మాస్టర్ చెఫ్ గా మిల్కీ బ్యూటీ

By iDream Post Jun. 15, 2021, 03:00 pm IST
మాస్టర్ చెఫ్ గా మిల్కీ బ్యూటీ
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన తమన్నా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే సూత్రాన్ని సూపర్ గా పాటిస్తోంది. చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతోనూ చేసేందుకు వెనుకాడని ఈ మిల్కీ బ్యూటీ ఇటీవలే లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ లతో ఓటిటిలోనూ అడుగు పెట్టింది. వాటి ఫలితాల సంగతి ఎలా ఉన్నా అధిక శాతం ప్రేక్షకులకు బాగానే రీచ్ అయ్యింది. మరికొన్ని ప్రాజెక్టులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. మరోవైపు ఎఫ్3 సినిమా కూడా నిర్మాణంలో ఉంది. ఇప్పుడు వీటితో పాటు శాటిలైట్ ఛానల్స్ నిర్వహించే షోల వైపు కూడా దృష్టి పెట్టినట్టు లేటెస్ట్ అప్ డేట్. అలా అని ఇదేదో రెగ్యులర్ టాక్ షో కాదు.

ఆస్ట్రేలియాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా వివిధ ఛానల్స్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచిన మాస్టర్ చెఫ్ ని జెమిని ఛానల్ త్వరలో తెలుగులో ప్రారంభించబోతోందని తెలిసింది. ఈ హక్కుల కోసం భారీగా పెట్టుబడి పెట్టినట్టు టీవీ వర్గాల సమాచారం. యాంకర్ గా తమన్నాను తీసుకునేందుకు ఇటీవలే సంప్రదింపులు జరిపారని తను కూడా ఓకే చెప్పిందని అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాలి. ఇండియాలో మాస్టర్ చెఫ్ మొదటిసారి స్టార్ ప్లస్ లో అక్షయ్ కుమార్ వ్యాఖ్యాతగా 2010లో వచ్చింది. మొదటి సీజన్ కు బ్రహ్మాండమైన ఆదరణ దక్కింది. దేశవ్యాప్తంగా దీన్ని ఎగబడి చూశారు.

అలా ఈ షో కొనసాగుతూ వచ్చింది. రెండో సిరీస్ నుంచి అక్షయ్ లేకపోయినా వికాస్ ఖన్నా, కునాల్ కపూర్ తదితరులతో ఇప్పటిదాకా ఆరు సీజన్లు పూర్తి చేశారు. ఏడోది కూడా స్టార్ట్ కాబోతోంది. తెలుగులో వేరే తరహాలో ప్రయత్నించారు కానీ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు తమన్నాతో చేయబోయేది మాత్రం భారీ ఎత్తున ఉంటుందని తెలిసింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరు మీలో కోటీశ్వరుడుతో  కొత్త ప్రోగ్రాంకి శ్రీకారం చుడుతున్న జెమిని ఛానల్ మరోవైపు ఈ మాస్టర్ చెఫ్ తో కూడా అన్ని వర్గాలను టార్గెట్ చేస్తోంది. కేవలం కొత్త సినిమాల టెలికాస్ట్ తో రేటింగ్స్ రావని గుర్తించి వేస్తున్న ప్రణాళికలు మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉన్నాయి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp