పాన్ ఇండియా దర్శకుడిని కట్టేసుకున్నారు

By iDream Post May. 21, 2021, 11:30 am IST
పాన్ ఇండియా దర్శకుడిని కట్టేసుకున్నారు
బాహుబలి నుంచి తెలుగు సినిమా ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ చిత్రాలు నిర్మాణంలో ఉండగానే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి. డబ్బింగ్ హక్కులు కూడా కోట్ల రూపాయలు తెచ్చి పెడుతున్నాయి. అందుకే పాన్ ఇండియా అనే పదానికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చి పడింది. ఆఖరికి ఇప్పటిదాకా సరైన హిట్టు లేని చిన్నా చితక హీరోలు కూడా ఇప్పుడు మల్టీ లాంగ్వేజ్ మూవీ అంటూ గట్టి హడావిడి చేస్తున్నారు. అవి థియేటర్లలో ఆడుతున్నాయా లేదా అనేది పక్కనపెడితే కనీసం మార్కెటింగ్ చేసుకోవడానికి పాన్ ఇండియాని చక్కగా వాడుకుంటున్నారు. ఇప్పుడు యాభై శాతం పైగా ఈ ట్యాగ్ తో రూపొందుతున్నవే.

ఇక విషయానికి వస్తే కెజిఎఫ్ తో శాండల్ వుడ్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ని మన స్టార్లే ఎక్కడికి  వెళ్లకుండా కట్టేసుకుంటున్నారు. ప్రభాస్ తో సలార్ నిర్మాణంలో ఉండగా నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి సంస్థ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది ఎప్పుడో లీకైన వార్త అయినప్పటికీ ఫైనల్ గా అధికారిక ముద్ర పడింది. అల్లు అర్జున్ కూడా ప్రశాంత్ నీల్ తో చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడు. పుష్ప తర్వాత కానీ దీనికి సంబంధించిన క్లారిటీ రాదు. కెజిఎఫ్ 2 రిలీజయ్యాక ప్రశాంత్ డిమాండ్ ఇంతకు పదింతలు పెరుగుతుందని ఇప్పటికే టాక్ ఉంది.

ఈ పరిణామాల పట్ల కన్నడ మూవీ లవర్స్ గుర్రుగా ఉన్నారు. లైఫ్ ఇచ్చిన మాతృ పరిశ్రమను పక్కనపెట్టేసి తెలుగు హీరోల వెనకాల పడటం ఏమిటనేది వాళ్ళ ఫిర్యాదు. అయితే ప్రశాంత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పెద్ద రేంజ్ కు వెళ్లాలంటే టాలీవుడ్ స్టార్లతోనే సాధ్యం. కెజిఎఫ్ తరహాలో ప్రతిసారి కన్నడలో అద్భుతాలు చేయడం అంత ఈజీ కాదు. యష్ కు మార్కెట్ వచ్చింది కానీ సుదీప్, పునీత్, దర్శన్ లాంటి వాళ్లకు కర్ణాటక తప్పించి బయట అంతగా గుర్తింపు లేదు. కానీ ప్రభాస్, తారక్, బన్నీల కేసు అలా కాదు. అందుకే ప్రశాంత్ నీల్ తెలుగు సినిమాల మీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp