Third Wave : మూడో వేవ్ ఆందోళనలో టాలీవుడ్

By iDream Post Nov. 29, 2021, 04:30 pm IST
Third Wave : మూడో వేవ్ ఆందోళనలో టాలీవుడ్

అంతా బాగుంది. థియేటర్లు పూర్తి స్థాయిలో తెరిచి అయిదు నెలలు దాటుతోంది. జనాలు మెల్లగా అయినా సరే హాళ్లకు రావడం అలవాటు చేసుకున్నారు. ఇంకేం పాన్ ఇండియా సినిమాలకు రూట్ క్లియరయినట్టేనని మూవీ లవర్స్ సంతోషిస్తున్న సమయంలో ఇప్పుడు కొత్తగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఆందోళనకు తెరతీస్తోంది. ఆఫ్రికా దేశంలో మొదలైన ఈ మహమ్మారి మెల్లగా ప్రపంచానికి పాకుతోంది. ఇప్పటికే జపాన్ లాంటి కంట్రీస్ విదేశీయులకు నో ఎంట్రీ బోర్డులు పెట్టేశాయి. ఎయిర్ పోర్ట్స్ లో కఠిన ఆంక్షలు విధించేశాయి. ఇండియాకు అసలు రాదు ముప్పు లేదు అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

ఒకవేళ వస్తే మాత్రం జరిగే విధ్వంసం మాములుగా ఉండదు. ఈ నేపథ్యంలో నిర్మాతలు విపరీతమైన టెన్షన్ కు గురవుతున్నారు. మళ్ళీ 50 శాతం ఆక్యుపెన్సీ లేదా సినిమా హాళ్ల తాత్కాలిక మూసివేత లాంటి పరిణామాలు ఎదురైతే ఈసారి కోలుకోవడం అంత సులభం కాదు. వందల కోట్ల పెట్టుబడులు ల్యాబులో మగ్గుతున్నాయి. నెలల తరబడి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నవి లెక్క బెట్టడం కష్టం. పరిస్థితులు చక్కబడుతున్నాయనే ఆశాభావంతో ఉన్న ఇండస్ట్రీ వర్గాలకు మీడియా కథనాలు కునుకు రానివ్వడం లేదు. ఇక్కడ చిన్నా పెద్ద సినిమా వ్యత్యాసం లేదు. అందరూ బాధితులుగా మారతారు. నష్టంలో తేడాలుంటాయి అంతే

ఇవాళ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఈ అంశం మీదే చర్చ జరగబోతోంది. ఇప్పటికిప్పుడు షాక్ ఇచ్చే చర్యలు ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంకో రెండు రోజుల్లో అఖండ ఉంది. బుకింగ్స్ ఇప్పటికే ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. టాక్ కనక బాగా వస్తే కనీసం రెండు వారాలు అంటే పుష్ప వచ్చేదాకా మంచి రన్ తో పాటు కలెక్షన్లు దక్కుతాయి. అలా కాకుండా పైన చెప్పిన భయాలు నిజమైతే మాత్రం జరిగేది ఊహకందదు. సుమారు రెండేళ్లుగా ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలు నలిగిపోతున్నాయి. మూలిగే నక్కమీద తాటిపండు కాదు బండరాయి పడినట్టు ఇక దేన్నీ తట్టుకునే నిబ్బరం వీటికి ఉండదు. ఇవి జరగకూడదు అనే కోరుకుందాం

Also Read : Acharya : అంచనాలు పెంచేసిన ఆచార్య మెగా ఫ్రేమ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp