పీపుల్స్ స్టార్ బ్రహ్మచారి కథ

By iDream Post Jun. 25, 2020, 07:09 pm IST
పీపుల్స్ స్టార్ బ్రహ్మచారి కథ

సాధారణంగా తెలుగు సినిమాల్లో హీరోలు ఖచ్చితంగా చాలా అందంగా ఉండాలనే రూల్ ని బ్రేక్ చేస్తూ అభ్యుదయ భావాలతో చిత్రాలు తీసి ఇండస్ట్రీ హిట్లు సైతం సాధించడం ఒక్క పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తికే సాధ్యమయ్యిందని చెప్పాలి. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో అర్ధరాత్రి స్వతంత్రం లాంటి రెవెల్యూషనరి చిత్రంలో డెబ్యూతోనే సంచలనానికి నాంది పలికిన నారాయణమూర్తి గారు ఆ తర్వాత దండోరా, ఎర్ర సైన్యం, ఒరేయ్ రిక్షా, ఎర్రోడు, చీమలదండు, సింగన్న లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలతో వెండితెరపై తనదైన శైలిలో రెడ్ సిగ్నేచర్ పెట్టారు.

నిజ జీవితంలోనూ మాములు మనిషిగా కనిపించే ఈయన చాలా సార్లు అభిమానులకు, పబ్లిక్ కు రోడ్డు మీద నడిచి వెళ్తూ కనిపిస్తుంటారు. ఇలా ఎందుకంటే తక్కువ దూరంలో ప్రదేశాలకు వెళ్ళడానికి నడక కన్నా ఉత్తమమైంది మరొకటి లేదంటారు ఆయన. దూరం అయితే తప్ప ఆటో, టాక్సీ లాంటి వాటిని ఆశ్రయించరు. ఒక్కోసారి సిటీ బస్సులో వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆరు పదుల వయసు దాటిన నారాయణమూర్తి ఇంకా బ్రహ్మచారే. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగితే యూత్ లో ఉన్నప్పుడు ఆయన ఓ అమ్మాయిని ఇష్టపడ్డారు. ప్రేమించలేదు కానీ తననే జీవిత భాగస్వామిని చేసుకుంటాయని తల్లితండ్రులను కోరారు. కానీ కులం వేరు కావడంతో వాళ్ళు ఒప్పుకోలేదు.

దీంతో కన్నవాళ్ళ మనసుని కష్టపెట్టడం ఇష్టం లేక అక్కడితో ఆ ఆలోచన మానుకున్నారు. అందులోనూ తన పంథా రాబోయే భార్యకు నచ్చకపోతే తనకే ఇబ్బందని గుర్తించి ఆపై ఎలాంటి ప్రతిపాదనలు తన వద్దకు రానీయలేదు. అయితే మేడ మీద ఒంటరిగా కూర్చున్నప్పుడు లైఫ్ పార్టనర్ ఉంటే బాగుండేదని ఇప్పుడైతే ఫీలవుతున్నారు. సంఘ జీవనంలో అతి ముఖ్యమైన కుటుంబం తనకు లేకపోవడం అప్పుడప్పుడు వెలితిగా అనిపిస్తుందట. ఎందరో అభిమానులను అంతకన్నా ఎక్కువగా బడుగువర్గాల కష్టాలను తెరమీద చూపించిన పీపుల్స్ స్టార్ గా సామాన్య ప్రేక్షకులకు సైతం దగ్గరైన నారాయణమూర్తి గారు సినిమాలు తగ్గించారు కానీ ఇప్పుడు కూడా అదే పాత ఎనర్జీతో ఉత్సాహంగా మాట్లాడ్డం గమనించవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp