స్వయంగా సూపర్ స్టారే నాకు పాడారు

By iDream Post May. 27, 2020, 05:26 pm IST
స్వయంగా సూపర్ స్టారే నాకు పాడారు

గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గురించి తెలియనివారు ఎవరుంటారు. స్వర్గీయ ఎన్టీఆర్ తో మొదలుకుని ఇప్పటి మహేష్ బాబు దాకా ఆయన గాత్రం ఇవ్వని హీరో బహుశా లేరేమో. తమన్ లాంటి ట్రెండీ మ్యూజిక్ డైరెక్టర్స్ సైతం ఆయనతో కోరి మరీ పాడించుకోవడం ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. వేల కొద్ది పాటలతో కోట్లాది సంగీత ప్రేమికుల అభిమానం సంపాదించుకున్న బాలు గారు ఎవరికైనా పాడితే అచ్చుగుగుద్దినట్టు ఆ హీరోనే పాడారా అనిపించేలా ఉండటం బాలు గారి ప్రత్యేకత. అలాంటిది ఆయనకు వేరొకరు పాడటం ఊహించగలమా. కాని అది జరిగింది.

1991లో తెలుగులో దాసరి నారాయణరావుగారు టైటిల్ పాత్రలో నటించిన 'మామగారు' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది తమిళ్ హిట్ మూవీ 'నాన్ పుడిచ మాపిల్లై'కు రీమేక్. దీన్ని 1993లో కన్నడలో 'ముద్దిన మావా' పేరుతో తీశారు. దాసరి గారి రోల్ లో ఎస్పి బాలసుబ్రమణ్యం గారిని తీసుకున్నారు. సంగీత దర్శకులు కూడా ఆయనే. హీరో శశికుమార్. కథ ప్రకారం బాలు గారికి రెండు పాటలు ఉంటాయి. మరో మూడు హీరోవి.

ఇద్దరికీ తానే పాడితే బాగుండదు కాబట్టి తన పాత్రకు తానే పాడుకుని హీరోకి వేరేవాళ్ళతో పాడిద్దామని బాలు గారి ఆలోచన. కాని శశి కుమార్ ససేమిరా అన్నారు. చిన్నప్పటి నుంచి మీ పాటలు వింటూ పుట్టిపెరిగిన నాకు ఇందులో మీరు అన్యాయం చేస్తానంటే ఒప్పుకోను ధర్నా చేసేందుకు సైతంవ్ వెనుకాడను అని తీయగా బెదిరించేశారు. ఎంత నచ్చజెప్పినా వినలేదు.

దీంతో బాలసుబ్రహ్మణ్యం గారికి ఏం చేయాలో తోచలేదు. బాగా ఆలోచించి కన్నడ సూపర్ స్టార్, కంఠీరవ రాజ్ కుమార్ ని కలిశారు. ఆయన ఎంత స్టార్ అయినప్పటికీ గొప్ప గాయకులు కూడా. వినగానే ఆయనా ఒప్పుకోలేదు. మీకిక్కడ గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది ఏదైనా తేడా జరిగితే ఇద్దరి పరువు పోతుందని వారించారు. ఒకవేళ ఇది జరగకపోతే సినిమా రిలీజ్ కాదని చెప్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాటల ట్రాక్స్ ని అక్కడే వదిలేసి వచ్చారు. కొద్దిరోజులయ్యాక రాజ్ కుమార్ స్వయంగా స్టూడియోకు వచ్చి బాలు గారు లేని సమయంలో వాటిని పాడేసి వెళ్ళిపోయారు. ఒకవేళ సరిగా పాడకపోయి ఉంటె క్షమించండి అంటూ ఫోన్లోనే చెప్పేశారు. కట్ చేస్తే రిలీజయ్యాక సినిమాతో పాటు ఆ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇలా ఒక లెజెండ్ సింగర్ కి సూపర్ స్టార్ పాట పాడటం చాలా అరుదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp