బంగారు బాతులా సంక్రాంతి సినిమా

By Ravindra Siraj Jan. 18, 2020, 05:57 pm IST
బంగారు బాతులా సంక్రాంతి సినిమా

తెలుగువారికి బాక్స్ ఆఫీస్ పరంగా సంక్రాంతి ఎంత ముఖమైనదో ఎప్పటికప్పుడు ఘనంగా రుజువవుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమాలు కంటెంట్ పరంగా కాస్త అటు ఇటు గా ఉన్నా కూడా సెలవుల పుణ్యమాని ఈజీగా గట్టెక్కిపోతున్నాయి. చూస్తుంటే ఇకపై ఏడాది ముందే సంక్రాంతికి ఏ సినిమాలు విడుదల చేయాలో ముందే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చూస్తే అల వైకుంఠపురములో రియల్ విన్నర్ గా నిలిచిందన్నది కాదనలేని వాస్తవం.

అయితే కంటెంట్ పరంగా రొటీన్ ఫార్ములాలోనే ఉందనే కామెంట్స్ సరిలేరు నీకెవ్వరుకు వచ్చినప్పటికీ దానికీ భారీ కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం నుంచి అసలు పరీక్ష మొదలువుతుంది కానీ ఇప్పటికే ముప్పాతిక పెట్టుబడిని రెండు సినిమాలు వెనక్కు ఇచ్చేశాయి. దర్బార్ ఇక్కడ ఫ్లాప్ అయినా 8 కోట్ల దాకా వసూలు చేయడం పండగ పవర్ ఏంటో చూపిస్తోంది. అందరూ తిట్టిపోసిన ఎంత మంచివాడవురా సైతం మూడు రోజులకు సుమారు 6 కోట్ల దాకా గ్రాస్ తెచ్చిందట.

గత ఏడాది కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది. వినయ విధేయ రామ దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకున్నప్పటికీ 60 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఎన్టీఆర్ ఒక్కటే కనీస అంచనాలు అందుకోలేదు. పేట 5 కోట్ల దాకా రాబట్టగా ఎఫ్2 విన్నర్ గా నిలిచి 80 కోట్లు లాగేసింది. అంతకు ముందు సంవత్సరం అజ్ఞాతవాసి గురించి చెప్పక్కర్లేదు. దీని రిజల్ట్ కారణంగానే చాలా సోసోగా ఉన్న బాలకృష్ణ జైసింహా రేస్ లో పాస్ అయ్యింది. సూర్య గ్యాంగ్ పర్వాలేదు అనిపించుకోగా రాజ్ తరుణ్ రంగుల రాట్నం తుస్సుమంది.

2017లో ఖైదీ నెంబర్ 150, గౌతమి పుత్ర శాతకర్ణి, శతమానం భవతి సక్సెస్ కాగా ఒక్క నారాయణమూర్తి సినిమా మాత్రమే ఫెయిల్ అయ్యింది. అదనపు షోలకు అనుమతులు దొరకడం, సెలవులు ఉన్నన్ని రోజులు టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించడం లాంటి పరిణామాలు నిర్మాతలకు వరంగా మారుతున్నాయి. రాబోవు కాలంలో సంక్రాంతి పండగ రిలీజ్ డేట్ల కోసం యుద్ధమే జరిగే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp