సంక్రాంతి సినిమా ఎన్ని కోట్లు

By iDream Post Jan. 08, 2021, 12:58 pm IST
సంక్రాంతి సినిమా ఎన్ని కోట్లు

రేపటి నుంచే సినిమా ప్రియులకు అసలు పండగ మొదలుకానుంది. సుమారు పది నెలల తర్వాత థియేటర్లలో స్టార్ హీరోల దర్శనం జరగనుంది. ఆక్యుపెన్సీ యాభై శాతమే ఉన్నప్పటికీ క్రాక్ వసూళ్ల మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే కనివిని ఎరుగని రీతిలో భారీ విడుదలకు ప్లాన్ చేశారు. రవితేజ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలుస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్లకు ఎలాంటి ఢోకా ఉండదు. ఆపై పదమూడున మాస్టర్, మరుసటి రోజు రెడ్, పదిహేనున అల్లుడు అదుర్స్ ఇలా టాలీవుడ్ జాతర ఓ రేంజ్ లో ఉండబోతోంది. హాళ్లు కళకళలాడటం మునుపటిలా చూడటం ఖాయం.

మరి ఇంత సందడి నెలకొనబోతున్న తరుణంలో వీటి మీద ఎంత బిజినెస్ జరిగిందనే ఆసక్తి రేగడం సహజం. ట్రేడ్ ఖచ్చితమైన సమాచారం బయటికి ఇవ్వడం లేదు కానీ విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం సుమారు 55 నుంచి 60 కోట్ల దాకా థియేట్రికల్ షేర్ ని నాలుగు సినిమాలు కలిపి టార్గెట్ చేసుకున్నాయి. ఇందులో క్రాక్ రేంజ్ 15 నుంచి 17 కోట్ల మధ్యలో ఉండగా రామ్ రెడ్ కూడా అంతే స్థాయిలో ఫిగర్స్ ని నమోదు చేస్తోంది. నేనేం తక్కువా అన్నట్టు మసాలా ఎంటర్ టైనర్ అల్లుడు అదుర్స్ కూడా 12 కోట్ల రేంజ్ లో వ్యాపారం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. బెల్లం హీరో రేంజ్ కి ఇది పెద్ద మొత్తమే.

ఇక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ అంచనాల విషయంలో గట్టి పోటీ ఇస్తున్న విజయ్ మాస్టర్ ని సైతం 8 కోట్ల దాకా అమ్మారట. సగం సీట్లకే ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఆశ్చర్యమే. దీనికి కారణం సోలో బ్రతుకే సో బెటరూకు వచ్చిన రెస్పాన్స్. యావరేజ్ టాక్ తో సైతం ఏడాది చివర్లో పది కోట్లు రాబట్టడం గొప్పే. అలాంటిది పండగ సెలవుల సీజన్ లో అందులోనూ పిల్లలకు చదువు పరంగా ఎలాంటి పరీక్షలు ఒత్తిడి లేని టైంలో ఇన్నేసి సినిమాలు రావడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే టాక్, రివ్యూలు ఇక్కడ కీలక పాత్ర పోషించబోతున్నాయి. వచ్చే వేసవికి కావాల్సిన బూస్ట్ ఇవ్వాల్సింది ఇవే మరి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp