స‌త్య‌నారాయ‌ణ మీద కోపం వ‌చ్చింది

By G.R Maharshi Jul. 25, 2020, 09:00 pm IST
స‌త్య‌నారాయ‌ణ మీద కోపం వ‌చ్చింది

చిన్న‌ప్పుడు సినిమాల్లో స‌త్య‌నారాయ‌ణ క‌నిపిస్తే "వ‌చ్చాడ్రా దొంగ నా కొడుకు" అనుకునేవాళ్లం. అప్పుడు అది తిట్టు కానీ, ఆయ‌నెంత మంచి న‌టుడో ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది. ఆయ‌న క‌నిపించ‌గానే సౌండ్ బాక్స్‌లు ప‌గిలేలా అనుమానాస్ప‌ద మ్యూజిక్ వ‌చ్చేది. వ‌చ్చాడంటే గ్యారెంటీగా చేసే ప‌నులు మూడు.

1.హీరోయిన్‌పై క‌న్నేయ‌డం

2.హీరోని క‌ష్టాలు పెట్ట‌డం

3.క్లైమాక్స్‌లో చావు దెబ్బ‌లు తిన‌డం

నాకు అర్థం కానిదేమంటే చాలా సినిమాల్లో ఆయ‌న‌కో డెన్ ఉంటుంది. పాత చెక్క పెట్టెలు, పీపాలు, డ్ర‌మ్ముల మ‌ధ్య హ్హ‌హ్హ‌ అని న‌వ్వుతుంటాడు. చేసే వ్యాపారం ఏంటో ఎవ‌రికీ తెలియ‌దు. స్మ‌గ్లింగ్‌, బ్యాంక్ దోపిడీలాంటి పెద్ద ప‌దాలు వాడుతుంటాడు. తెలివైన వాడిగా క‌నిపిస్తాడు కానీ, ఎన్టీఆర్ పిల్లిగ‌డ్డం పెట్టుకుని వ‌స్తే అది మారు వేషం అని క‌నుక్కోలేడు. అడ‌విరాముడులో ఎన్టీఆర్ అర‌బ్ సేఠ్‌గా వ‌చ్చి పిచ్చి హిందీ మాట్లాడితే అనుమాన‌మే రాదు. గంధ‌పు చెక్క‌లు స్మ‌గ్లింగ్ చేసేవాడు పెట్టుడు గ‌డ్డాన్ని క‌నుక్కోలేడు ఎన్టీఆర్ ఏ వేషంలో వ‌చ్చినా. మ‌న‌కు అంటే ఎక్కాలు స‌రిగా చెప్ప‌లేక బెత్తం దెబ్బ‌లు తినే అజ్ఞానులకు కూడా అర్థ‌మైన‌ప్పుడు స‌త్య‌నారాయ‌ణ‌కు ఆ తెలివి ఎందుకు లేక‌పోయిందా అనే ప్ర‌శ్న కొన్నాళ్లు వేధించేది.

వేట‌గాడులోనైతే మ‌రీ అన్యాయం. గ‌ట్టిగా గాలి వ‌స్తే ఊడిపోయే విగ్గు, కోర‌మీసం , గ‌ళ్ల లుంగీ క‌ట్టుకుని క‌ల్లు ముంత చేతిలో ప‌ట్టుకుని క‌ల్లు కొండ‌య్య అని ఎన్టీఆర్ వ‌స్తే ప్రాస‌లు మాట్లాడే రావుగోపాల‌రావు , మ్యాచింగ్ డ్రెస్ వేసే స‌త్య‌నారాయ‌ణ ఇద్ద‌రూ క‌నుక్కోలేరు.

నాకు బాగా కోపం వ‌చ్చింది...మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమా చూసి. ఇది 1971లో వ‌చ్చింది. మా రాయ‌దుర్గానికి 1972లో వ‌చ్చింది. మా ఊరికి ఎర్లీగా రావ‌డం అంటే After One Year. డిస్ట్రిబ్యూట‌ర్ ఆఫీస్‌లో తెగిపోయిన ముక్క‌ల్ని ఏరుకొచ్చి అతికించి అదే కొత్త సినిమా అని చూపించేవాళ్లు.

తొమ్మిదేళ్ల వ‌య‌స్సులో ఇంట్లో వాళ్ల అవ‌స‌రం లేకుండా చూసిన మొద‌టి సినిమా ఇది. వ‌య‌స్సులో పెద్ద వాళ్లైన సీనియ‌ర్ బ్యాచ్ ఈ సినిమాకు వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటే , అది క‌నిపెట్టి "అన్నా అన్నా" అని బ‌తిమ‌లాడితే ద‌య‌త‌ల‌చి తీసుకెళ్లారు.

కేబీ ప్యాలెస్‌లో మ్యాట్నీ ఆట‌. కౌంట‌ర్ల ద‌గ్గ‌ర జ‌న‌జాత‌ర‌. ఆ కౌంట‌ర్ల ప్ర‌త్యేక‌త ఏమంటే ఇరుకైన సందులో లోప‌ల‌కి వెళ్ల‌డం అసాధ్యం. ఒక‌వేళ వెళితే బ‌య‌టికి రాలేం. టికెట్ తీసుకున్న త‌ర్వాత శ‌క్తి కొద్దీ ఒక తోపు తోయాలి. ఆ దూకుడుకు అనేక మంది కింద‌ప‌డుతూ ఉంటారు. ప‌డిపోయిన వాళ్ల‌ని తొక్కుకుంటూ కొంత మంది కౌంట‌ర్‌లోకి దూరుతుంటారు.

ఈ స‌న్నివేశాన్ని మేము భ‌య‌భ్రాంతుల‌తో చూస్తూ ఉండ‌గా కొంద‌రు అమాయ‌కులైన బ్లాక్ మార్కెట‌ర్లు త‌గిలారు. 40 పైస‌ల టికెట్ భారీగా 45 పైస‌ల‌కి అమ్ముతున్నారు (బంగ్లాదేశ్ శ‌ర‌ణార్థుల‌కి సాయం చేయ‌డానికి టికెట్ ప‌ది పైస‌లు పెంచారు. అంత‌కు ముందు 30 పైస‌లే).

ఇక లాభం లేద‌నుకుని మా సీనియ‌ర్లు బ్లాక్‌లో టికెట్లు కొని, త‌ప్పి పోకుండా నా రెక్క ప‌ట్టుకుని లోప‌లికి ఈడ్చుకెళ్లారు. ఆ రోజుల్లో విశేషం ఏమంటే థియేట‌ర్లు జ‌న‌ర‌ల్ బోగీ టైప్‌. టికెట్లు ఇస్తూనే ఉంటారు. సీటు వెతుక్కోవ‌డం నీ బాధ్య‌త‌. అనేక మందిని తొక్కుకుంటూ , నేల‌పై కూర్చున్న వాళ్ల‌పై ప‌ల్టీలు కొడుతూ ఒకాయ‌న తొడ మీద‌, ఇంకొకాయ‌న మోకాలు మీద సెటిల్ అయ్యాను. అంద‌రి ప‌రిస్థితీ అదే. స‌ర్వీస్ ఆటోలాగా ఎవ‌రు ఎవ‌రి మీద కూచున్నారో తెలియ‌దు.

బీడీల పొగ‌కి ఊపిరాడ‌క భ‌య‌మేసింది. కానీ చేసేదేమీ లేదు. ఆ ప‌ద్మ వ్యూహంలోకి రావ‌డం త‌ప్ప , పోవ‌డం మ‌న వ‌ల్ల కాదు. అనేక మంది భుజాలు , త‌ల‌ల మీద న‌డిస్తే త‌ప్ప అది సాధ్యం కాదు.

లైట్లు ఆరిపోయి , గుర్రం మీద కృష్ణ క‌నిపించాడు. విజిలింగ్ సెక్ష‌న్ విజృంభించింది. క‌ష్టాల‌న్నీ మ‌రిచిపోయి కృష్ణ‌ను చూడ‌సాగాను. స‌త్య‌నారాయ‌ణ టైట్ ప్యాంట్, టోపీతో వ‌చ్చి ద‌డేల్ ద‌డేల్‌మ‌ని కాల్చాడు. భ‌య‌ప‌డ్డాను.

నాకు స‌త్య‌నారాయ‌ణ న‌చ్చ‌నిది ఏ సీన్‌లో అంటే , నాగ‌భూష‌ణం త‌న పేరు నాగ‌న్న అని కాకుండా ప‌గ‌డాల సుబ్బ‌య్య అని చెప్పుకుంటాడు. దాంతో స‌త్య‌నారాయ‌ణ అత‌న్ని విందుకు పిలుస్తాడు.
పెద్ద టేబుల్ మీద ప్లేట్‌లో ఉడికేసిన కోడిగుడ్లు, తండూరి చికెన్ ఇంకా ఏవేవో ఉంటాయి. అన్ని కోడిగుడ్లు చూడ‌డం అదే మొద‌టిసారి. కోడిగుడ్లు దొర‌కని కాలం అది. కోళ్లు పెంచుకునే వాళ్ల ఇళ్ల‌కు వెళ్లి బ‌తిమ‌లాడితే ఒక‌టో రెండో అమ్మేవాళ్లు. మ‌హా అయితే ఒక‌టి, లేదంటే స‌గం తిన‌డానికి అలవాటు ప‌డిన నాకు అన్ని గుడ్లు చూస్తే నోరు ఊరింది. ఇక చికెన్ (అప్ప‌టికి చికెన్ అనే పేరు ఎవ‌రికీ తెలియ‌దు). అలా కోడి కోడిగా చేస్తార‌ని కూడా తెలియ‌దు. కోడి కూర అంటే చిన్న‌చిన్న ముక్క‌ల‌తో చేసిన పులుసుగానే తెలుసు. ప్రై, రోస్ట్‌లు సామాన్యుల ఇళ్ల‌లోకి రాని కాలం.

నాగ‌భూష‌ణం తింటూ ఉంటే , మ‌ధ్య‌లో స‌త్య‌నారాయ‌ణ కొర‌డాతో కొడ‌తాడు. తాను తిన‌కుండా తినేవాన్ని త‌న్న‌డం అన్యాయ‌మ నిపించింది. టేబుల్‌పై ఉన్న అన్ని ప‌దార్థాలు నేల మీద ప‌డి వృథా అవుతాయి (ఆక‌లి తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది).

గుడ్లు, కోడికూర నేల‌పాలైన త‌ర్వాత నిధి ర‌హ‌స్యం తెలిస్తే ఎంత‌? తెలియ‌క‌పోతే ఎంత‌? కొర‌డాతో స‌త్య‌నారాయ‌ణ‌ని త‌న్నాల నిపించింది.

సినిమాల్లో మ‌న‌కి ఎవ‌రి మీదైనా బాగా కోపం వ‌చ్చినా, వాళ్లు మ‌న‌ల్ని ఏడిపించినా, న‌వ్వించినా వాళ్లు గొప్ప న‌టుల‌ని అర్థం. స‌త్య‌నారాయ‌ణ గొప్ప న‌టుడు. ఈ రోజు ఆయ‌న 85వ జ‌న్మ‌దినం. 100 ఏళ్ల‌కు పైగా జీవించి ఇంకా సినిమాల్లో న‌టించాల‌ని కోరుకుందాం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp