షూటింగులు ఓకే - థియేటర్లు డౌటే

By iDream Post May. 22, 2020, 07:56 pm IST
షూటింగులు ఓకే - థియేటర్లు డౌటే

గత డెబ్భై రోజులుగా స్టార్ట్ కెమెరా యాక్షన్ రెడీ పదాలకు దూరంగా ఉన్న పరిశ్రమ వర్గాల్లో అతి త్వరలో సందడి మొదలుకాబోతోంది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఇండస్ట్రీ పెద్దలు కలుసుకుని ఆ మేరకు కొంత హామీ అయితే తెచ్చుకోగలిగారు. జూన్ నుంచి పరిమిత సంఖ్యలో సభ్యులు ఉండేలా షూటింగులు ప్లాన్ చేసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని చెబుతూ త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని కెసిఆర్ చెప్పారు.

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధ్యక్షతన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, అల్లు అరవింద్, దిల్ రాజులతో పాటు నిన్న సమావేశంలో పాల్గొన్న దాదాపు అందరూ ఇవాళ కెసిఆర్ ను కలిసిన వాళ్లలో ఉన్నారు. కొన్ని సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైపోయ్యాయని ఫిలిం నగర్ టాక్. తక్కువ సంఖ్య యూనిట్ సభ్యులుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రస్థుతానికి ఆ దిశగా పనులు చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని కెసిఆర్ సూచించారు. ఇప్పటికే లక్షలాది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. థియేటర్ల మూసివేత గురించి ముఖ్యమంత్రి స్పందిస్తూ దీనికి సంబంధించి కూడా చర్చలు జరుపుతామని వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

షూటింగులు ప్రస్తుతానికి మొదలుపెట్టినా సినిమా హాళ్ళు తెరవడానికి మాత్రం సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి మార్గదర్శకాలు రావాలి కాబట్టి ఇంకొంత కాలం వేచి చూడక తప్పదని చెప్పినట్టు తెలిసింది . ఇప్పటికే ఆగస్ట్ మొదటి వారం నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అలా చూసుకున్నా ఇంకా రెండు నెలలు పైగా టైం ఉంది. మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు కొత్త సీటింగ్ ప్లాన్ గురించి ఒక కొత్త ప్రతిపాదన తయారు చేసి అధికారిక వర్గాలకు ఇచ్చాయి. కాబట్టి ఇంకొద్ది రోజులు ఎదురు చూపులు తప్పేలా లేవు. స్టార్ హీరోల భారీ చిత్రాల షూటింగులకు ఎలాంటి ప్రణాళిక రచిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు జరిగిన సమాశానికి సంబంధించి చిరంజీవి కెసిఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp