షూటింగ్ ప్ర‌మాదంలో ఒక స్టంట్ మాస్టర్ మృతి - చేదు జ్ఞాపకం - Nostalgia

By G.R Maharshi Feb. 20, 2020, 03:22 pm IST
షూటింగ్ ప్ర‌మాదంలో ఒక స్టంట్ మాస్టర్ మృతి - చేదు జ్ఞాపకం - Nostalgia

షూటింగ్ ప్ర‌మాదంలో ద‌ర్శ‌కుడు శంకర్ గాయ‌ప‌డ్డాడ‌ని , ముగ్గురు చ‌నిపోయార‌ని తెలిసి బాధ క‌లిగింది. మూడున్న‌రేళ్ల క్రితం చ‌నిపోయిన మిత్రుడు ఉద‌య్ గుర్తొచ్చాడు.

జ‌క్క‌న్న సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రిగిన‌ప్పుడు ఉద‌య్ న‌టించాడు. క‌న్న‌డ‌లో ఆయ‌న ఫైట‌ర్‌, యాక్ట‌ర్‌, స్టంట్ మాస్ట‌ర్‌. సిక్స్ ప్యాక్ బాడీ, ఆరు అడుగుల ఎత్తు. సీన్‌లో క్రూరంగా ఉండేవాడు కానీ, మ‌నిషి చాలా సౌమ్యుడు. న‌వ్వుతూ ప‌ల‌క‌రించేవాడు.

పెద్ద‌మ్మ గుడిలో పూజ జ‌రిగిన‌ప్పుడు తెలంగాణా స్ట‌యిల్ మ‌ట‌న్ క‌ర్రీని తెగ ఇష్ట‌ప‌డ్డాడు. ఎక్కువ రోజులు ప‌రిచ‌యం లేక‌పోయినా కొంత మంది గుర్తుండిపోతారు. కానీ దుర‌దృష్టం కొద్దీ 2016, నవంబ‌ర్‌లో ఒక క‌న్న‌డ షూటింగ్‌లో ఉద‌య్ చ‌నిపోయాడు.

Read Also: శంకర్,కమల్ ఇండియన్ 2 షూటింగ్ లో తీవ్ర ప్రమాదం : 3 మృతి

ఒక హెలీకాప్ట‌ర్ నుంచి స‌ర‌స్సులోకి దూకే సీన్‌. బెంగ‌ళూరులో షూటింగ్‌. ఉద‌య్‌కి స‌రిగా ఈత రాదు. రెస్క్యూ బోట్ ఉంటుంది. ప్ర‌మాదం లేద‌ని చెప్పారు.దూకిన త‌ర్వాత స‌మ‌యానికి బోట్ రాలేదు. ఉద‌య్ చ‌నిపోయాడు. ఆయ‌న వ‌య‌సు 34 ఏళ్లు. ఇపుడు క్రేన్స్ ఉప‌యోగించి , చాలా సీన్స్ తీస్తున్నారు. వాటి మెయింటెనెన్స్ స‌రిగా ఉందో లేదో ఎవ‌రికీ తెలియ‌దు.

గ‌తంలో "బామ్మ‌గారి మాట , బంగారు మాట" షూటింగ్‌లో ఇలాగే క్రేన్ తెగి నూత‌న్‌ప్ర‌సాద్ గాయ‌ప‌డ్డాడు. జీవించినంత కాలం న‌ర‌కం అనుభ‌వించారు. శంక‌ర్ గొప్ప ద‌ర్శ‌కుడు. ఆయ‌న తొంద‌ర‌గా కోలుకోవాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp