రాధే రివ్యూ

By iDream Post May. 13, 2021, 02:27 pm IST
రాధే రివ్యూ

బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఓటిటి రిలీజ్ గా చెప్పుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ రాధే ఎట్టకేలకు ఇవాళ మధ్యాన్నం 11.30 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పే పర్ వ్యూ మోడల్ లో 249 రూపాయల టికెట్ ధరను పెట్టి మరీ మార్కెటింగ్ చేసిన జీ సంస్థ ఈ ఒక్క సినిమా మీదే సుమారు 230 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మన ప్రభుదేవా దర్శకత్వం కావడంతో సౌత్ లోనూ చెప్పుకోదగ్గ అంచనాలు ఏర్పడ్డాయి. రంజాన్ పండగా సందర్భంగా తన రిలీజ్ ని కరోనాలోనూ ఉండేలా చూసుకున్న సల్లు భాయ్ అంచనాలకు తగ్గట్టు మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన డ్రగ్ డీలర్ రానా(రణదీప్ హుడా)సిటీలో కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు చేసి ఎన్నో ఆత్మహత్యలకు కారణం అవుతాడు. ఇతన్ని అడ్డుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ శక్తి సామర్ధ్యాలు చాలక సస్పెన్షన్ లో ఉన్న రాధే( సల్మాన్ ఖాన్)ని వెనక్కు పిలిపిస్తారు. అక్కడి నుంచి రాధే లక్ష్యం రానాను పట్టుకోవడమే అవుతుంది. ఈలోగా నగరంలో లోకల్ గూండాల హత్యలతో పాటు ఎన్నెన్నో దారుణాలు జరుగుతాయి. మరి రాధే చివరికి ఏం చేసి ఉంటాడు అనేది ఈజీగా ఊహించుకోవచ్చు

నటీనటులు

సల్మాన్ ఖాన్ నటన గురించి చెప్పేందుకు ఏమి లేదు. వాంటెడ్ నుంచి ఒకరమైన మొనాటనీకి అలవాటు పడిన సల్లు భాయ్ ఇందులోనూ అదే కొనసాగించాడు. అభిమానులకు క్యారెక్టర్ నచ్చవచ్చేమో కానీ సగటు ప్రేక్షకులకు మాత్రం ఎలాంటి కొత్తదనం కనిపించదు. పైగా ఆ మధ్య మార్చుకున్నకట్టుడు పలువరస చాలా కాలం నుంచి సల్మాన్ డైలాగ్ డెలివరీ మీద ప్రభావం చూపిస్తోంది. ఇందులోనూ అంతే. ఇక దిశా పటాని రెండు మూడు సీన్లలో ఓవర్ యాక్షన్ చేశాక మళ్ళీ ఎక్కువ సేపు కనిపించదు.

తన సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ లో ఎన్నో చెత్త పాత్రలు చేస్తున్న జాకీ శ్రోఫ్ మరో ఆణిముత్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వయసులో కూడా అండర్ వేర్ తో కనిపించే మహత్తర సన్నివేశాలకు ఎలా ఓకే చెప్పారో ఆయనకే తెలియాలి. రణదీప్ హుడా క్యారెక్టర్ ట్రైన్ పట్టాల మీద నలిగిపోయిన రూపాయి బిళ్ళ కంటే దారుణంగా సాగింది. మనకు పరిచయం ఉన్న మేఘా ఆకాష్, భరత్ లకు పేరుకు పోలీస్ ఆఫీసర్లన్నారు కానీ మొక్కుబడి ఎక్స్ ప్రెషన్లు తప్ప వీళ్ళు చేసిందేమి లేదు.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడిగా ప్రభుదేవా ఒకప్పుడు మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాట వాస్తవం. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పును పట్టించుకోకుండా కేవలం సల్మాన్ కటవుట్ ఉంటే చాలు ఎంత చెత్త కథైనా సరే ఆడియన్స్ హిట్ చేస్తారనే భ్రమలో రాధే కథను రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మాత్రం దానికి హాలీవుడ్ మూవీని ఇన్స్ పిరేషన్ తీసుకోవడం ఎందుకో ఎంత జుట్టు పీక్కున్నా అర్థం కాదు. ఒకవేళ ఒరిజినల్ తీసిన దర్శకుడు కనక రాధే చూస్తే సిగ్గుతో తలొంచుకోవడం ఖాయం. అంత దారుణంగా కథా కథనాలు సాగాయి. బిగినింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ఎక్కడా మంచి అభిప్రాయం కలగకుండా ప్రభుదేవా తీసుకున్న శ్రద్ధను మెచ్చుకోవాలి.

ముంబైకి వచ్చిన రానా గ్యాంగ్ కేవలం ముగ్గురితో వందలాది గ్యాంగ్ స్టర్లను రౌడీలను చంపేస్తూ ఉంటుంది. కానీ టెక్నాలజీ, వనరులు ఇంతగా అభివృద్ధి చెందిన రోజుల్లో కనీసం వాడి జాడ ఎక్కడో కూడా రాధే పసిగట్టలేకపోవడం లాంటి ఇల్లాజికల్ పాయింట్స్ ఇందులో చాలా ఉన్నాయి. విలన్ బిల్డప్ మీద పెట్టిన శ్రద్ధలో పావు వంతు స్క్రీన్ ప్లే మీద పెట్టి ఉంటే కనీసం వాంటెడ్ లో సగం వరకైనా రీచ్ అయిపోయి ఫ్యాన్స్ సంతృప్తి పడేవాళ్ళు. కానీ ప్రేక్షకులను మరీ తక్కువగా లెక్కగట్టి నాసిరకం టేకింగ్ తో ప్రభుదేవా చూపించిన తీరు అసలు నిర్మాణ సంస్థ ఇంత బడ్జెట్ ఎలా పెట్టిందా అనే అనుమానం కలిగేలా చేస్తుంది.

ఎంత ఖరీదు పెట్టి కొన్నా డస్ట్ బిన్ స్థాయి పెరగదు. ఇంట్లో వాడి పారేసినవి, వృధావి చివరికి అందులోనే పారేస్తాం. రాధే కూడా ఇదే బాపతు. కోట్ల ఖర్చు, సల్మాన్ లాంటి రేంజ్ ఉన్న స్టార్ ఉంటే సరిపోదు. బలమైన కంటెంట్ ఉండాలి. ఆ మధ్య రేస్ 3 అనే కళాఖండం ఒకటొచ్చింది. ఎలాగైనా దాని రికార్డుని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో రాధేని తీసినట్టు ఉంది తప్ప అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో లెక్క వేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తీసే ఇలాంటి సినిమాలకు ఓటిటి రిలీజ్ కరెక్ట్. ఒకవేళ థియేటర్ లో అయితే ఎన్ని కోట్ల రూపాయలు టికెట్ల రూపంలో పబ్లిక్ ఖర్చు పెట్టాల్సి వచ్చేదో. ఒకరకంగా ఈ నిర్ణయం తీసుకుని చాలా మంచి పని చేశారు.

ఇక సాంకేతిక నిపుణుల గురించి చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. సంచిత్ అంకిత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సౌండ్ ఎక్కువ సరుకు తక్కువ అన్నట్టు సాగింది. నాలుగు పాటలు అదృష్టం కొద్ది ఫార్వార్డ్ ఆప్షన్ ఉండటంతో ప్రేక్షకుల పాలిట వరమయ్యాయి. సోషల్ మీడియాలో సీటిమార్ సాంగ్ చూసి దేవి బన్నీలు ఎంత బాధ పడ్డారో. రితేష్ సోని ఎడిటింగ్ కష్టపడి రెండు గంటల లోపే కుదించినప్పటికీ చాలా చోట్ల బోర్ కొట్టడానికి కారణం వాళ్ళు కాదు. ప్రభుదేవానే. ఆయనంక బోస్ ఛాయాగ్రహణం ఒక్కటే కాస్తో కూస్తో మెచ్చుకోదగినది. నిర్మాణ సంస్థ అడిగినంత ఖర్చు పెట్టింది కానీ వాళ్ళు కోరుకున్న ప్రయోజనం స్క్రీన్ మీద నెరవేరలేదు

ప్లస్ గా అనిపించేవి

ఓటిటిలో రావడం
తక్కువ నిడివి
ఫార్వార్డ్ ఆప్షన్

మైనస్ గా తోచేవి

సల్మాన్ తో సహా అందరూ
అవుట్ డేటెడ్ ఫార్ములా
దారుణమైన క్యారెక్టరైజేషన్లు
ఇంకా చాలా

కంక్లూజన్

మాస్ మూవీ అంటే ప్రేక్షకులను చులకనగా అంచనా వేయడం కాదని తెలుసుకోనంత వరకు రాధే లాంటి సి గ్రేడ్ సినిమాలు వస్తూనే ఉంటాయి. ఉత్తి బిల్డప్పులతో సినిమాలు ఆడే పనైతే ఏ రచయితకు పని ఉండదు. దర్శకులే తమ మనసులో పైత్యాన్ని పేపర్ మీద పెట్టేసి క్రేజ్ ని నమ్ముకుని డబ్బులు పెట్టే నిర్మాతలు దొరికాక ఇలాంటి రాధేలు ఎన్నైనా తీయొచ్చు. తీసినోళ్లు చేసినోళ్లు అందరూ బాగుంటారు. ఎటొచ్చి మధ్యలో అమాయకంగా మోసపోయేది కాంబినేషన్లను నమ్ముకుని డబ్బులు ఖర్చు పెట్టే ఆడియన్సే. మీరెంత సల్మాన్ ఫ్యాన్స్ అయినా రాధే చూశాక ప్రభుదేవా దర్శకత్వం మీద హీరో సెలక్షన్ మీద కోపం రావడం ఖాయం.

రాధే - భరించలేని బాధే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp