కాలాన్ని వెన‌క్కి తిప్పే Play Back

By G.R Maharshi Jun. 04, 2021, 04:19 pm IST
కాలాన్ని వెన‌క్కి తిప్పే Play Back

కాలం ప్ర‌వ‌హించే న‌ది. ఒక‌సారి తాకిన నీళ్ల‌ని ఇంకోసారి తాక‌లేవు. అవి వెళ్లిపోతాయి. కాలం కూడా అంతే, వెన‌క్కి రాదు. అయినా గ‌డియారాన్ని వెన‌క్కి తిప్పాల‌ని మన ఆశ‌. అవ్వాతాత‌, బాల్యం, స్కూల్ స్నేహితులు అంద‌రినీ గ‌తంలోకి వెళ్లి చూడాల‌ని పిస్తుంది. ఒక‌వేళ వెళితే వాళ్లంతా వుంటారు. కానీ ఫ్రేమ్‌లో ఇప్పుడున్న పిల్లలుండ‌రు. జీవితం అంతే. ఒక‌టి తీసుకుంటే ఇంకొక‌టి ఇస్తుంది. అన్నీ ఇవ్వ‌దు.

మ‌న‌కు హాలీవుడ్ స్క్రిప్ట్‌లు లేవ‌నే బాధ వుండేది. కొత్త కుర్రాళ్లు వ‌చ్చేస్తున్నారు. కొత్త క‌థ‌ల‌తో, కొత్త స్థాయితో. డైరెక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్ జ‌క్కా కొత్త వాడేం కాదు. గ‌తంలో ద‌ర్శ‌కుడు అనే సినిమా తీసాడు. అది ఆడిన‌ట్టు లేదు. ఇపుడు Play Back తీసాడు. థియేట‌ర్‌లో ఏ మేర‌కు రెస్పాన్స్ వ‌చ్చిందో తెలీదు. అపుడు నేను యూఎస్‌లో వున్నా.

భూమి ఒక‌టే, కానీ రెండు వేర్వేరు కాలాలు. సైన్స్‌పైన అవ‌గాహ‌న వున్నా, ఇది నాకు ఆశ్చ‌ర్య‌మే. నేను ఉద‌యం వాకింగ్ చేస్తూ మాట్లాడుతూ వుంటే ఇండియాలోని మిత్రులు డిన్న‌ర్ చేస్తూ వుంటారు. నేను నిద్ర‌లోకి జారుకుంటున్న‌పుడు వాళ్లు ఉద్యోగాల్లో బిజీగా వుంటారు. క‌ళ్ల ముందు చూసేది సంపూర్ణ స‌త్యం కాదు, ప్ర‌తిదీ సాపేక్ష‌క‌మే.

ఒక‌వేళ మ‌నిషి విమానాలు, టెలిఫోన్ క‌నిపెట్ట‌క‌పోతే భూమి మీద రెండు వేర్వేరు కాలాలు వుంటాయ‌ని తెలిసేది కాదు. అది ఒక న‌మ్మ‌కం మాత్ర‌మే. భూమి మీదే రెండు టైమ్‌లైన్స్ (గంట‌ల తేడాతో) వున్న‌పుడు, భూమికి దూరంగా సుదూర గ్ర‌హంలో సంవ‌త్స‌రాలు తేడా వుండొచ్చు. అంటే వాళ్ల ఒక రోజు మ‌న‌కి 6 నెల‌లు కావ‌చ్చు. ఇంట‌ర్ స్టెల్ల‌ర్‌లో క్రిష్ట‌ఫ‌ర్ నోల‌న్ చెప్పింది ఇదే. అయితే ప్లే బ్యాక్‌లో హ‌రిప్ర‌సాద్ చెప్పింది వేరు.

కాలాన్ని వెన‌క్కి తిప్పితే నిజంగా అద్భుతం. వెనుక‌టికి గ‌డియారాలు చేసే మ‌హాశిల్పి ఒక‌డు ముళ్లు వెన‌క్కి తిరిగే గ‌డియా రాన్ని చేశాడు. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. కాలం వెన‌క్కి వెళితే యుద్ధంలో చ‌నిపోయిన త‌న కొడుకు తిరిగొస్తాడ‌ని అత‌ని ఆశ‌.

ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజమిన్ బ‌ట‌న్ (2008) సినిమాలోని సీన్ ఇది. బ్రాడ్‌ఫిట్ హీరో, డేవిడ్ ఫ్లించ‌ర్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాని అర్థం చేసుకోడానికి చాలా ఆలోచ‌న కావాలి. ఫ్లించ‌ర్ సినిమాల‌న్నీ ఇంతే. అత‌ని ద‌గ్గ‌ర అర‌టి ప‌ళ్లు వుండ‌వు. పీచు వ‌లిచి , కాయ ప‌గుల‌గొట్టి, కొబ్బెర‌ని, నీళ్ల మాధుర్యాన్ని అనుభ‌వించాలి (నారికేళ పాకం). వ‌య‌సు వెన‌క్కి వెళ్లే వాడి క‌థ‌ని 99 ఏళ్ల క్రితం (1922) ఫిట్జ్‌గెరాల్డ్ అనే ర‌చ‌యిత రాసాడు. వీడెంత గొప్ప‌వాడంటే ప్ర‌పంచ‌మే చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డి గౌర‌వించేంత‌!కానీ అత‌ను చిన్న ఉద్యోగం కోసం అంద‌రినీ అడుక్కున్నాడు. అప్పులు తీర్చ‌డానికి ఈ క‌థ రాసాడు. హాలీవుడ్‌లో స్క్రిప్ట్ ప‌నులు చేసి బ‌తికాడు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన గాన్ విత్ ది విండ్ (1939) స‌గం డైలాగులు ఈయ‌న‌వే. టైటిల్స్‌లో ఎక్క‌డా పేరు వుండ‌దు. వాస్త‌వంలోని క‌ఠిన‌త్వం అర్థం కాన‌పుడు, మ‌త్తులోని మృదుత్వాన్ని ప్రేమిస్తారు. ఎంత‌లా తాగాడంటే చ‌చ్చిపోయే వ‌ర‌కూ తాగాడు.

సినిమా రంగం గొప్ప‌త‌నం ఏమంటే అది మ‌హాశిల్పితో ప్లంబింగ్ ప‌నులు చేయిస్తుంది.

టైమ్ మిష‌న్ క‌థ‌లు కొత్త‌కాదు. ఆదిత్య 369, సూర్య న‌టించిన 24. ఆదిత్య అర్థ‌మైన‌ట్టు 24 అర్థం కాలేదు. కార‌ణం ఆదిత్య‌లో ఒక వెహిక‌ల్ వుంటుంది. కాలంలోకి ప్ర‌యాణిస్తారు. 24లో ఒక వాచీ వుంటుంది. దాన్ని తిప్పాలి. సంక్లిష్ట‌త వ‌ల్ల ఇది ఆడ‌లేదు.

ప్లే బ్యాక్‌లో ఒక ఫోన్ ద్వారా రెండు వేర్వేరు కాలాల వ్య‌క్తులు క‌నెక్ట్ అవుతారు. స్క్రీన్ మీద ఇది ఆడియ‌న్స్‌కి క‌నెక్ట్ చేయ‌డం క‌ష్టం. కానీ హ‌రిప్ర‌సాద్ చేశాడు. డార్క్ సీరిస్‌కి ఇది ఇమిటేష‌న్‌, ప్రేర‌ణ అని రివ్యూస్‌లో చ‌దివాను. మ‌న‌కంటే ముందు ఎవ‌రో ఒక‌రు చేస్తేనే, రాస్తేనే మ‌నం చేయ‌గ‌లం. ప్రేర‌ణ లేకుండా ఎవ‌రూ ఏదీ చేయ‌లేరు. ఒక గొప్ప సినిమా చూసినా, న‌వ‌ల చ‌దివినా అలాంటిది మ‌నం తీయ‌లేం, రాయ‌లేం. ప్రేర‌ణ పొందాలంటే కూడా మ‌న‌లో స్వ‌త‌హాగా శ‌క్తి వుండాలి. హ‌రిప్ర‌సాద్‌కి ఆ శ‌క్తి వుంది. స్క్రీన్ ప్లేలో అత‌ని క‌ష్టం, మ‌న‌ల్ని లేవ‌నీయ‌కుండా కూర్చో బెట్ట‌డంలోనే తెలుస్తుంది.

అన‌న్య ఇండ‌స్ట్రీకి ఒక గిప్ట్‌. క‌ళ్ళ‌తో, భావాల‌తో న‌టించే హీరోయిన్లు అరుదైపోతున్నారు. ఎంత సంక్లిష్ట‌మైన పాత్ర‌యినా అవ‌లీల‌గా చేసేసే టాలెంట్ వుంది. అచ్చ తెలుగు అమ్మాయి.

హీరోగా దినేష్ తేజ బావున్నాడు. టీవీ5 మూర్తిలో మంచి జ‌ర్న‌లిస్టే కాదు, న‌టుడు కూడా వున్నాడు. TNRని చూస్తే బాధ‌. ఇంకా ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చేవో. తొంద‌ర‌ప‌డి కాలం తీసుకెళ్లిపోయింది. ప్ర‌త్యేకంగా నాగేశ్వ‌ర‌రెడ్డి ఎడిటింగ్‌ గురించి చెప్పాలి. ఇలాంటి థ్రిల్ల‌ర్స్‌లో ఏ కాస్త ఎక్కువైనా క‌థ‌లో ఉత్కంఠ పోతుంది. షార్ప్‌ క‌ట్స్‌తో టెంపో నిల‌బెట్టాడు.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ, డిఫ‌రెంట్ టైమ్ లైన్స్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి (93-2019) ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ , గతంలోకి వెళ్లి జ‌రిగిన త‌ప్పుల్ని సరిదిద్ద‌డం. చేప‌ల వ‌ల‌లా కాకుండా సాలెగూడులా చిక్క‌గా క‌థ‌ని అల్లాడు కాబ‌ట్టి స్క్రీన్ మీద నిల‌బ‌డింది. పాట‌లు, పిచ్చి కామెడీ లేకుండా క‌థే న‌డుస్తుంది. దీనికి కెమెరా, ఆర్ట్ డైరెక్ట‌ర్ , మ్యూజిక్ తోడుగా నిలిచారు. చివ‌ర్లో ఎవ‌రో సాధువు ఉప‌దేశం , రొటీన్ విల‌నీతో కొంచెం హ‌డావుడిగా ముగిసింది. అదో లోపం. సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌ల్ని చెప్పి ఒప్పించడం క‌ష్టం. దీంట్లో లాజిక్ వుండ‌దు కాబ‌ట్టి. థియేట‌ర్‌లో ఆడ‌క‌పోవ‌చ్చు కానీ, ఇది ఖ‌చ్చితంగా మంచి సినిమా.

మ‌నిషి రెక్క‌లు క‌ట్టుకుని ఎగ‌రాల‌నుకున్నాడు, ఎగిరాడు. ప్ర‌పంచ‌మే చేతిలో ఇముడ్చుకున్నాడు. రేపు నిజంగా కాలాన్ని వెనక్కి తిప్పుతాడేమో!

1976లో అనంత‌పురం ఎగ్జిబిష‌న్‌లో రూపాయి టికెట్‌తో (రూపాయికి ఆ రోజుల్లో విలువ ఎక్కువ‌) బ్లాక్ అండ్ వైట్ టీవీలో బొమ్మ చూసాను. ఈ రోజు ఫోన్‌లో క‌ల‌ర్ సినిమా చూస్తున్నా. రేపు టైంలోకి ప్ర‌వేశించి గ‌తాన్ని వెతుక్కోనూ వ‌చ్చు.

అయినా గ‌తం, ప్ర‌శాంతంగా వున్న మొస‌ళ్ల స‌ర‌స్సు లాంటిది. దాన్ని జోలికెళితే కాలంలోని క్రూర‌త్వాన్ని క‌ళ్ల ముందు చూపుతుంది.

వూపిరి పీల్చుకోవాల్సిన విష‌యం ఏమంటే, మ‌న సినిమా కూడా మారుతోంది. కొత్త నీళ్లు వ‌స్తున్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp