నాగ్, వేణుల రూట్లో సాయి తేజ్

By iDream Post May. 25, 2020, 07:50 pm IST
నాగ్, వేణుల రూట్లో సాయి తేజ్

ఏదో సెంటిమెంట్ గా కలిసొచ్చిందనో లేక అలా చేసుకున్నాకే చిత్రలహరితో హిట్ దొరికిందనో తెలియదు కానీ తన పేరులో ధరమ్ తీసేసుకున్న సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ నుంచి ఫస్ట్ ఆడియో సింగల్ ని ఇవాళ రిలీజ్ చేసారు. "నో పెళ్లి దీంతల్లి ఆ తప్పే చేయకురా మళ్ళీ, భరించలేవు నువ్వు పెళ్లిలోని యాతన ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన" అంటూ సాగే ఈ ట్యూన్ క్యాచీగా ఉంది. గత ఏడాది నుంచి భీభత్సమైన ఫామ్ లో ఉన్న తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. తన స్టైల్ లో కంపోజ్ చేసి లాక్ డౌన్ సీజన్ లో యూత్ కి మంచి కిక్ ఇచ్చాడు. అయితే ఇలా పెళ్లి వద్దనే పాటలు గతంలో మరీ ఎక్కువ రాలేదు కానీ ఉన్నవి కొన్నే అయినా బాగా గుర్తుండిపోయాయి.

మన్మధుడులో దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన "వద్దురా సోదరా ఈ పెళ్ళంటే నూరేళ్ళ మంటరా" అంటూ సిరివెన్నెల సాహిత్యంతో అప్పట్లో చార్ట్ బస్టర్ గా నిలిచిందీ పాట. అంతకన్నా ముందు పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా రూపొందిన బంపర్ ఆఫర్ లో "ఎందుకే రవనమ్మా పెళ్లి ఎందుకే రవనమ్మా" అంటూ రఘు కుంచె స్వరకల్పనలో రూపొందిన పాట కూడా పెద్ద హిట్టే. చాలా ఏళ్ళ క్రితం వేణు హీరోగా రూపొందిన స్వయంవరంలో "పెళ్లి చేసుకోరా నాయనా పెళ్లి వయసు దాటనీయకు వాత్సాయనా" అంటూ వందేమాతరం శ్రీనివాస్ ట్యూన్ చేసిన సాంగ్ కూడా సూపర్ హిట్టే. ఇప్పుడీ కోవలోకి సాయి తేజ్ పాట కూడా వచ్చి చేరింది.

ఇవాళ నితిన్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. విశేషమేమిటంటే ఈ వీడియో సాంగ్ లో వరుణ్ తేజ్, రానాలు కూడా కనిపించడం. షూట్ చేసే సమయానికి రానాకు ఇంకా పెళ్లి ఫిక్స్ కాలేదు కాబట్టి నో పెళ్లి సాంగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడైతే ఒప్పుకునే వాడు కాదేమో. అర్మాన్ మాలిక్ గాత్రంలో రఘురాం లిరిక్స్ సింపుల్ గా ఈజీగా పాడుకునేలా ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటరూ ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇంకొద్ది శాతం మాత్రమే షూటింగ్ బాలన్స్ ఉన్న ఈ సినిమాని లాక్ డౌన్ అయ్యాక పూర్తి చేసి పరిస్థితిని బట్టి విడుదల తేదీని ప్రకటించబోతున్నారు

Link Here @ https://bit.ly/2X0gAVq

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp