సంక్రాంతి సినిమా పోటీ - లాభమా నష్టమా

By iDream Post Jan. 03, 2021, 12:07 pm IST
సంక్రాంతి సినిమా పోటీ - లాభమా నష్టమా

ఇంకో వారం రోజుల్లో సినిమా సంక్రాంతి పందెం సిద్ధమవుతోంది. థియేటర్లకు యాభై శాతం ఆక్యుపెన్సీకే అనుమతులు ఉన్నా సరే మేమంటే మేమంటూ పోటీ పడి మరీ నిర్మాతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు కన్ఫర్మ్ అయ్యాయి. తొలుత 14న రావాలనుకున్న రవితేజ క్రాక్ చాలా తెలివిగా డేట్ ని 9కి మార్చుకుని వసూళ్ల పరంగా తన అవకాశాలను మెరుగు పరుచుకుంది. ఇక 13న మాస్టర్, 14న రెడ్, 15న అల్లుడు అదుర్స్ వరసగా మూవీ లవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. కోవిడ్ పరిణామాలు ఎలా ఉన్నా ఈ పండగ కూడా ఎప్పటిలాగే మహా రంజుగా ఉండబోతోంది. కానీ ఇక్కడ కొన్ని చిక్కులు లేకపోలేదు.

ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఇన్నేసి సినిమాలు పోటీ పడటం మంచిదా కాదా అని ట్రేడ్ వర్రీ అవుతోంది. ఎందుకంటే ఇలా తక్కువ గ్యాప్ లో రిలీజులు ప్లాన్ చేసుకోవడం వల్ల కలెక్షన్లను పంచుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మొదటి రోజు టాక్ ఏ మాత్రం అటుఇటు అయినా సరే ప్రేక్షకులు హాల్ దాగా వచ్చేందుకు సంకోచిస్తారు. అందులోనూ ఇప్పుడు వచ్చేది సగం రెవిన్యూ మాత్రమే. ఒక సెంటర్ కెపాసిటీ కోటి రూపాయలు అనుకుంటే ఇప్పుడు యాభై లక్షలతోనే సర్దుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్టే బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయి. రిపోర్ట్ డివైడ్ గా వచ్చినప్పుడు కల్లెక్షన్ ఫిగర్ ఇంకా కిందకు వెళ్ళిపోతుంది.

అయితే డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఆశాజనకంగా ఉన్నది మొదటి వారం విషయంలోనే. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు ఈ నాలుగు సినిమాలను పంచుకుంటే ఎలాగూ జనం పండగ సందర్భంగా హాళ్లకు వస్తారు. కాబట్టి ఆ ఏడెనిమిది రోజులు హౌస్ ఫుల్స్ అయితే చాలు అందరూ గట్టెక్కవచ్చు. గతంలో యావరేజ్ చిత్రాలు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది కూడా సరిలేరు నీకెవ్వరు మహేష్ కెరీర్ బెస్ట్ అనిపించే స్థాయిలో లేదనే టాక్ తో సంబంధం లేకుండా వంద కోట్లకు పైగా కొల్లగొట్టింది.అందుకే ఇప్పుడు కూడా అదే కాన్ఫిడెన్స్ తో కాంపిటీషన్ కి సై అంటున్నారు దర్శకనిర్మాతలు. చూడాలి పోటీ ఎలా ఉంటుందో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp