స్వరసాగరంలో ప్రియతముడి ప్రణయం - Nostalgia

ఇప్పటితరమే కాదు రానున్న జనరేషన్లు కూడా తరగని ఆస్తిగా దాచుకోదగ్గ గొప్ప నిధి ఇళయరాజా సంగీతం. కాలంతో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వయసు వారి దాకా ప్రతిఒక్కరిని తన పాటల పూదోటలో పరవశింపజేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. సగటు ప్రతి పది మంది స్మార్ట్ ఫోన్లు చెక్ చేస్తే అందులో కనీసం ఐదారుగురిలో రాజా పాటల కలెక్షన్ లేదా ప్లే లిస్ట్ ఉండే ఉంటుంది. ముఖ్యంగా 90వ దశకంలో జనాన్ని ఊర్రూతలూగించిన స్వరాలు ఇప్పటికీ అంతే జీవకళతో మనల్ని మరిపిస్తాయి.
అలాంటిది స్వయంగా ఇళయరాజానే వేదికగా పై చూస్తూ గానగంధర్వులు ఆలపిస్తుండగా వాటిని చూడటం కంటే నయనానందం ఏముంటుంది. కొన్నేళ్ల క్రితం న్యూ యార్క్, యుఎస్ఏ తదితర దేశాల్లో జరిగిన లైవ్ కన్సర్ట్ లో ప్రవాసాంధ్రులతో పాటు ఎందరో భారతీయులు ఈ అదృష్టానికి నోచుకున్నారు. మచ్చుకో చిన్న ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా నిలిచిన జగదేకవీరుడు అతిలోకసుందరి గురించి చెప్పాలంటే ఎక్కువ పాండిత్యం అవసరమవుతుంది.
తుఫాను టైంలో విడుదలైన కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించి ఇప్పటికీ మాస్టర్ పీస్ లా అనిపించే ఈ సినిమాలోని సంగీతం గురించి చెప్పాలంటే ఎవర్ గ్రీన్ అనే మాట చిన్నదే. ముఖ్యంగా "ప్రియతమా నను పలకరించు ప్రణయమా" అంటూ ఎస్పి బాలసుబ్రమణ్యం, ఎస్ జానకిలు ఆలపిస్తూ ఉండగా వేటూరి సాహిత్యానికి కరిగిపోని గుండె లేదు. దివి నుండి భువికి దిగివచ్చి మానవుడి ప్రేమలో పడిన ఒక దేవకన్య మనసులో భావాలను అక్షరాలుగా పేర్చిన తీరు అబ్బురపరుస్తుంది. అదే పాటను ఇళయరాజా సమక్షంలోనే బాలు గారు గీతామాధురితో కలిసి ఆలపిస్తూ ఉంటే అందరూ తన్మయత్వంలో మునిగి తేలారు. అది ఎంత ఉల్లాసాన్ని కలిగించిందో మీరూ వీక్షించండి. మరొక్కసారి చిరు శ్రీదేవిల జంట కళ్ళ ముందు ప్రత్యక్షమై ఇళయరాజా సుముఖంలోనే మరోసారి ఆనందడోలికల్లో ముంచెత్తడం ఖాయం.


Click Here and join us to get our latest updates through WhatsApp