సుకుమార్ నన్ను అందుకే కొట్టారు

By iDream Post Jul. 10, 2020, 06:29 pm IST
సుకుమార్ నన్ను అందుకే కొట్టారు

సాధారణంగా హీరో హీరోయిన్లు లేదా స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు వచ్చినంత పేరు చిన్నవాళ్ళకు రావడం అంత సులభం కాదు. కరెక్ట్ గా వాడుకునే దర్శకుడు దొరికాడా అది ఇంకో స్థాయికి వెళ్లిపోవచ్చు. కాకపోతే దీనికి చాలా ఓపిక కావాలి. ఇది అలాంటి కథే. మహేష్ అంటే మనకు వెంటనే సూపర్ స్టార్ ప్రిన్స్ గుర్తొస్తాడు కాని అదే పేరుతో మరో యాక్టర్ కూడా ఉన్నారు. అతనే శతమానం మహేష్ అలియాస్ రంగస్థలం మహేష్. ఇతని ప్రయాణం అంత సులువుగా జరగలేదు. 2011లో హైదరాబాద్ వచ్చినప్పుడు మొదట జాబ్ చేసుకుంటూ సినిమా వేషాల కోసం ట్రై చేసేవాడు మహేష్. ముఖ్యంగా ఇతని టార్గెట్ దర్శకుడు సుకుమారే.

ఆర్య, జగడం లాంటి చిత్రాల ద్వారా ఎందరిలోని టాలెంట్ ని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ కావడంతో అతనే తనకు గురువుగా భావించేవాడు. రోజు ఇంటిదగ్గరికి వెళ్లి కాపు కాసేవాడు. సుకుమార్ చదువుకుంది తన స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరే అని తెలుసుకున్న మహేష్ ఆ తర్వాత ఆయనతో ఫోన్ కూడా చేయించాడు. అలా ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఈలోగా జబర్దస్త్ టీంలో చేరిపోయిన మహేష్ కు అక్కడ పేరు రావడం మొదలైంది. మరోవైపు సుకుమారేమో 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, కుమారి 21 ఎఫ్(నిర్మాతగా) అంటూ అన్ని పూర్తి చేస్తున్నారు కాని పిలుపు మాత్రం రాలేదు. అలా ఏడేళ్ళు ఎదురు చూశాక రంగస్థలం షూటింగ్ మొదలుపెట్టే టైంలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.

హీరో పక్కనే ఉంటూ చాల ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు సుకుమార్. పంచులు వేస్తూనే ఎమోషన్స్ కూడా పలికించేలా దాన్ని తీర్చిదిద్దిన తీరు చూసి మహేష్ సైతం తన బెస్ట్ ఇచ్చేశాడు. సెకండ్ హాఫ్ లో ఆది పినిశెట్టి చనిపోయాడని తెలుసుకుని ఊళ్లోకి వెళ్లి అరుచుకుంటే చెప్పే సీన్లో అయితే ప్రేక్షకులు సైతం వాహ్ అనుకున్నారు. మొదటి సగంలో రామ్ చరణ్ కు నాన్నను అవమానించిన ఘటనను వివరించే చెప్పేదాంట్లోనూ ఈలలు వేయించుకున్నాడు. అలా తన కెరీర్ ని పెద్ద మలుపు తిప్పిన రంగస్థలం లో వేషం ఇచ్చిన సుకుమార్ ని సక్సెస్ మీట్ లో కాళ్ళు మ్రొక్కితే దానికి ఆప్యాయంగా ఆయన ఓ చిన్న దెబ్బ వేసి తిరిగి మొక్కినంత పని చేశారు. ఇది కాస్తా యుట్యూబ్ ఛానల్స్ కి థంబ్ నైల్ గా మారిపోయి నానారకాలుగా వైరల్ అయ్యింది. అలా రంగస్థలంతో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిన మహేష్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp