థియేటర్ OTT తర్వాత నెక్స్ట్ ఇదే

By iDream Post Jul. 21, 2021, 01:00 pm IST
థియేటర్ OTT  తర్వాత నెక్స్ట్ ఇదే

ఒకప్పుడు కొత్త సినిమా అంటే కేవలం థియేటర్ లో తప్ప ఇంకెక్కడా చూసే అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత కొన్ని నెలలకు వీడియో క్యాసెట్ల రూపంలో ఇంట్లో వీక్షించే భాగ్యం దక్కేది. శాటిలైట్ ఛానల్స్ వచ్చాక ప్రీమియర్ల పేరుతో ఏ ఆరు నెలలకో సంవత్సరానికో దాన్ని టెలికాస్ట్ చేస్తే పనులు మానుకుని మరీ టీవీ ముందు కుటుంబాలు తిష్టవేసేవి. ఇదయ్యాక అద్దెకు విసిడిలు డివిడిలు తెచ్చుకోవడం ఇంకో పోకడ. ఓటిటిలు వచ్చాక కేవలం రెండు మూడు వారాల గ్యాప్ లోనే లేటెస్ట్ మూవీస్ ని అల్ట్రా హెచ్డి క్లారిటీతో హోమ్ థియేటర్ సౌండ్ తో ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ మొదలయ్యింది

థియేటర్ ని పక్కనపెట్టేసి ఒకే రోజు ఓటిటి శాటిలైట్ ఛానల్ లో కొత్త సినిమాని నేరుగా రిలీజ్ చేస్తారన్న మాట. సదరు యాప్ కి సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు యాడ్స్ ని భరిస్తూ టీవీలో ఆ చిత్రం చూడొచ్చు. లేదూ అనుకుంటే అది వస్తున్న యాప్ లో మన అకౌంట్ ఉంటే కనక తీరికగా ఎప్పుడు కావాలంటే అప్పుడు షో వేసుకోవచ్చు. ఇప్పుడీ ట్రెండ్ కోలీవుడ్ లో పెరుగుతోంది. విజయ్ సేతుపతి నటించిన 'తుగ్లక్ దర్బార్'ని సెప్టెంబర్ 19న ఒకే రోజు సన్ టీవీ, నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ వేయబోతున్నారు. ఐశ్వర్య రాజేష్ నటించిన 'భూమిక' కూడా త్వరలోనే విజయ్ టీవీతో పాటు అదే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఒకరంగా చెప్పాలంటే ఓటిటి శాటిలైట్ రెండు కలిసిపోయి థియేటర్ ను మరింత దెబ్బ తీసే ప్లాన్ అన్నమాట. ఓటిటిలు వచ్చాక శాటిలైట్ ప్రీమియర్లకు డిమాండ్ చాలా తగ్గిపోయింది. అందుకే ఈ పోటీని ఎదురుకోవాలంటే వాటితో యుద్ధం చేయడం కన్నా ఫ్రెండ్ షిప్ చేసుకుని ఇలా ఉభయులూ లాభ పడాలన్న నిర్ణయానికి ఛానల్స్ వచ్చేశాయి. ఇది మెల్లగా తెలుగులో మొదలైనా ఆశ్చర్యం లేదు. థియేటర్లు తెరుచుకోబోతున్న తరుణంలో ఇలాంటివి జరగడం ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా మొన్నో అగ్ర నిర్మాత చెప్పినట్టు ఓటిటి థియేటర్ శాటిలైట్ కలిసి ప్రయాణం చేసే రోజులు చాలా త్వరగా వచ్చేశాయి

Also Read: నారప్ప రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp