TNR comment on "కొత్తపోరడు"

By TNR Jun. 05, 2020, 10:05 pm IST
TNR comment on "కొత్తపోరడు"

ఈ కొత్తపోరడు వెబ్ సీరీస్ మీద నాకెందుకో చిన్న చూపు ఉండేది.

దీన్ని ఇంత ఆలస్యంగా చూడటానికి గల కారణం... ఆ చిన్నచూపే.

అందుకే ఇది రిలీజైన టైం లో ఫస్ట్ ఎపిసోడ్ ఒక పది నిమిషాలు చూసి చిరాకొచ్చి ఆపేశా.

కారణం...అందులో ఉండే తెలంగాణా యాస & బూతులు.

"అబ్బ ...ప్రతీవోడు ఈ తెలంగాణా యాసను పట్టుకోవడం,నాలుగు బూతు మాటలు పెట్టడం దాన్నే వెబ్ సీరీస్ అనడం కామనయిపోయింది" అనుకున్నా…..రెండు మూడు బూతులు కూడా మనసులో తిట్టుకున్నా.

బేసిక్ గా నాకు వెబ్ సీరీస్ లో బూతులు ఉంటే చిరాకు.

ఒక స్థాయి వరకు ఓకె…. నిజంగా ఆ కథావాతావరణానికి అవసరం అనుకుంటే కొంత వరకు ఖచ్చితంగా ఓకె.

కానీ….వెబ్ సీరీస్ అంటేనే ఖచ్చితంగా బూతులే మాట్లాడాలి,ఖచ్చితంగా కొంత అడల్ట్ కంటెంట్ ఉండాలి అనే మైండ్ సెట్ కి నేను విరుద్ధం.

సో ...అలా ఈ "కొత్తపోరడు" అనే వెబ్ సీరీస్ రిలీజైన టైంలో మొదటి ఎపిసోడ్ ఒక పది నిమిషాలు చూసి ఆపేశా..

మధ్యలో కొంతమంది డైరెక్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో “కొత్తపోరడు" బాగుంది చూడండి అని సజెస్ట్ చేశారు.

బట్ అప్పుడు కూడా అర్జెంట్ గా చూడాలీ అనిపించేంత మూడ్ పెద్దగా రాలేదు.

చూద్దాం చూద్దాం అనుకుంటూనే అలా కాలం గడిచిపోయింది.

బట్ కొద్దిరోజుల క్రితం అన్వేష్ కాల్ చేశాడు.

అన్వేష్ అంటే ...ఈ వెబ్ సీరీస్ లో టైటిల్ రోల్ ప్లే చేసిన యాక్టర్.

అండ్ డైరెక్టర్ కూడా అతనే…

డైరెక్టర్ కూడా తనే అనే విషయం తను ఫోన్ లో చెప్పాకే తెలిసింది నాకు.

అప్పటిదాకా తను జస్ట్ ఒక యాక్టర్ అని మాత్రమే అనుకున్నాను.

తను యాక్ట్ చేసిన "మల్లేశం" సినిమాలో నేను కూడా యాక్ట్ చేసినప్పటికీ అన్వేష్ తో పెద్ద పరిచయం ఏర్పడలేదు.

సో...తను కాల్ చేసి "అన్నా …”కొత్తపోరడు" చూశినవా?' అని అడిగాడు.

నాకు నచ్చలేదు అంటే ఎక్కడ ఫీల్ అవుతాడో అని "చూడలేదు అన్వేష్...ఒక పది నిమిషాలు చూసి..వర్క్ ఉండి ఆపేశా...మళ్ళీ కంటిన్యూ చెయ్యలేకపోయా" అని అబద్ధం చెప్పేశా...

"ఒకసారి చూడండన్నా...మీ జెన్యూన్ పోస్టులన్నా,రివ్యూస్ అన్నా మాకు చాలా ఇష్టం…అనవసరంగా మీరు ఎవరినీ అభినందించరు….నిజానికి మీరు ఈ సోషల్ మీడియాలో ఏ ఒక్క గ్రూప్ కి చెందరు….మీదొక సెపరేట్ స్టయిల్…

మీరు ఈ వెబ్ సీరీస్ చూసి మీ జెన్యూన్ ఫీడ్ బ్యాక్ ఇస్తే చాలా సంతోషిస్తాను” అని చెప్పాడు.

తప్పకుండా అన్వేష్ అని చెప్పా.

నిజం చెప్పాలంటే అప్పటికీ కూడా నాకు చూడాలన్న మూడ్ రాలేదు.

మెల్లగా ఒక రెండు రోజుల తర్వాత చూడటం ప్రారంభించా...

నిదానంగా రెండు రోజుల్లో ఫినిష్ చేశా…

మొత్తం చూసిన వెంటనే ఎగ్సైటింగ్ గా అన్వేష్ కి కాల్ చేసి మాట్లాడి చాలా అభినందించా..

మంచి చెడు అన్నీ మాట్లాడా..

నీ మీద ,జగదీష్ మీద నా గౌరవం పదిరెట్లు పెరిగింది అన్వేష్ అని చెప్పా...

సాధారణంగా ఏదైనా ఫిల్మ్ చూడమని ఆ టీం కి సంబంధించిన వాళ్ళెవరైనా నాకు కాల్ చేసి చెప్పినప్పుడు ఖచ్చితంగా చూస్తాను.

చూశాక నాకు నచ్చకపోతే సైలెంట్ గా ఉంటాను.

మళ్ళీ వాళ్ళెవరైనా ఫీడ్ బ్యాక్ గురించి తిరిగి కాల్ చేస్తే మాత్రం నాకు అనిపించింది మొహమాటం లేకుండా చెప్పడం నా అలవాటు.

నచ్చితే మాత్రం నా ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా,నా వీడియోల ద్వారా చెప్పడమే నాకు వృత్తికరమైన సంతృప్తినిస్తుంది.

అలా...అన్వేష్ తో ఫోన్ లో ఎన్ని చెప్పినప్పటికీ ఇంకా చాలా చెప్పాల్సి ఉందని ఇలా పోస్ట్ పెడుతున్నాను.

నిజంగా చాలా థ్యాంక్స్ అన్వేష్...నువ్వు గనక నాకు కాల్ చేసి చెప్పకపోయి ఉంటే ఇంత కొత్త ఎమోషన్ ని నేను మిస్ అయ్యే వాన్ని.

ఒకవేళ చూసినా ఏ ఆరేడు నెలలకు చూసేవాన్నేమో…

అన్వేష్...నువు దగ్గరుంటే కరోనా అని కూడా చూడకుండా కౌగిలించుకోవాలని ఉంది...😊

అంత గొప్పగా చేశావ్…..డైరెక్షన్ & యాక్టింగ్.

ఎంతో విజన్ ఉంటే తప్ప ఈ విజువలైజేషన్ & ఈ సీన్స్ సాధ్యం కాదు…

డైరెక్టర్ అన్వేష్ కి ఒక కొత్త విజన్ ఉంది.

నా దృష్టిలో డైరెక్షన్ అంటే జస్ట్ గొప్ప షాట్స్ కంపోజ్ చెయ్యడం కాదు..రిచ్ నెస్ చూపించడం మాత్రమే కాదు.

సినిమా అంతా గొప్ప మూడ్ క్యారీ చెయ్యడం.

ఆడియన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యే అలాంటి ఒక మంచి మూడ్ ఈ వెబ్ సీరీస్ అంతా క్యారీ అవుతుంది.

ఆ లెక్కకొస్తే ఈ వెబ్ సీరీస్ లో పెద్దగా గొప్ప షాట్ కంపోజిషన్సే ఉండవు.

షాట్స్ విషయం లో చాలా చోట్ల రూల్స్ కూడా బ్రేక్ చేసిన వెబ్ సీరీస్ ఇది.

చాలా సీన్స్ లో మెయిన్ ఆర్టిస్టులు ఓవర్ లాప్ అవుతారు...ఉదాహరణకు బార్ సీన్ లో హీరో మాట్లాడుతున్నప్పుడు..

చాలా సీన్స్ లో ఆర్టిస్టుల యాక్షన్ కంటిన్యుటీ లేకుండా షాట్ కటింగ్ ఉంటుంది.

ఇదంతా వాళ్ళకు తెలియక కాదు,కొత్తదనం కోసం కావాలనే అలా చూసీ చూడనట్టు వదిలేశారని అనుకుంటున్నాను.

ఫైనల్ గా మూడ్ క్యారీ అవడమే ఇంపార్టెంట్…..

అది క్యారీ అయింది.

మీరు ఏ సీన్ అయినా తీసుకోండి…

దాంట్లో ఒక కొత్త విషయం ఏదో ఉంటుంది…

కొత్తగా ప్రెజెంట్ చేసిన తీరేదో ఉంటుంది.

ప్రతీ షాట్ లో ఒక కొత్త ఎక్స్ ప్రెషన్ ఉంటుంది.

నాకయితే రెండోసారి చూడాలనిపించిన వెబ్ సీరీస్ ఈ కొత్తపోరడు
--------------------
PERFORMENCES
---------------------
ఆ యాక్టర్స్ ని ఎక్కడ నుండి తీసుకొచ్చారో గానీ....వాళ్ళు నటించారు అనేకంటే జీవించారు...జస్ట్ బిహేవ్ చేశారు.

అతి తక్కువ సార్లు మనల్ని ఒక సినిమాలోని క్యారెక్టర్స్,సీన్స్ హాంట్ చేస్తుంటాయ్....

అలాంటి అతితక్కువ సార్లలో ఈ “కొత్తపోరడు" క్యారెక్టర్స్,సీన్స్ ఉంటాయ్.

చాలా సార్లు వింటుంటాం ... నటులు కాదు పాత్రలు కనపడ్డాయ్ అని.

అలా చాలా రోజుల తర్వాత కేవలం ప్రేక్షకులకు పాత్రలు మాత్రమే కనపడ్డ ఫిల్మ్.

సమాజంలో జరుగుతున్న చాలా విషయాలను ఎవరికీ తెలియకుండా కెమెరా పెట్టి షూట్ చేశామా అన్నంత రియలిస్ట్ గా ఉంటుంది ఇందులోని నటీనటుల నటన.

వాళ్ళ నటన ఎన్ హాన్స్ అవడానికి సింక్ సౌండ్ అన్నది ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది.

"కొత్తపోరడు" & “MASTI'S” అంత పర్ ఫెక్ట్ కాస్టింగ్ ఈ మధ్యకాలం లో ముఖ్యంగా తెలుగు వెబ్ సీరీస్ లో నేనయితే చూడలేదు.

మనం ఏదైనా వెబ్ సీరీస్ చూస్తుంటే అందులో ఉన్న హీరోనో,హీరోయినో,లేదా విలనో...ఇలా లిమిటెడ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ మనకి బాగా నచ్చుతుంది.

బట్ వెబ్ సీరీస్ లో ఉన్న ఆర్టిస్టులందరి నుండి బెస్ట్ పర్ఫార్మెన్సెస్, బెస్ట్ ఎమోషన్స్ ఆస్వాదించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరెండు వెబ్ సీరీస్ లు చూడండి.

“MASTI'S" గురించి ఇంకొక పోస్ట్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం.

ఇక "కొత్తపోరడు"లో పర్టిక్యులర్ గా కొంత మంది ఆర్టిస్టుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటే గనక హీరోగా చేసిన అన్వేష్ ఎలాగూ చాలా బాగా చేశాడు.

చాలా ఈజ్ ఉన్న నటుడు.

రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బిజీ అయ్యే నటుడు.

నటన ఎలాగూ నచ్చింది...డైరెక్షన్ అంతకన్నా ఎక్కువ నచ్చింది.

"రెండిట్లో ఒకమార్కు దేనికి ఎక్కువేస్తారు?" అంటే మాత్రం ఖచ్చితంగా అతని డైరెక్షన్ కే వేస్తాను.

హీరోయిన్ గా చేసిన సాయి ప్రసన్న గొప్ప అందగత్తె కాకపోయినా అద్భుతమైన హావభావాలు చూపించింది.

చాలా ఎక్స్ప్రెసివ్ ...

సినిమా ఆఫీస్ లో టీకప్పులందించే అమ్మాయిగా జాయిన్ అయినప్పుడు,అలా అందించే క్రమంలో ఆర్టిస్టుల వర్క్ షాప్ లో వాళ్ళ నటనని గమనించి కిచెన్ లోకి వెళ్ళి తనుకూడా దొంగచాటుగా యాక్టింగ్ ప్రాక్టీస్ చెయ్యడం బాగుంటుంది.

హీరోయిన్ అయ్యాక హీరోతో గొడవయినప్పుడు కెమెరా ముందు సరదాగా యాక్ట్ చేయాల్సిన సీన్ లో అలా యాక్ట్ చేస్తూనే
ఆఫ్ ద కెమెరా తన కోపాన్ని ప్రదర్శించే రెండు వేరియేషన్స్ ని బాగా చూపించింది.

హీరో మెయిన్ ఫ్రెండ్ గా చేసిన జగదీష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.

ముఖ్యంగా తన లవ్ ఫెయిల్ అయినప్పుడు హీరోతో బీర్ తాగుతూ చేసిన నటన గుర్తుండిపోయేటట్టుగా ఉంటుంది.

హీరో తండ్రి ఇస్తారయ్యగా చేసిన సుధాకర్ రెడ్డి,తల్లిగా చేసిన పద్మ ఇద్దరూ కూడా పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.

ఒక పల్లెటూల్లో కొడుకు కోసం, కుటుంబం కోసం ఆరాటపడే దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులు ఇలాగే ఉంటారు అన్నంత రియలిస్టిక్ గా ఉన్నారు.

గుండుతో నెగటివ్ పాత్రలో చేసిన 'రాజ్ తిరన్ దాస్' రూపం లో ఇండస్ట్రీకి ఒక మంచి ఈజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికాడు.

నవాజుద్దిన్ సిద్దిఖీ,ఇర్ఫాన్ ఖాన్ తరహా నటుడు…. రానున్న రోజుల్లో కన్ ఫర్మ్ గా బిజీ అయ్యే నటుడు.

డైరెక్టర్ & ప్రొడ్యూసర్స్ పాత్రలు చేసిన శ్రీపాల్ మాచర్ల & క్యాంప్ శశి లు చాలా చాలా రియలిస్టిక్ గా బిహేవ్ చేశారు.

హీరో ఫ్రెండ్ గా ఆటో జానీ క్యారెక్టర్ చేసిన ఇంకొక అబ్బాయి కూడా బాగా చేశాడు.

అతని పేరు నాకు తెలీదు….అతని డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంది.

హీరో ఫస్ట్ లవర్ నగ్మా క్యారెక్టర్ బాగుంది.
--------------
LOCATIONS
--------------
చాలా వాస్తవికంగా కనపడే లొకేషన్స్.

ఈ వెబ్ సీరీస్ లో ఉన్న ప్రతీ లొకేషన్ ఒక ఎమోషన్ ని పలికిస్తుంది.

పల్లెటూరు మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్ప,ఎంతో గ్రౌండ్ వర్క్ ,రీసెర్చ్ చేస్తే తప్ప ఇలా సీన్ లో ఉన్న ఎమోషన్ కి తగ్గట్టుగా లోకేషన్ ని ఎంచుకోవడం అనేది జరగని పని.

-----------
MUSIC
-----------
ఇప్పుడు తెలుగులో అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో నేను చూసిన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ స్మరన్ సాయి & సయ్యద్ కమ్రన్.

ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఉండిఉండొచ్చు…. బహుశా నేను వినకపోయి ఉండొచ్చు.

బట్ నేను విన్న వాళ్ళలో వీళ్ళు బెస్ట్ అప్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పడమే నా ఉద్దేశం.

"సయ్యద్ కమ్రన్" గురించి వేరే సందర్భం లో ఎప్పుడయినా మాట్లాడుకుందాం.

ప్రస్తుతానికి "కొత్తపోరడు" మ్యూజిక్ డైరెక్టర్ స్మరన్ సాయి గురించి మాట్లాడుకుందాం.

ఈమధ్య తెలుగు వెబ్ సీరీస్ లో నేను విన్న బెస్ట్ సౌండింగ్ "కొత్తపోరడు" & "మస్తిస్".

ఆ రెండింటి సౌండింగ్ విన్న తర్వాత ఎవరబ్బా ఈ రెండింటికి మ్యూజిక్ అని పేరు చూస్తే రెండింటికీ స్మరన్ సాయి.

సౌండింగ్ చాలా కొత్తగా ఉంటుంది.

భవిష్యత్తులో ఖచ్చితంగా బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయ్.
---------------
DIALOGUES
--------------
వెబ్ సీరీస్ లో అవసరానికి మించిన బూతులని నేనయితే వ్యతిరేకిస్తాను.

రూరల్ కంటెంట్ కాబట్టి కొంత వరకు ఈ "కొత్తపోరడు”ని వదిలేయొచ్చేమోగానీ ,లేదంటే ఇందులో ఉన్న బూతు కంటెంట్ ని ఖచ్చితంగా నేను కూడా వ్యతిరేకిస్తాను.

ఆ బూతులు లేకపోతే ఈ సీరీస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేదని నా అభిప్రాయం.

ఇది గొప్ప కంటెంట్ అయినప్పటికీ బూతులు,అడల్ట్ కంటెంట్ కొంచెం తగ్గించి ఉంటే మాల్గుడీ డేస్ అంత గొప్ప పేరొచ్చే సీరీస్ అయిఉండేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

అసలు ఏమాత్రం బూతులు వాడకుండా చెప్పిన డైలాగ్స్ ఇందులో చాలా ఫన్ క్రియేట్ చేస్తాయ్...

ఉదాహరణకి ... సడెన్ గా ఆలోచిస్తే నాకు గుర్తొచ్చినవి …

1. డైరెక్టర్ గురించి అసిస్తెంట్ డైరెక్టర్ ఇంకొక వ్యక్తికి చెబుతుంటాడు...

"అన్నకు వర్షం ల షూటింగ్ జెయ్యాలని మస్త్ కోరిక..

కాని ఏం జేస్తం...ఆ వర్షం ఉన్నప్పుడేమో అన్న దగ్గర పైసలుండవ్.

అన్న దగ్గర పైసలున్నప్పుడేమో ఆ వర్షం రాదు..

2. భోజనం చేస్తున్న ఇస్తారయ్యతో...భార్య అంటుంది..

భార్య : ఉప్పు కలిశిందా...?

ఇస్తారయ్య : ఆ కలిశింది...నిన్ను అడిగినట్టు జెప్పుమంది..

3.ఆ జెనరేటరేమో నువు మందు దాగినట్టు తాగుతుంది డీజిల్

4. బార్ కి వచ్చిన జానీ భాయ్ తో వెయిటర్ : ఏంది జానీ భాయ్ ...చాల రోజుల తర్వాత ఒచ్చినవ్..?

జానీ : నేను నీలెక్క వెయిటర్ నారా ...ఈన్నే ఉండుటానికి....ఈనికి పని తక్కువ మాటలెక్కువ…

ఇలాంటి డైలాగ్స్ ఈ ఫిల్మ్ లో బోలెడు.

ఎమోషనల్ డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయ్.

అవి ఫిల్మ్ లో వింటేనే బాగుంటుంది.

ప్రతీ సీన్ లో ఒక బ్యూటీ ఉంటుంది...ఒక కొత్తదనం ఉంటుంది.

ప్రతీ సీన్ లో టచింగ్ ఎమోషన్ ఉంటుంది...ఒక మీనింగ్ ఫుల్ ఫినిషింగ్ ఉంటుంది..

అంత గొప్పగా డైరెక్టర్ ఆలోచించినప్పుడు ఈ బూతులు & అడల్ట్ కంటెంట్ పెట్టి కొంత మంది ఆడియన్స్ కి మాత్రం దూరమవ్వడం ఎందుకు అన్నది మాత్రమే నా బాధ.

బూతులున్న కంటెంట్ కి ఖచ్చితంగా చాలా మంది ఆడియన్స్ ఎట్రాక్ట్ అవుతారేమో...

బట్ బూతులు లేని గొప్ప కంటెంట్ కి అందరూ ఎట్రాక్ట్ అవుతారు.

"SIN & MASTI'S"లాంటి వెబ్ సీరీస్ లకి కథే అలాంటి పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది కాబట్టి వాటికి ఎలాగూ తప్పదు...

కానీ దీనికి ఏం అవసం అన్నదే నా ప్రశ్న...

బూతులు లేకపోయి ఉంటే ఈ "కొత్తపోరడు" లాంటి గొప్ప కంటెంట్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేది కదా అన్నదే నా ఆవేదన ..

మే బి ఐ యాం రాంగ్ …
------
END
------
ఇక చివరగా....ఇది సినిమాగా వచ్చి ఉంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అయి ఉండేదేమో అనిపించింది.

మొదట ఇది సినిమాగానే చేద్దాం అనుకున్నారంట.

బట్ ఈ కొత్త టీం ని చూసి ఎవరు ముందుకురాలేదని విన్నాను.

Aha అనే యాప్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వెబ్ సీరీస్ తెలుసు.

సినిమాగా రిలీజ్ అయ్యి ఉంటే ఇది అందరికీ రీచ్ అయ్యేది,అందరి అప్రిసియేషన్ పొంది ఉండేది.

ఇప్పటికైనా దీన్ని ఒక సినిమా లెంత్ లో కట్ చేసి సాటిలైట్ ఛానల్స్ లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

[ అఫ్ కోర్స్ బూతులు & అడల్ట్ కంటెంట్ కట్ చేసి ]

ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న వెబ్ సీరీస్ ఈ కొత్తపోరడు.

Aha యాప్ లో ఉంది...చూడని వాళ్ళు చూసేయండి.
———————————————
[ ఇంకెవరి గురించైనా,ఇంకే టాపిక్ గురించైనా చెప్పడం మర్చిపోయి ఉంటే క్షమించగలరు.

మళ్ళీ ఒక మంచి వెబ్ సీరీస్ కామెంట్ తో కలుద్దాం.. TNR ]

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp