టెన్షన్ మూడ్ లో షూటింగ్స్ : మళ్ళీ బంద్

By iDream Post Jun. 24, 2020, 12:15 pm IST
టెన్షన్ మూడ్ లో షూటింగ్స్ : మళ్ళీ బంద్

నిన్న ఒక ప్రముఖ ఛానల్ నిర్మిస్తున్న సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ తేలడంతో తమ తమ షూటింగ్స్ లో బిజీగా ఉన్న ఇతర దర్శక నిర్మాతలకు, నటీనటులకు, టీమ్ మెంబెర్స్ కు కొత్త టెన్షన్ మొదలయ్యింది. ప్రస్తుతానికి సదరు యాక్టర్ ఉన్న షూట్ ని ఆపేసి అందరినీ హోమ్ క్వారెంటైన్ కు పంపించేశారు. ఇప్పుడు దీని ప్రభావం ఖచ్చితంగా మిగిలినవాటి మీద పడబోతోంది. పిపిఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు,శానిటైజర్లు లాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పడిలా జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అసలే స్టార్ హీరోలు షూటింగులు మొదలుపెట్టాలా వద్దా అనే ఆలోచనతో సతమతమవుతున్నారు. ఇందాకా అధికారికంగా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులందరికి మెసేజులు వెళ్లిపోయాయి. మళ్ళీ అఫీషియల్ గా షూటింగులు బందన్న మాట.

మరోవైపు హైదరాబాద్ లో కేసుల ఉధృతి విపరీతంగా ఉంది. ఎప్పటికి తెరిపినిస్తుందో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరూ రిస్క్ చేసేందుకు రెడిగా లేరు. ఇవి చాలదన్నట్టు కొన్ని ఛానల్స్ రియాలిటీ షోల పేరుతో గుంపులుగా ఆడియెన్స్ ని తీసుకొచ్చి సెట్స్ లో కూర్చోబెడుతున్నాయి. ఎవరు ఎట్లా పోతేనేమి మాకు ప్రోగ్రామ్స్, రేటింగ్స్ ముఖ్యమనేలా ఉంది వాళ్ళ తీరు. దీనికి తోడు వీళ్ళ అత్యుత్సాహం ఏదో ముంచేలాగానూ కనపడుతోంది. మూడు రోజుల క్రితం బండ్ల గణేష్, ఇప్పుడీ సీరియల్ నటుడు ఇలా ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదు కావడం శుభపరిణామం కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు సెట్స్ పైన ఉన్న సినిమాలు రెండే. ఒకటి దర్శకుడు రవిబాబు రూపొందిస్తున్న క్రష్ కాగా రెండోది కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు డైరెక్షన్ లో తీస్తున్న సూపర్ మచ్చి. ఇవి కాకుండా చెప్పుకోదగ్గవి ఏవి నిర్మాణంలో లేవు.

ఇప్పుడీ పరిస్థితి చూస్తే ధైర్యంగా ముందుకొచ్చే వాళ్ళు కూడా ఆగిపోయేలా ఉన్నారు. కరోనా వచ్చిన నటుడి షూటింగ్ తో పాటు మిగిలినవన్నీ ఆపేయడం మంచి పనే. చాలా చోట్ల గైడ్ లైన్స్ సరిగా పాటించడం లేదని రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడీ పరిణామాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. కరోనా వైరస్ ఫలానా పద్ధతిలోనే విస్తరిస్తుందని చెప్పడానికి లేదు కాబట్టి స్పాట్ లో ప్రతి ఒక్కరికి రిస్క్ ఉంటుంది. అందులోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాక్టర్స్ ఉంటారు కనక వాళ్ళ కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై చేయడం అంత సులభం కాదు. అయితే ఇప్పుడు ఇంకెన్ని రోజులు షూటింగులకు మళ్ళీ బ్రేకులు పడతాయో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp