యాడు.

ఇదిలా ఉండగా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని 108కు ఫోన్ చేసి తన మిత్రుల సహాయంతో సాయి తేజ్ కు సపర్యలు చేసిన ఫర్హాన్ అనే యువకుడు ఇప్పుడు ప్రచారం వల్ల ఇబ్బందులు పడుతున్నాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అత్యుత్సాహంతో అబద్దాలతో తప్పుడు వీడియోలు చేయడంతో ఇప్పుడు ఇది కాస్తా తలనెప్పిగా మారింది. రామ్ చరణ్ ఖరీదైన కారు కానుకగా ఇచ్చాడని, పవన్ కళ్యాణ్ 10 లక్షల నగదు అందజేశాడని వాటిలో చెప్పడంతో నిజమని నమ్మిన అభిమానులు వాటి గురించి పోస్టులు గట్రా పెట్టేస్తూ వైరల్ చేసేస్తున్నారు. దీంతో ఫర్హాన్ నన్ను వదిలేయండి బాబు అని మొత్తుకుంటున్నాడు.

నిజానికి ఇతనికి మెగా ఫామిలీ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అంత అవసరం కూడా లేదు. సిఎంఆర్ షాపింగ్ మాల్ లో వాలెట్ పార్కింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఫర్హాన్ కి నలుగురికి మంచి చేయాలనే తప్ప వాటి ద్వారా ఏదో దక్కించుకోవాలనే మనస్తత్వం లేదు. సాయి తేజ్ కు మెలకువ వచ్చాక ఎలా స్పందిస్తాడు గౌరవిస్తాడు అనేది తర్వాతి విషయం. చిరంజీవి దాకా సైతం అసలు ఈ విషయం వెళ్లిందో లేదో కానీ ఈలోపల ఇన్నేసి గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ప్రాణాలు కాపాడుతున్న ఫర్హాన్ లాంటి యువకులకు యుట్యూబ్ ని అడ్డం పెట్టుకుని ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదు

Also Read : ఓటిటి లెక్కలు - ఆ ఒక్కటీ అడక్కు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp