సంగీతాన్ని దూరం చేసిన సినిమా

By iDream Post Aug. 27, 2020, 06:01 pm IST
సంగీతాన్ని దూరం చేసిన సినిమా

20 ఏళ్ళ క్రితం నీకోసం అనే సాఫ్ట్ ఆల్బమ్ తో ఓ సంగీత దర్శకుడు పరిచయమైనప్పుడు అందరూ ఎవరితను అని చూశారు. ఉదయ్ కిరణ్ 'చిత్రం' విడుదలయ్యాక రాత్రి పగలు తేడా లేకుండా యూత్ అంతా అవే పాటలు పాడుకుంటే అగ్ర నిర్మాతలు సైతం అతని ఫోన్ నెంబర్ కనుక్కున్నారు. అలా మొదలైన ప్రస్థానం కొన్నేళ్ల పాటు ఆర్పి పట్నాయక్ అనే పేరుని బ్రాండ్ గా మార్చేసింది. నువ్వు నేనులో గాజువాక పిల్లాతో రాష్ట్రం మొత్తం హోరెత్తించి నీ స్నేహంలో మధురమైన గీతాలతో మెప్పించిన ఆయనకే చెల్లింది. అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి నిజం చేయడం అప్పట్లో గొప్ప అచీవ్మెంట్.

చిరంజీవి ఇంద్ర కోసం ఒక పాట అర్జెంటుగా కావలసి వచ్చి మణిశర్మ అందుబాటులో లేకపోతే ఆర్పి పాట్నాయక్ ఆ లోటుని భర్తీ చేయడం ఇప్పటికీ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకం. శ్రీరామ్,హోలీ , మనసంతా నువ్వే, సంతోషం లాంటి ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. అయితే చాలా తక్కువ సమయంలోనే పట్నాయక్ సంగీత దర్శకత్వానికి దూరం కావడం అభిమానులను బాధించింది. అయితే దీని వెనుకో కారణం ఉంది. విఎన్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన నేనున్నానుకు ముందు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. రెండు పాటలు రికార్డింగ్ అయ్యాక ఓ యుఎస్ కాన్సర్ట్ కోసం బ్రేక్ తీసుకున్నారు. ఆ కారణంగానే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా మిస్ అయ్యాయి.

తిరిగి వచ్చాక ఓ సారి స్టూడియోలో ఉన్న పట్నాయక్ వద్దకు ఓ సీనియర్ పెద్దమనిషి వచ్చారు. పట్నాయక్ పేరు వల్ల సినిమా బిజినెస్ మీద ప్రభావం పడుతోందని, ఆశించినంత జరగడం లేదని అందుకే తప్పిస్తున్నామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో ఖంగు తిన్న పట్నాయక్ అంత క్రేజ్ ఉన్న కాంబినేషన్ కు కేవలం తన వల్ల వ్యాపారం జరగకపోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు. తెరవెనుక రీజన్ ఏదున్నా బయటికి ఇదే చెప్పారు కాబట్టి ఇక సంగీత దర్శకత్వం వహించడం వల్ల నిర్మాతలు దెబ్బ తింటారని భావించి అప్పటి నుంచి లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. నేనున్నానుకి కీరవాణి లైన్లోకి వచ్చారు. ఈ వ్యవహారమంతా నాగార్జునకు తెలియకుండానే జరిగిపోయింది. ఒక్కోసారి పైకి చిన్నగా అనిపించే సంఘటనలు మనసుని ఎంతగా గాయపరుస్తాయో దాని వల్ల కొందరి కెరీర్లు ఎంతగా ప్రభావితం అవుతాయో దీన్నే చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp