ఇంటింటి పాట బాలు

By G.R Maharshi Aug. 15, 2020, 02:33 pm IST
ఇంటింటి పాట బాలు

SP.బాలు ఐసీయూలో ఉన్నాడంటే ఏదో బాధ‌. ఆయ‌న కోలుకోవాల‌ని పాడుతూనే ఉండాల‌ని దేశ‌మంతా కోరుతోంది. 1970 త‌ర్వాత అన్ని జ‌న‌రేష‌న్లు ఆయ‌న పాట వింటూనే పెరిగారు. కొన్ని వేల‌సార్లు కూని రాగాలు తీసుంటారు. నాకు గుర్తుండి మొద‌టిసారిగా విన్న పాట కోడ‌లు దిద్దిన కాపురం (1970)లో "నిద్ద‌ర‌పోనా పిల్లా" . అల్లుడే మేన‌ల్లుడులో కృష్ణ‌కి ఘంట‌శాల పాడిన జాబిల్లి వ‌చ్చాడే పిల్లా ఎలా సెట్ కాలేదో ఇది కూడా NTRకి కుద‌ర్లేదు. బాలు గొంతు మ‌రీ లేత‌గా అనిపిస్తుంది. అప్ప‌టికి NTR ముదురు.

త‌ర్వాత కృష్ణ‌కి పాడితే కృష్ణే పాడుతున్నాడేమో అనిపించింది. అంద‌రికీ గొంతు మార్చి పాడ‌డం బాలుకి మాత్ర‌మే చేత‌నైన విద్య‌. అడ‌విరాముడులో ఆరేసుకోబోయి ఆల్ టైమ్ హిట్ అయితే, శంక‌రాభ‌ర‌ణం బాలుని ఎక్క‌డికో తీసుకెళ్లింది. అంద‌రికీ పాడ‌డంతో ఇంకొక‌రికి అవ‌కాశం లేకుండా చేశాడ‌నే నింద కూడా ఉంది ఆయ‌న‌పై.

కొంత కాలం కృష్ణ బాలుపై కోపంతో రాజ్‌సీతారామ్‌తో పాడించాడు. కానీ జ‌నానికి న‌చ్చ‌లేదు. బాలు అద్భుతమైన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కూడా . ఆయ‌న వాయిస్ లేక‌పోతే క‌మ‌ల్‌హాస‌న్ సినిమాలు మ‌న‌కి అంత‌గా న‌చ్చేవి కావేమో. ఇప్పుడైతే టీవీలు, వీడియోల్లో ఎపుడైనా పాట‌లు వినొచ్చు కానీ , ఒకప్పుడు అది ల‌గ్జ‌రీ. ఆ రోజుల్లో పెళ్లిలో ఆర్కెస్ట్రా ఒక ఆక‌ర్ష‌ణ‌. తెలియ‌ని వారి పెళ్లిళ్ల‌కు కూడా వెళ్లి మండ‌పం బ‌య‌టి నుంచి పాట‌లు వినేవాన్ని.

1977లో బాలు, సుశీల అనంత‌పురంలో ప్రోగ్రాం ఇచ్చారు. వెళ్లాల‌ని కోరిక ఉన్నా టికెట్ కొనే డ‌బ్బుల్లేవు. టికెట్ కొన‌లేని వాళ్లు ప‌బ్లిక్ లైబ్ర‌రీ బిల్డింగ్ పై నుంచి ల‌లిత క‌ళాప‌రిష‌త్‌లో ప్రోగ్రామ్స్ చూసేవాళ్లు. క‌న‌ప‌డేది కాదు, విన‌ప‌డేది.

నేనూ ఇదే ప‌ని చేశాను. 6.30కి ప్రోగ్రాం అయితే 5 గంట‌ల‌కే టికెట్ లేని శ్రోత‌లు లైబ్ర‌రీ ఎక్కేశారు. ఆ గ్రూప్‌లో ఉక్క‌లో , దోమ‌ల కాటు మ‌ధ్య చిన్న ఆకారంగా క‌నిపిస్తున్న బాలుని చూసి సంతోషించాను. ఒక్కో పాట వింటున్న‌ప్పుడు ఒళ్లు తెలియ‌ని ఆనందం. మూడు గంట‌లు క్ష‌ణాల్లా గ‌డిచాయి.

లైబ్ర‌రీ బ‌య‌ట గౌసియా హోట‌ల్‌లో 15 పైస‌లు ఇచ్చి టీ తాగి, పైసా ఖ‌ర్చు లేకుండా సంగీత క‌చేరీ విన్న‌ ఉత్సాహంతో పాట‌లు పాడుకుంటూ ఇల్లు చేరాను. ఇప్పుడు టికెట్ కొనే డ‌బ్బులున్నా , ఎక్క‌డికీ వెళ్లే ఉత్సాహం లేదు. బాల్యంలోని మ్యాజిక్‌, మంత్రం మాయ‌మై పోయింది.

మా స్కూల్లో పెంచ‌ల్ కుమార్ అనే గాయ‌కుడు ఉండేవాడు. బాలు పాట‌ల్లో ఎక్స్‌ప‌ర్ట్‌. ఒక‌సారి "ముత్యాలు వ‌స్తావా" అని అల్లు రామ‌లింగ‌య్య‌లా పాడితే మా ప్రిన్సిప‌ల్ ల‌క్ష్మ‌ణమూర్తి గ‌బ్బు పాట‌లు పాడుతావా అని క‌ర్ర తీసుకున్నాడు. ప్రిన్సిపాల్‌కి బ‌ర్మా కోడి అనే నిక్ నేమ్ ఉండేది. ఇది ఎందుకు పెట్టారో తెలియ‌దు.

రామాంజనేయులు అని ఇంకొక‌డు ఉండేవాడు. వాన్ని పండ్లోడు అని పిలిచేవాళ్లు. పళ్లు ఎత్తుగా ఉన్నా పాట‌లు బాగా పాడేవాడు. స్కూల్లో ఏం జ‌రిగినా శ‌ర‌ణ కింకిణులు ఘ‌ల్లుఘ‌ల్లుమ‌నే అని త‌గులుకునే వాడు. ఇప్పుడు చెర‌కు ఫ్యాక్ట‌రీ ఎండీ. మ‌రి పాట‌ల ర‌సం ఇంకా మిగిలిందో లేదో తెలియ‌దు.

కొన్ని త‌రాల‌ను పాట‌తో ప‌ర‌వ‌శం చేసిన బాలు, ఇంటింటి పాట‌గా మారిన బాల‌సుబ్ర‌మ‌ణ్యం త్వ‌ర‌గా కోలుకుని తీయ‌గా పాడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp