రోబోలు మనుషులు - అల్లరే అల్లరి

By iDream Post Sep. 23, 2020, 12:10 pm IST
రోబోలు మనుషులు - అల్లరే అల్లరి

కొత్త కొత్త కాన్సెప్ట్ లతో బిగ్ బాస్ 4 వీక్ డేస్ ని వీలైనంత ఆసక్తికరంగా మలిచేందుకు టీమ్ గట్టిగానే కష్టపడుతోంది. వెరైటీ ఉంటే తప్ప ప్రేక్షకులను వారం మొత్తం చూసేలా చేయడం సాధ్యం కాకపోవడంతో ఆ మేరకు టాస్కులను డిఫరెంట్ గానే డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న పార్టిసిపెంట్స్ ని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక టీమ్ రోబోలుగా మరొక టీమ్ మనుషులుగా విడగొట్టి వినూత్నంగా అనిపించే పని అప్పజెప్పారు. హ్యూమన్స్ అనబడే టీమ్ రోబోల గుడ్లను పగలగొట్టడం ద్వారా వాళ్ళను చంపొచ్చు. కాకపోతే ఒక్క రోబో మిగిలినా అవతలి టీమ్ ఓడిపోయినట్టే లెక్క. అయితే ఇక్కడో ట్విస్టు పెట్టారు.

రోబోలకు కావాల్సిన ఛార్జింగ్ ఇవ్వాల్సింది మనుషుల టీమ్. అలా ఇవ్వకుండా నిరోధించి కూడా వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం తేవచ్చు. మరో మెలిక ఏంటంటే నిత్యావసరాలు, కిచెన్, వాష్ రూమ్ తదితరాలు అన్నీ రోబోల కంట్రోల్ లో ఉంటాయి. వాళ్ళ అనుమతి లేకుండా మనుషులు వాడుకోవడానికి లేదు. దానికి తగ్గట్టే ఎవరికి వారు తమ తమ ఎత్తుగడలతో గేమ్ ఆడారు. ఒకదశలో కెమెరాలను కవర్ చేసేందుకు కూడా హ్యూమన్స్ వెనుకాడలేదు. దీంతో బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వచ్చేసింది.
రజనికాంత్ రోబో కాన్సెప్ట్ ని ఇందులో తెలివిగా వాడారు. సభ్యులు వేసుకుంటున్న ప్లాన్లు సరదాగానూ సీరియస్ గానూ ఉంటున్నాయి. దేవి గుడ్డు పగిలిపోవడం, రోబోల తరఫున అరియానా స్ట్రాటజీలు మార్చడం, రోబోలు హ్యుమన్స్ ని ఛార్జింగ్ కోసం బ్రతిమాలుకోవడం వగైరా అంతా సరదాగా సాగింది.

ఇంకా విజేతలు ఎవరో తేలలేదు. ఇవాళ కూడా కొనసాగించబోతున్నారు. ఇక అందరి కన్ను ఈవారం ఎలిమినేషన్ల మీద పడుతోంది. దేవి, మెహబూబ్, అరియానా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ ఊహించనిది జరిగినా ఆశ్చర్యం లేదు. గంగవ్వకు ఇబ్బందులు లేకుండా నిన్న రోబో టీంలోనే పెట్టడం చూస్తే ఆవిడ పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. నాగార్జున రావడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడీ పరిణామాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఐపిఎల్ సందడి మొదలైన తరుణంలో రేటింగ్స్ పడిపోకుండా ఉండాలంటే బిగ్ బాస్ ఇంతకు మించి ఎంటర్ టైనింగ్ గా సాగాల్సిన అవసరం చాలా ఉంది. అరుచుకోవడాలు, ఏడ్చడాలు గతంతో పోలిస్తే కొంత తగ్గినట్టే కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp