ది ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూ

By iDream Post Jun. 04, 2021, 03:18 pm IST
ది ఫ్యామిలీ మ్యాన్ 2 రివ్యూ

గత కొన్ని నెలలుగా ఓటిటి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని హైప్ ని తెచ్చుకున్న ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదల ఈ రోజే అయినప్పటికీ ఆడియన్స్ లో ఉన్న ఉత్సాహాన్ని, దీని చుట్టూ అల్లుకున్న వివాదాన్ని గుర్తించిన అమెజాన్ ప్రైమ్ నిన్న రాత్రి 8 గంటల నుంచే స్ట్రీమింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు కాకుండా కేవలం హిందీ వెర్షన్ కు మాత్రమే దీన్ని పరిమితం చేయడంతో డబ్బింగులు ఆశించిన ఫ్యాన్స్ నిరాశపడ్డారు. బాషరాని వాళ్ళు సబ్ టైటిల్స్ తో అయినా సరే చూసేందుకు సిద్ధపడ్డారు. సమంతా ఉండటం ఈ రేంజ్ హైప్ రావడానికి కారణం అయ్యింది. మరి ఎలా ఉందో రివ్యూలో చూసేద్దామా

కథ

ఇంటలిజెన్స్ నుంచి బ్రేక్ తీసుకుని కుటుంబం కోసం ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న శ్రీకాంత్ తివారి(మనోజ్ బాజ్ పాయ్) మనసు పాత వృత్తి మీదే ఉంటుంది. అందుకే తన ఎక్స్ కొలీగ్ జికె(శరీబ్ హష్మీ)నుంచి ఎప్పటికప్పుడు కేసుల గురించి తెలుసుకుంటూ ఉంటాడు. శ్రీలంక స్థావరంగా తమిళ వేర్పాటువాదం కోసం టెర్రరిస్టు గ్రూపును ఏర్పరిచిన భాస్కరన్(మైమ్ గోపి) తమ గుట్టుని సైనికులు పసిగట్టడంతో అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోతాడు. ఇండియాకు వచ్చిన తమ్ముడు సుబ్బు చెన్నైలో తలదాచుకోగా అతని జాడ కనిపెట్టాక పోలీసుల వల్ల అనూహ్యమైన పరిస్థితుల్లో చనిపోతాడు.

రెండు దేశాల ప్రధానులు అంతర్గత ఒప్పందంలో భాగంగానే తన సోదరుడిని హతమార్చారని భావించిన భాస్కరన్ ఆ కారణంతో పాటు తమ ఉద్దేశాన్ని ప్రపంచానికి చాటాలన్న ఉద్దేశంతో తమిళనాడులో స్లీపర్ సెల్ గా ఉన్న రాజీ(సమంతా)తో ఒక బృందాన్ని చెన్నైకి పంపిస్తాడు.ఇది తెలిసిన శ్రీకాంత్ చేస్తున్న ఉద్యోగం వదిలేసి మళ్ళీ తన బృందంతో చేరతాడు. భాస్కరన్ సహకారంతో ఇక్కడ మరో టెర్రరిస్టు అటాక్ ని ప్లాన్ చేస్తాడు పాకిస్థాన్ ఐఎస్ఐ మేజర్ సమీర్(దర్శన్ కుమార్). ఈ క్రమంలో శ్రీకాంత్ కూతురు ధృతి(ఆశ్లేష ఠాకూర్) ప్రాణం ప్రమాదంలో పడుతుంది.అక్కడినుంచి శ్రీకాంత్-రాజీల మధ్య వార్ మొదలవుతుంది. షార్ట్ గా చెప్పుకుంటే ఇదే స్టోరీ.

నటీనటులు

ఈ ఫ్యామిలీ మ్యాన్ టైటిల్ రోల్ కి పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచిన మనోజ్ బాజ్ పాయ్ మరోసారి తన టైమింగ్ తో శ్రీకాంత్ పాత్రను అద్భుతంగా నిలబెట్టాడు. చాలా సెటిల్డ్ గా ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ లేకుండా, అవసరమైన చోట తన టోన్ ని తగ్గిస్తూ పెంచుతూ బ్యాలన్స్ చేసిన తీరు మరోసారి ఇది తన కెరీర్ బెస్ట్ అని ఋజువు చేసింది. ప్రియమణికి కొంత ఎక్స్ టెన్షన్ దొరికింది కానీ చెప్పుకోదగ్గ ఏ ప్రత్యేకత లేదు. బండిట్ క్వీన్ సీమా బిశ్వాస్ ఇందులో ప్రధానిగా నటించారు. కాసేపయ్యాక గానీ గుర్తుపట్టలేం. శ్రీకాంత్ పిల్లలుగా నటించిన వేదాంత్ సిన్హా, ఆశ్లేష చాలా సహజంగా ఒదిగిపోయారు. జేకేగా చేసిన షరీబ్ మరోసారి పంచులుతో ఆకట్టుకుంటాడు.

ఇక అట్రాక్షన్ అఫ్ ది సీజన్ సమంతా అక్కినేని చాలా ఛాలెంజింగ్ గా అనిపించే రాజీగా మెప్పించిన తీరు చాలాసేపు వెంటాడుతుంది. అయితే శ్రీలంక తమిళ బాధితురాలి లుక్ తీసుకురావడం కోసం కాస్త ఎక్కువ డార్క్ టోన్ దట్టించడంతో ఇప్పటిదాకా తెల్లని బొమ్మలా చూసి అలవాటైన సమంతాను నల్లగా ఒప్పుకునేందుకు కాస్త సమయం పడుతుంది. మొద్దుబారిన మోడు లాంటి రాజీకి ఇంతకన్నా బెస్ట్ ఛాయస్ లేరా అనే ప్రశ్నను పక్కనపెడితే సామ్ మాత్రం రాజీకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. అరగల్ పెరుమాళ్, రవీంద్ర విజయ్, సన్నీ హిందూజ, శరద్ కేల్కర్, అభయ్ వర్మ తదితరులు వంకపెట్టే అవకాశం ఇవ్వలేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే మొదటి సీజన్ ని బ్లాక్ బస్టర్ చేయడంతోనే రెండో సిరీస్ తో అంచనాలు పెంచేశారు. అయితే అందులో ఎక్కడైతే ఆపారో దాన్ని ఎక్కువ సాగదీయకుండా లైట్ గా టచ్ చేసి ఇక్కడ పూర్తిగా కొత్త కథను తీసుకోవడం చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడంత తీవ్రంగా లేదు కానీ ఒకప్పుడు వేలాది ప్రాణాలను బలికోరిన ఎల్టిటిఈ టెర్రరిజాన్ని మెయిన్ థీమ్ గా తీసుకున్న రాజ్ డికెలు చాలా సున్నితమైన ఈ అంశాన్ని రేసీ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దిన తీరు ఆద్యంతం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఏడు గంటలు నిడివి ఉన్నా ఎక్కడా ఆపేద్దాం అనిపించకుండా టెంపో మైంటైన్ చేశారు.

ఈ డైరెక్ట్ డ్యూయెలో ఉన్న అతిపెద్ద పాజిటివ్ పాయింట్ క్యారెక్టరైజేషన్లు. శ్రీకాంత్ మనకు హీరోలా అనిపిస్తాడు కానీ నిజానికి ఇందులో చాలా పాత్రలకు స్పేస్ దొరికింది. అందరూ మనకు గుర్తుంటారు. ఎంత ఆఫీసర్ అయినా శ్రీకాంత్ ఓ మాములు మనిషిలా ప్రవర్తించడమే రాజ్ డీకేల తెలివికి తార్కాణం. ఇతను సగటు బాలీవుడ్ హీరోలా నేలవిడిచి సాము చేయడు. అందరి సహాయం తీసుకుంటాడు. పూర్తిగా నిస్సహాయస్థితిలో చిక్కుబడినప్పుడు ఒక రిటైర్డ్ స్లీపర్ సెల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని అందులో నుంచి బయటపడేందుకు ఏ మాత్రం మొహమాటపడడు. ఇతను బలవంతుడు కాదు సందర్భానికి తగ్గట్టు ప్రవర్తించే తెలివైనవాడు.

ఈ సబ్జెక్టు కోసం రాజ్ డీకేలు చేసిన రీసెర్చ్ స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. తమ సిరీస్ లో ఎలాంటి వివాదాలు లేవని ప్రమోషన్లలో చెప్పుకున్నారు కానీ ఇందులో కాన్సెప్ట్ ఈలం టైగర్స్ మద్దతుదారులకు జీర్ణం కానిదే. ఏ హక్కుల కోసం పోరాడుతున్నారో స్పష్టంగా చెప్పకుండా కేవలం డ్రామా కోసం వాళ్ళను ముందు వెనుక ఆలోచించకుండా బాంబులు పేల్చి మనుషులను చంపే తరహాలో చూపించడం అంత కన్విన్సింగ్ గా అనిపించకపోవచ్చు. జాన్ అబ్రహం మద్రాస్ కేఫ్, మణిరత్నం అమృతలో ఉన్న సెన్సిబిలిటీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో మిస్ అయ్యాయి. రాజీ పాత్ర వెనుక కథను ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం చేసి ఉంటే బాగుండేది.

కథ ఏదైనా వెబ్ సిరీస్ లు నిడివిని డిమాండ్ చేస్తాయి. ఏడు గంటల పాటు విసిగించకుండా ఇలా నడిపించడంలో అందరూ సక్సెస్ కాలేరు. ఓటిటిలో ఇప్పటిదాకా ఏ సీక్వెల్ కి సాధ్యం కాని రీతిలో ఫ్యామిలీ మ్యాన్ రెండో భాగం బాగుండటం రాజ్ డీకేల సక్సెస్ కి నిదర్శనం. శ్రీకాంత్ ఫ్యామిలీ సీన్స్ అక్కడక్కడా ల్యాగ్ అయ్యాయి. టైటిల్ జస్టిఫికేషన్ కోసం వీటిని పెట్టినట్టు ఉందే తప్ప అవి లేకున్నా వచ్చే నష్టమేమి లేదు. అన్ని పాత్రలకు ఇంటర్ లింక్ చేసుకున్న విధానం బాగుంది. ఇంత టాప్ స్టాండర్డ్ టాలెంట్ ఉన్న రాజ్ డీకేలు ఇలా డిజిటల్ ప్రపంచానికి పరిమితం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇందులో లోపాలు లేవని కాదు. అవీ ఉన్నాయి. కథ వర్తమానంలో జరుగుతున్నట్టు చూపించారు కనక అక్కడక్కడా కొన్ని లాజిక్స్ ని వదిలేశారు. అయినా వాటిని నీట్ గా కవర్ చేసేలా స్క్రీన్ ప్లే మేజిక్ జరిగిపోయింది. ప్రధాన మంత్రిని మహిళగా చూపించి తెలివిగా మేనేజ్ చేశారు. గెటప్, హావభావాలు కొంత మమతా బెనర్జీని పోలి ఉండటం గమనార్హం. ఫస్ట్ సీజన్ లో వదిలేసిన గ్యాస్ లీక్ ఎపిసోడ్ ని తేలికగా చూపించారు. అది మిస్ చేసుకుని నేరుగా దీన్నే చూసే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న జాగ్రత్త కాబోలు. మొత్తానికి తెలుగు వాళ్ళైన రాజ్ డీకేలు ఎవరికీ తీసిపోని మేకింగ్ టాలెంట్ తో ఫ్యామిలీ మ్యాన్ ని గట్టెక్కించారు

సచిన్ జిగర్ నేపధ్య సంగీతం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. ఎక్కువ శబ్దం లేకుండా సన్నివేశానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కెమెరాన్ ఎరిక్ బ్రయ్ సన్ ఛాయాగ్రహణంకి అన్ని మార్కులు ఇచ్చినా తక్కువే. సుమీత్ కోటియా ఎడిటింగ్ అక్కడక్కడా మొహమాటపడింది. వెబ్ సిరీస్ లకు కత్తెర వేయడం చాలా పెద్ద సవాల్. రాజ్ డీకే ప్రొడక్షన్ వేల్యూస్ భారీ బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడిన దాఖలాలు లేవు. లొకేషన్లు, సెట్లు, ఆర్ట్ వర్క్ అన్నీ ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి.

కంక్లూజన్

గంటల తరబడి నిడివి కల వెబ్ సిరీస్ లకు విసిగించకుండా సాగే కథా కథనాలు చాలా ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ఈ కోణంలో చూస్తే ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయ్యింది. మూడు గంటల లోపు సినిమా వినోదానికి అలవాటు పడిన రెగ్యులర్ ఆడియన్స్ కి ఇదంతా కొంత కొత్తగా అనిపించవచ్చు కానీ వాళ్లకు మరింత దగ్గరయ్యేందుకు ఎలాంటి కథలు రాసుకోవాలో ఫ్యామిలీ మ్యాన్ 1 & 2ని మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనోజ్ కోసమో సమంతా కోసమో కాకుండా కంటెంట్ కోసం, ఇద్దరు యువ దర్శకుల కొత్త క్రియేటివ్ టాలెంట్ కోసం ఫ్యామిలీ మ్యాన్ ని నిక్షేపంగా చూసేయొచ్చు

ఒక్క మాట : ది థ్రిల్లింగ్ మ్యాన్ 2

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp