అమ్మాయిలకు అండగా సీటిమార్ కోచ్

By iDream Post Aug. 31, 2021, 04:30 pm IST
అమ్మాయిలకు అండగా సీటిమార్ కోచ్

కొన్నేళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న గోపిచంద్ హీరోగా రూపొందిన మూవీ సీటిమార్. వచ్చే నెల 10న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇందాకా ట్రైలర్ ని వదిలారు. రచ్చ-గౌతమ్ నంద ఫేమ్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు, చాలా కాలం తర్వాత గోపీచంద్ మాస్ అవతారం దీని మీద అంచనాలు పెంచేశాయి. అందులోనూ బడ్జెట్ కూడా భారీగానే పెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు దీని మీద గట్టి ఆశలు పెట్టుకున్నారు. మరి ట్రైలర్ విశేషాలు ఏంటో చూద్దాం.

అనగనగా ఒక చిన్న ఊరు. అక్కడ అమ్మాయిలకు కబడ్డీ ఆడే అద్భుత నైపుణ్యం ఉంటుంది. కానీ పెద్దల ఆంక్షల వల్ల తమ ప్రతిభను చంపుకుని బ్రతుకుతూ ఉంటారు. అప్పుడు వస్తాడు ఆ ఊరికి కోచ్(గోపీచంద్). ఆడపిల్లలు ఇళ్లలో ఉండకూడదని బయటికి వచ్చి తమ టాలెంట్ ని చూపించినప్పుడే ప్రపంచానికి వాళ్ళ గొప్పదనం తెలుస్తుందని స్ఫూర్తినిస్తాడు. ప్రత్యర్థి టీమ్ కు జ్వాలా రెడ్డి(తమన్నా) కోచ్ గా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ ఆటకు ఆటంకాలు కలిగించేందుకు స్థానిక దుష్టశక్తి(రావు రమేష్) అడ్డు తగులుతూ ఉంటుంది. మరి జాతీయ స్థాయి పోటీలో వీళ్ళు ఎలా గెలిచారు అనేది సెప్టెంబర్ 10న చూడాలి

ట్రైలర్ మొత్తం మాస్ షాట్లతో నింపేశారు. సాధారణంగా ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలో ఉండే టెంపో కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ దిట్టంగా పేర్చినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ కు ఇలాంటివి కొట్టిన పిండే కావడంతో ఈజీగా చేసుకుంటూ పోయాడు. రావు రమేష్ విలనీ, ఇతర విలన్ల ట్రాకులు అన్నీ ఒక మసాలా మూవీకి కావాల్సిన దానికన్నా ఎక్కువగానే అనిపిస్తున్నాయి. సంపత్ నంది మార్కు సీన్లు చాలానే ఉన్నాయి. భూమిక, తరుణ్ అరోరా, రెహమాన్, పోసాని, అంకూర్ సింగ్ తదితరులు ఇతర తారాగణం. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం అందించగా దీనికి నిర్మాత శ్రీనివాస చిట్టూరి. చూడాలి మరి సీటిమార్ థియేటర్లో సీటీలు కొట్టిస్తుందో లేదో

Also Read : కల్ట్ క్లాసిక్ ఫార్ములా మార్చాల్సిందే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp