ఓటిటిలు అందుకే వద్దంటున్న నిర్మాతలు

By iDream Post Aug. 02, 2020, 12:28 pm IST
ఓటిటిలు అందుకే వద్దంటున్న నిర్మాతలు

ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకుని థియేటర్ల కోసం ఎదురు చూస్తున్నవి, నిర్మాణ చివరి దశలో ఉన్న సినిమాల నిర్మాతల వెంట ఓటిటిలు వెంటపడుతూనే ఉన్నాయి. భారీ ఆఫర్లతో ఊరిస్తూనే ఉన్నాయి. అయితే మన ప్రొడ్యూసర్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికే రెడ్, నిశ్శబ్దం, నాని వి, అరణ్యలకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లకు సైతం డీల్స్ ఇచ్చారట . అయితే వీటిని తిరస్కరించినట్టు సమాచారం. డిజిటల్ సంస్థలు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి కారణం ఉంది. మన మార్కెట్ చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా రీచ్ భారీగా ఉంటుంది.

అందులోనూ నార్త్ లో కూడా ఈ మధ్య మన చిత్రాలను ఎగబడి చూసి వందల మిలియన్ల వ్యూస్ ని కట్టబెడుతున్నారు. ఈ లెక్కన స్ట్రెయిట్ గా ఆన్ లైన్ రిలీజ్ చేస్తే ఇంకే స్థాయిలో స్పందన ఉంటుందో వేరే చెప్పాలా. అందుకే వద్దంటున్నా సరే ఆఫర్స్ ఇవ్వడం మాత్రం మానుకోవడం లేదు. మరోవైపు అదుగో పులి ఇదుగో తోక తరహాలో కేంద్ర ప్రభుత్వం థియేటర్లు తెరవడం గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయం కాదు. అందుకే కరోన తాకిడి లేని రాష్ట్రాల్లో కూడా వీటిని ఓపెన్ చేయడం లేదు. మన నిర్మాతలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఆగస్ట్ ఎటూ చేజారింది. సెప్టెంబర్ కూడా పోయిందనే అనుకుందాం. అక్టోబర్ కంతా పరిస్థితిలో మెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. అంటే మూడు నెలల కాలంలో మొత్తం 12 శుక్రవారాలు వస్తాయి. ఒకదాని మీద ఒకటి పోటీ పడకుండా వారానికి ఒకటి లేదా రెండు విడుదల చేసుకోవడానికి తగినన్ని సినిమాలు చేతిలో ఉండాలి.

ఇప్పుడు ఏదో టెంప్ట్ చేసే డబ్బు వస్తుంది కదాని అమ్మేసుకుంటే ఆ టైంలో ఫీడింగ్ కోసం కొత్త చిత్రాలు లేక ఎగ్జిబిటర్లు అల్లాడిపోతారు. అందుకే అగ్ర నిర్మాతలు ఒకమాటగా హాళ్ళు తెరిచే దాకా వేచి ఉండే ధోరణికే కట్టుబడినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ లో ఓటిటి ట్రెండ్ ఉధృతంగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా గొప్ప అద్భుతాలు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. ఒక్క దిల్ బేచారా మాత్రమే సుశాంత్ మీద సానుభూతి ఫ్యాక్టర్ మీద భారీ స్పందన తెచ్చుకుంది తప్ప మరో కారణం లేదు. అందుకే తొందరపడి సొమ్ములు చేసుకోవడం కన్నా ఇంకాస్త ఓపికతో వేచి చూసి అందరి మేలుని కోరే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు . కాకపోతే దసరాలోపు పరిస్థితులు చక్కబడి కరోనా మహమ్మారి దూరమవ్వాలని కోరుకుందాం. అప్పుడే ఇక్కడ చెప్పుకున్నవి జరిగే అవకాశాలు ఉంటాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp