మహేష్ కెరీర్లో ఇది నాలుగోసారే

By iDream Post Jun. 21, 2020, 02:12 pm IST
మహేష్ కెరీర్లో ఇది నాలుగోసారే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే సర్కారు వారి పాట త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కరోనా కేసులు ఒక కొలిక్కి వచ్చాక డేట్ ప్రకటించబోతున్నారు. వైరస్ కు మందు వచ్చేసిందనే ప్రకటన ఇండస్ట్రీ వర్గాల్లో ఆనందాన్ని నింపుతోంది. పూర్తిగా అందుబాటులోకి రాకపోయినా కనీసం ఒక ముందడుగు పడిందన్న సంతోషం సామాన్య ప్రజల్లోనూ ఉంది. ఇదిలా ఉండగా సర్కారు వారి పాటలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్సయిన సంగతి తెలిసిందే. మరో ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం ఇందులో మరో బ్యూటీకి కూడా ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ఆ అమ్మడిని ఫైనల్ చేసే పనిలో దర్శకుఢు పరశురామ్ బిజీగా ఉన్నట్టు తెలిసింది.

ఎవరనే పేర్లు బయటికి రాలేదు కానీ క్రేజ్ ఉన్న భామనే తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా చేసిన 26 సినిమాల్లో మహేష్ ఇద్దరు హీరోయిన్లతో చేసింది కేవలం మూడు సార్లే. యువరాజులో సిమ్రాన్-సాక్షి శివానంద్ చేశారు. టక్కరి దొంగలో లీసారే-బిపాసబసు ఆడిపాడారు. బ్రహ్మోత్సవంలో సమంతా, కాజల్ అగర్వాల్ నటించారు. ఇవి మినహాయించి మిగిలిన 23 సినిమాలు సింగల్ హీరోయిన్లు ఉన్న కథ. మళ్ళీ ఇప్పుడు సర్కారు వారి పాటతో డబుల్ జోడిని చేయబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. పైన చెప్పిన మూడు బ్లాక్ బస్టర్స్ కాదు. ఒక యావరేజ్, ఒక ఫ్లాపు, ఒక డిజాస్టర్ ఉన్నాయి. సో ఈ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ పరశురామ్ ఏదో మేజిక్ చేసేలా ఉన్నాడు.

తమన్ సంగీతం అందించే సర్కారు వారి పాటలో ప్రిన్స్ అవుట్ అండ్ అవుట్ మాస్ పాత్రలో కనిపించబోతున్నట్టు వినికిడి. ప్రభుత్వ వేలం పాటల్లో ఉపయోగించే ఊత పదాన్ని తీసుకుని ఇలా టైటిల్ గా పెట్టడం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసి ఉంటే సంక్రాంతి విడుదలకు ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడా అవకాశం లేదు. మూడు నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట బడ్జెట్ ఎంతో బయటికి చెప్పడం లేదు. విదేశాల్లో చిత్రీకరణ లేకుండా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేశారట. సరిలేరు నీకెవ్వరుతో మొన్న జనవరిలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మహేష్ ని పోకిరి, ఒక్కడు రేంజ్ మసాలా ఎంటర్ టైనర్ లో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి సర్కారు వారి పాటైనా అది నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp