Tips : తెలుగు సినిమా సంగీతానికి డిమాండ్ అలాంటిది

By iDream Post Jan. 13, 2022, 12:51 pm IST
Tips : తెలుగు సినిమా సంగీతానికి డిమాండ్ అలాంటిది

ఒకప్పుడు సినిమా సంగీతం సక్సెస్ ని ఆడియో సేల్స్ లో కొలిచేవారు. ఎన్టీఆర్ కాలంలో గ్రామ్ ఫోన్ రికార్డులు ఆ తర్వాత చిరంజీవి హయాంలో ఆడియో క్యాసెట్లు ఆపై మహేష్ బాబు జమానా వచ్చాక సిడిలు ఇలా కౌంట్ ప్రామాణికంగా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగాక ఇవన్నీ కనుమరుగయ్యాయి. యూట్యూబ్ వ్యూస్ వచ్చి చేరాయి. తర్వాత రకరకాల యాప్స్ పాటలను షేర్ చేసుకుని వాటి ప్లాట్ ఫార్మ్స్ మీద వచ్చే వ్యూస్ ని బట్టి హక్కులు కొన్నవాళ్లకు రెవిన్యూ షేర్ చేయడం మొదలుపెట్టాయి. కానీ ఇప్పుడు లెక్క ఎంతనేది బయటికి రావడం లేదు. మిలియన్ల వ్యూస్ అనే నెంబర్ తప్ప ఎంత మొత్తం వసూలవుతోందనేది బయటికి చెప్పడం లేదు.

ఒక్కటి మాత్రం నిజం. క్యాసెట్లు సిడిలు కాలగర్భంలో కలిసిపోయినా ఆన్ లైన్ ని సైతం ఆదాయ వనరుగా మార్చుకున్నాయి కంపెనీలు. అందులోనూ తెలుగు పాటలకు ఎక్కడ లేని డిమాండ్ పెరుగుతోంది. గత ఏడాది అల వైకుంఠపురములో చార్ట్ బస్టర్ అయ్యాక మన ఆల్బమ్స్ ని కొనేందుకు మ్యూజిక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికీ ఆదిత్య మ్యూజిక్, మాంగో లాంటి సంస్థలు డామినేషన్ లో ఉండగా తాజాగా ఉత్తరాది కార్పొ రేట్ బ్రాండ్ లు ఇక్కడి మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ కు చెందిన టిప్స్ సంస్థ పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు హక్కులను కొనుగోలు చేయడం ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇదొక్కటే కాదు గుణశేఖర్ సమంతా కాంబోలో రూపొందిన శాకుంతలం కూడా టిప్స్ ఖాతాలోకి చేరింది. టిప్స్ చరిత్ర దశాబ్దాల నాటిది. హిందీ పాటలు రెగ్యులర్ గా వినేవాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క హిందీ సాంగ్స్ తోనే యాభై మిలియన్ల సబ్స్క్రైబర్స్ కు దగ్గరగా ఉంది వీళ్ళ ఛానల్. 90వ దశకంలో రిలీజైన దాదాపు ప్రతి బ్లాక్ బస్టర్ ఆడియో టిప్స్ నుంచే వచ్చింది. హెచ్ఎంవి లాంటి దిగ్గజాన్ని సైతం వెనక్కు నెట్టే స్థాయికి చేరుకుంది. ఆ టైంలో కొన్ని పాత తెలుగు ఆల్బమ్స్ రిలీజ్ చేసినా ఒక భారీ తెలుగు స్ట్రెయిట్ చిత్రాన్ని కొనుగోలు చేయడం మాత్రం ఇదే మొదటిసారి. కోట్ల రూపాయల ఆదాయం డిజిటిల్ రూపంలో వస్తున్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు. టిప్స్ చేస్తోంది ఇదే

Also Read : Bollywood : ఈ విషయంలో బాలీవుడ్డే ముందుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp