రూటు మార్చనున్న మహర్షి దర్శకుడు

By iDream Post Jun. 01, 2020, 04:38 pm IST
రూటు మార్చనున్న మహర్షి దర్శకుడు

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా మహర్షి రూపంలో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి తన కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రిన్సే ఇంకో ఛాన్స్ ఇస్తాడని వేచి చూస్తే తీరా ఆ ఆఫర్ కాస్తా పరశురాం కొట్టేశాడు. సర్కారు వారి పాట పేరుతో రూపొందుతున్న ఈ మూవీ తాలుకు అనౌన్స్ మెంట్ కూడా నిన్న వచ్చేసింది. నిజానికి వంశీ పైడిపల్లి కథ పూర్తిగా నచ్చకపోవడం వల్లే మహేష్ తన నిర్ణయం మార్చుకున్నాడనే టాక్ ఉంది. చరణ్ తో ఎవడు, జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం, నాగార్జునతో ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో ఉంచుకున్న వంశీ పైడిపల్లి తాజాగా వెబ్ రూటు పట్టబోతున్నట్టు సమాచారం.

అల్లు కాంపౌండ్ నడిపిస్తున్న ఆహా యాప్ కు సంబంధించిన వ్యవహారాలు ప్లస్ వెబ్ కంటెంట్ సూపర్ విజన్ చేయబోతున్నట్టు వినికిడి. తన దర్శకత్వంలో ఏదైనా సిరీస్ ఉంటుందా లేదా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. ఆహా సంస్థ ఇప్పటికే క్రిష్ తో టై అప్ చేసుకుని పలు నిర్మాణాలు చేపడుతోంది. మారుతీకి సైతం ఆఫర్ ఇచ్చినట్టు ఇటీవలే న్యూస్ వచ్చింది. ఇప్పుడు వంశీ పైడిపల్లిని ఇన్వాల్వ్ చేయడం చూస్తే ఏదో గట్టి ప్లానే కనిపిస్తోంది. వంశీ పైడిపల్లి ఇలా నిర్ణయం మార్చుకోవడంలో కారణం ఉందట. ప్రస్తుతం అగ్ర హీరోలందరూ తమ ప్రాజెక్ట్స్ లో చాలా బిజీగా ఉన్నారు.

కరోనా వల్ల ఏకంగా నాలుగైదు నెలలు బ్రేక్ రావడంతో వాళ్ళ ప్లానింగ్ మొత్తం డిస్టర్బ్ అయ్యింది. అందుకే అప్పటిదాకా వాళ్ళ కోసం వెయిట్ చేసే బదులు ఇలా క్రియేటివ్ వర్క్ లో ఎంగేజ్ అవుదామనే ఆలోచనలో వంశీ పైడిపల్లి ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇదంతా అధికారికంగా తెలిసేది కాదు కాబట్టి ఫిలిం నగర్ లో టాక్ అయితే జోరుగా ఉంది. అసలే థియేటర్లు మూతబడి జనాలు ఓటిటికి అలవాటు పడుతున్న టైంలో స్టార్ డైరెక్టర్లు సైతం ఇలా వెబ్ చూపులు చూడటం గమనార్హం. రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడే మన వెబ్ సిరీస్ లను మించిన కంటెంట్ ఇవ్వకపోతే పబ్లిక్ సినిమాలు చూడరని చెప్పిన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఈ పరిణామాలు మంచిదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp