Radhe Shyam Teaser : నీ గురించి తెలిసినా చెప్పనంటున్న ప్రభాస్

By iDream Post Oct. 23, 2021, 11:38 am IST
Radhe Shyam Teaser : నీ గురించి తెలిసినా చెప్పనంటున్న ప్రభాస్

సాహో తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ కొత్త పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోపీచంద్ తో జిల్ తీశాక కేవలం ఈ సబ్జెక్టు మీదే అయిదేళ్ళు పనిచేసిన దర్శకుడు రాధాకృష్ణ రూపొందించిన ఈ ఎంటర్ టైనర్ ని యువి క్రియేషన్స్ మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందించింది. కరోనా వల్ల పలుమార్లు వాయిదా వేసుకున్న రాధే శ్యామ్ ఎట్టకేలకు 2022 జనవరి 14 వరల్డ్ వైడ్ రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ టీజర్ ని ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ విశేషాలు చూద్దాం.

టీజర్ దాదాపు ప్రభాస్ వాయిస్ ఓవర్ తో ఇంగ్లీష్ లో సాగింది. అన్ని బాషలకు కలిపి ఒకే వీడియోని ఇచ్చే ఉద్దేశంతో ఇలా చేశారు కాబోలు. ఒక్క ఫ్రేమ్ లో మాత్రమే డార్లింగ్ దర్శనం ఇస్తాడు. హస్తసాముద్రికం తెల్సిన హీరోకు అందరి భవిష్యత్తులు ముందే కనిపిస్తూ ఉంటాయి. అవతలి వారి చావుతో సహా అన్నీ అవగతం చేసుకున్న పామిస్ట్ విక్రమాదిత్య(ప్రభాస్)కు తన ప్రేయసి విషయంలోనూ ఊహించని మలుపులు చవిచూస్తాడు. నువ్వెంటో నాకు తెలుసు అంటూనూ ఏదీ తనకు చెప్పడు. మరి ప్రమాదకరమైన విద్యను అవగతం చేసుకున్న విక్రమాదిత్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే రాధే శ్యామ్ కథ.

అభిమానులు అంచనాలు పెట్టుకున్న స్థాయిలో టీజర్ ని కట్ చేయలేదు. ప్రభాస్ గొంతు వినిపించడమే మహా భాగ్యం అనేలా ఏదో కానిచ్చేశారు కానీ కేవలం దీన్ని బట్టే అంచనాలు పెంచేసుకునే రేంజ్ లో వీడియో లేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్న సంగతి విజువల్స్ రూపంలో తెలుస్తోంది కానీ పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. జస్టిన్ ప్రభాకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ గా అనిపించింది. ఇంతకు మించి ఇందులో పెద్దగా విశేషాలు లేవు. ట్రైలర్ కట్ కోసం దాచి ఉంచారేమో మరి. జనవరి 14 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని మరోసారి నొక్కి వక్కాణిస్తూ టీజర్ ని ముగించారు. సో అసలైన కిక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే

Also Read : Heroines : హీరోయిన్ క్యారెక్టరైజేషనే అసలు సక్సెస్ మంత్రం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp