'మా' కప్పులో పోటీ తుఫాను

By iDream Post Jun. 23, 2021, 01:09 pm IST
'మా' కప్పులో పోటీ తుఫాను

మా అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న పోటీ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మంచు విష్ణుల మధ్య వార్ గురించి రసవత్తరమైన చర్చ జరుగుతుండగా తాజాగా జీవిత రాజశేఖర్ కూడా బరిలో దిగాలని ఆలోచన చేస్తుండటం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇంకా ఏది అధికారికంగా ప్రకటించనప్పటికీ ఫిలిం నగర్ వర్గాల్లో మాత్రం హాట్ డిస్కషన్లు జరుగుతున్నాయి. దానికి తోడు నిన్న ఓ టీవీ ఛానల్ లో మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కు బహిరంగ మద్దతు ప్రకటించడంతో ఇదింకా రసవత్తరంగా మారింది. మరోవైపు మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణతో సహా ఇండస్ట్రీ సీనియర్లను కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం మొదలుపెట్టారు.

తనకు తోడుగా నాన్న మోహన్ బాబు కూడా వెంటే ఉండి తీసుకెళ్తున్నారు. వీళ్ళు చాలదన్నట్టు శివాజీరాజా కూడా రేస్ లో ఉన్నారని ఇంకో టాక్ ప్రచారంలో ఉంది. అసలు ఫైనల్ గా ఎవరు ఉంటారు ఎవరు తప్పుకుంటారు అనే క్లారిటీ మాత్రం రావడం లేదు. ఎలా చూసుకున్నా ఏకగ్రీవం ఛాన్స్ దాదాపుగా లేనట్టే. చిరంజీవి మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. తన ట్విట్టర్ లో కానీ ఎవరైనా బయటి వాళ్ళు తనను కలిసినప్పుడు కానీ దీనికి సంబంధించిన విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇంటికి మా అసోసియేషన్ వాళ్ళు ఎవరు వచ్చినా మాట్లాడుతున్నారు కానీ ఫోటోలు మాత్రం నో అంటున్నారట.

కేవలం వందల్లో సభ్యులు ఉండే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కుర్చీకి ఇంత స్థాయిలో పోటీ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకప్పుడు సామాన్య జనానికి పెద్దగా అవగాహన లేని ఈ వ్యవహారం గత కొంత కాలంగా మాలోని అంతర్గత విభేదాల వల్ల పబ్లిక్ ఇంటరెస్ట్ గా మారిపోయింది. అందుకే మీడియా సైతం ఎన్నడూ లేని కవరేజ్ దీనికి ఇస్తోంది. గతంలో రాజశేఖర్, జీవిత, నరేష్, రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజా తదితరులు మాలో విభేదాలను కెమెరా ముందు తెచ్చినవాళ్ళే. ఇప్పుడూ ఇలాంటి సీన్లు రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు. మరోవైపు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ కార్డుని కూడా ప్రత్యర్థులు బయటికి తీస్తున్నారు. చూడాలి ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp