బాక్సాఫీస్ సందడిలో మనమే ఆదర్శం

By iDream Post Aug. 12, 2021, 06:45 pm IST
బాక్సాఫీస్ సందడిలో మనమే ఆదర్శం

కరోనా లాక్ డౌన్ వల్ల తీవ్రంగా ప్రభావితం చెందిన పరిశ్రమల్లో సినిమా ఒకటి. థియేటర్లతో మొదలుపెట్టి నిర్మాణ సంస్థల పెట్టుబడి వ్యవహారాల దాకా అన్నీ అందరూ బాధితులుగా మారారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించి కోలుకునే విషయంలో టాలీవుడ్ నెంబర్ వన్ గా నిలుస్తోంది. ఇప్పటిదాకా థియేటర్లు తెరిచాక కేవలం రెండు వారాల్లో పదికి పైగా సినిమాలు రిలీజయ్యాయి. ఈ శుక్ర శనివారాలు మరో తొమ్మిది రాబోతున్నాయి. నెక్స్ట్ వీక్ కి అయిదారు ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఈ స్థాయిలో రిలీజులు ఇంకే భాషలో లేవన్నది వాస్తవం. బాలీవుడ్ కూడా ఇప్పటిదాకా ముందడుగు వేయలేదు.

హిట్టా ఫ్లాపా చిన్నవా పెద్దవా అనేది పక్కనపెడితే అసలు ఈ మాత్రం చొరవ తీసుకోవడం ఎగ్జిబిషన్ రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎస్ఆర్ కళ్యాణ మండపం వసూళ్లు నమ్మకాన్ని కలిగిస్తే, పనులు చాలా బ్యాలన్స్ ఉన్న పాగల్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అయిదు రోజుల వ్యవధిలో విడుదలకు రెడీ అయిపోయింది. మిగిలిన నిర్మాతలు కూడా ఇదే బాట పడుతున్నారు. దీని వల్ల వందల కోట్ల కలెక్షన్లు వచ్చేస్తాయని కాదు. కనీసం మిగిలినవాళ్లకు ధైర్యం వస్తుంది. పక్కనే ఉన్న శాండల్ వుడ్ లో కనీసం చిన్న బడ్జెట్ మూవీ రిలీజ్ చేసేందుకు కూడా సాహసించడం లేదు. అక్కడి థియేటర్లు సైతం మనల్నే నమ్ముకున్నాయి

ఇక కోలీవుడ్ సంగతి సరేసరి. పోటాపోటీగా ఓటిటి రిలీజూలు జరుగుతున్నాయి కానీ థియేటర్ల సంగతి దేవుడెరుగు. తెరిచిన వాటికి కంటెంట్ లేక ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏ రకంగా చూసుకున్నా టాలీవడ్ అందరికీ స్ఫూర్తి ఇస్తోందన్నది వాస్తవం. ఇక్కడి రెస్పాన్స్ చూసే మెల్లగా ఇతర బాషల నిర్మాతలు కూడా రిలీజ్ దిశగా అడుగులు వేస్తున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నప్పుడే క్రాక్ లాంటి హిట్లకు ముప్పై కోట్లకు పైగా వసూళ్లు ఇచ్చిన సినీ హృదయం మన ప్రేక్షకులది. అందుకే ఎవరికీ సాధ్యం కానంత వేగంగా మన పరిశ్రమ కోలుకుంటున్న మాట వాస్తవం. ఇది ఇలాగే కొనసాగాలి. బాక్సాఫీస్ కళకళలాడాలి

Also Read : ఒక్క సినిమాకు 250 కోట్లా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp