రజనీ సినిమాలో సూపర్ ట్విస్టులు

By iDream Post Aug. 01, 2020, 10:31 pm IST
రజనీ సినిమాలో సూపర్ ట్విస్టులు

ఎన్ని హిట్లు వచ్చినా ఫ్లాపులు ఎదురైనా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫాలోయింగ్ తగ్గేది కాదు. గత కొంత కాలంగా తెలుగులో వస్తున్న తలైవా డబ్బింగ్ సినిమాలన్నీ ఒకదానికొకటి వరసగా బోల్తా కొడుతున్నాయి కానీ సరైన సబ్జెక్టు పడితే ఇక్కడా దుమ్ము దులపడం ఖాయమనే నమ్మకం ఇక్కడి అభిమానుల్లో బలంగా ఉంది. తన తాజా చిత్రం అన్నాతే(తెలుగు టైటిల్ పెట్టలేదు)షూటింగ్ ఇంకొంచెం మాత్రమే బాలన్స్ ఉంది. చెన్నైలో పరిస్థితి పూర్తిగా కుదుటపడ్డాక తిరిగి మొదలుపెట్టబోతున్నారు. 2021 సంక్రాంతిని టార్గెట్ చేశారు కాని అదంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు.

ఇక కథకు సంబంధించిన కొన్ని కీలకమైన లీక్స్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూద్దాం. ఇందులో ఇద్దరు సీనియర్ హీరొయిన్లు ఉన్నారు. ఒకరు ఖుష్బూ మరొకరు మీనా. స్టొరీ ప్రకారం రజని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వాళ్ళకు హీరో దక్కడు. తనకు వేరే అమ్మాయితో పెళ్ళవుతుంది. అప్పుడు పుట్టిన కూతురే కీర్తి సురేష్. సో తమ కొడుకులకు కీర్తి సురేష్ ను చేసుకోవాలని మీనా ఖుష్బూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అదే సమయంలో విలన్ ప్రకాష్ రాజ్ వల్ల రజని లీగల్ కేసుల్లో ఇరుక్కుంటాడు. తన తరఫున వాదించడానికి బరిలో దిగుతుంది లాయర్ నయనతార. అసలు ఈ కుటుంబాల మధ్య ఏం జరుగుతోంది, రజిని ఈ చక్రవ్యూహం నుంచి ఎలా బయట పడ్డాడు అనేది మంచి యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టుగా సమాచారం.

ఇదంతా నిజమో కాదో కాని మొత్తానికైతే ప్రచారం జోరుగా ఉంది. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డబ్బింగ్ డీల్స్ ఇంకా పూర్తి కాలేదు. భారీ రేటు వల్ల మన నిర్మాతలు కొంచెం ముందు వెనుక ఆడుతున్నట్టు తెలిసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న అన్నాతే మీద కోలీవుడ్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. తమ హీరోకు నరసింహ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇమ్మాన్ మొదటిసారి సంగీతం అందిస్తున్న రజిని సినిమాగా మరో ప్రత్యేకత కూడా సొంతం చేసుకుంది. చంద్రముఖి, కథానాయకుడు, దర్బార్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న మూవీ ఇది. దర్శకుడు శివ గతంలో తెలుగులో శంఖం, దరువు చిత్రాలను తీశారు కానీ ఇక్కడ ఆశించినంత ఫలితం అందుకోలేదు. కానీ అజిత్ పుణ్యమాని అక్కడ మాత్రం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp