బాలయ్య 106కి పవర్ ఫుల్ టైటిల్

By iDream Post May. 30, 2020, 12:35 pm IST
బాలయ్య 106కి పవర్ ఫుల్ టైటిల్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 106కి టైటిల్ దాదాపు ఖరారైనట్టుగా తెలిసింది. లాక్ డౌన్ కన్నా ముందే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీకి కరోనా వల్ల పెద్ద బ్రేక్ పడింది. దీని కోసమే ప్రత్యేకంగా తన వేషభాషల్లో మార్పు తెచ్చుకున్న బాలయ్య మళ్ళీ మేకోవర్ కోసం రెడీ అవుతున్నారు. జూన్ రెండు లేదా మూడో వారం నుంచి దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. తాజాగా టైటిల్ లీక్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది.

ఫిలిం ఛాంబర్ లో నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి రిజిస్టర్ కూడా చేయించారట. ప్రస్తుతం స్క్రిప్ట్ ని మరోసారి జల్లెడ పడుతున్న బోయపాటి శీను ముందు నుంచి దీనికే ఓటు వేసినట్టుగా వినికిడి. అయితే ఇలాంటి టైటిల్ మాస్ కి కనెక్ట్ అవుతుందా లేదా అనే అనుమానం వ్యక్తమైనప్పుడు గతంలో లెజెండ్ టైంలోనూ కూడా ఇలాంటి కామెంట్స్ వినిపించాయని కానీ దాని రిజల్ట్ మరిచిపోయారా అని బోయపాటి బదులు చెప్పినట్టు సమాచారం. మొత్తానికి మోనార్క్ అనే సౌండ్ పవర్ ఫుల్ గా వినిపిస్తోంది. ఇది బాలయ్య-బోయపాటిల హ్యాట్రిక్ మూవీ. సింహా-లెజెండ్ లు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాక మళ్ళీ ఈ కలయిక సాధ్యపడలేదు.

గత పదిహేనేళ్లలో బాలకృష్ణను సరైన రీతిలో చూపించిన దర్శకుడు పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఈయనొక్కడే. అందుకే అభిమానుల ఆశలన్నీ శీను మీదే ఉన్నాయి. పైసా వసూల్ నుంచి బాలకృష్ణకు సరైన విజయం లేదు. జైసింహా కూడా సోసోగానే ఆడింది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ మరీ దారుణంగా దెబ్బ కొట్టడంతో బాలయ్య మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించాయి. అందుకే బోయపాటి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని ప్రకటించే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం లీకైన న్యూస్ కాబట్టి అధికారికంగా చెప్పలేం కానీ మొత్తానికి మోనార్క్ అనే పేరు అభిమానులకు కిక్ ఇచ్చేలాగే ఉంది. ఇందులో బాలయ్య ఒకటి అఘోరా తరహా పాత్రను మరొకటి సీమ ఫ్యాక్షనిస్ట్ గా డిఫరెంట్ షేడ్స్ లో చేయబోతున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక బయటికి వస్తాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp