టాలీవుడ్ కు మరో ఆప్షన్ లేదా

By iDream Post Mar. 16, 2020, 10:05 am IST
టాలీవుడ్ కు మరో ఆప్షన్ లేదా

టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఉన్న ఒక్క తమన్ డిమాండ్ మాములుగా లేదు. అల వైకుంఠపురములో తర్వాత మీడియం రేంజ్ సినిమాలకు తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కలవరపెడుతోంది. ఒక్క సుకుమార్ క్యాంప్ కు తప్ప తన స్థాయి అవుట్ పుట్ బయటివాళ్లకు ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక అనూప్ రూబెన్స్ మెరుపులు అడపా దడపా ఉంటున్నాయే తప్ప మనం లాంటి బెస్ట్ ఆల్బమ్ రావడం లేదు. మిక్కీ జె మేయర్ పలకరింపులు అప్పుడప్పుడే వినిపిస్తున్నాయి. అందుకే మనవాళ్ళు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల మీద ఫోకస్ పెడుతున్నారు.

సైరాకు ముందు ఏఆర్ రెహమాన్ ను అనుకుని ఆ తర్వాత అమిత్ త్రివేదిని తెచ్చుకున్నారు. అతనూ పాటలు ఇచ్చాడు కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయలేకపోయాడు. ఇప్పుడు నాని వికి కూడా సాంగ్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తమన్ చేతిలోనే పెట్టారు. అమిత్ పాటలకు మరీ బ్రహ్మాండమైన రెస్పాన్స్ అయితే ఇంకా రాలేదు. తాజాగా ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ డియర్/రాధే శ్యాం(ప్రచారంలో ఉన్న టైటిల్స్)కు సైతం అమిత్ త్రివేదినే తీసుకున్నారట. కానీ మళ్లి ఏవో కారణాల వల్ల అతను తప్పుకున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇది నిజమా కాదా అనే నిర్ధారణ రావాల్సి ఉంది.

అమిత్ త్రివేది గొప్ప టాలెంట్ ఉన్నవాడే. అందులో సందేహం లేదు. కాని ఇక్కడ ఆప్షన్లు లేవు కాబట్టి అతన్ని ఇంతగా బ్రతిమాలుకుని తీసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తుతుంది. అనిరుధ్ రవిచందర్ లాంటి వాళ్ళు సైతం ఆయా బాషలలో గొప్ప ఆల్బమ్స్ ఇచ్చారు కాని తెలుగుకు వచ్చేటప్పటికి యావరేజ్ గానే ఉంటాయి వీళ్ళ పాటలు. అమిత్ త్రివేది దీనికి మినహాయింపు కాదు. గత 12 ఏళ్ళలో హిందీలో భారీ సినిమాలు ఎన్నో చేశాడు కానీ ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మరీ అద్భుతమైన పాటలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి మనవాళ్లకు ఇంకెవరు దొరక్క ఇలా చేయాల్సి వస్తోంది. కొత్త తరం నుంచి గొప్ప ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp