దర్శకేంద్రుడి మార్కు మ్యారేజ్ కామెడీ

By iDream Post Sep. 22, 2021, 02:15 pm IST
దర్శకేంద్రుడి మార్కు మ్యారేజ్ కామెడీ

ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన దర్శకేంద్రుడి మాయాజాలం పెళ్ళిసందడి సినిమాను అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. అప్పటికి స్టార్ గా పెద్దగా గుర్తింపు లేని శ్రీకాంత్ ని తెలుగు ప్రేక్షకులను దగ్గర చేయడం, 14 పాటలతో ఏంఎం కీరవాణి సృష్టించిన సంగీతామృతం ఆడియో సేల్స్ లో రికార్డులు సృష్టించడం, సిల్వర్ జూబ్లీ ఆడటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండేదంటే కొన్నేళ్ల పాటు వరసగా పెళ్లి, సందడి పదాలు టైటిల్స్ లో ఉన్న సినిమాలు వందల్లో వచ్చాయి. కొన్ని హిట్టయ్యాయి కూడా. మళ్ళీ ఇప్పుడు పెళ్ళిసందడి చేయడానికి రాబోతున్నాడు శ్రీకాంత్ వారసుడు రోషన్. ఇందాకే మహేష్ బాబు ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ఇల్లంతా బంధువులు, వియ్యంకులు, మిత్రులతో సందడిగా ఉండే ఒక ఇల్లు. అక్కడో కథానాయకుడు(రోషన్). ఓ అమ్మాయి(శ్రీలీల)ని చూసి మనసు పారేసుకుంటాడు. పెళ్లి పెత్తనమంతా తీసుకున్న పెద్దమనిషిలా ఆ కుర్రాడు చేసే అల్లరి మాములుగా ఉండదు. అయితే ఈలోగా అనుకోని మలుపు. ఊహించని అపార్థాలు, విడిపోవడాలు, గొడవలు వగైరా. ఈ నేపథ్యంలో పిల్లనివ్వాల్సిన మామ(ప్రకాష్ రాజ్)వస్తాడు. అక్కడి నుంచి హీరో గేర్ మారుతుంది. అసలు ఇతగాడు ప్రేమించిన ఆ కుర్రది ఎవరు, వీళ్ళ ప్రేమ ఎలా గెలిచింది. పెళ్లి దాకా ఎవరు తీసుకెళ్లారు అనేది తెలియాలంటే దసరాకు రిలీజయ్యే థియేటర్లకు వెళ్ళాలి.

మరీ కొత్తగా అనిపించడానికి ఏమి లేదు కానీ మంచి ఎంటర్ టైన్మెంట్ తో మెప్పించే ప్రయత్నమైతే దర్శకులు గౌరీ రోణంకి చేసినట్టు కనిపిస్తోంది. పర్యవేక్షణ ఎలాగూ రాఘవేంద్ర రావే కావడంతో ఆ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నారు. యాక్టర్ గా డెబ్యూ మూవీ. చివరి షాట్లలో రోషన్ తో కలిసి రావడం చూపించారు. కీరవాణి దీనికి కూడా చక్కని స్వరాలు అందించారు. నిర్మల కాన్వెంట్ లుక్స్ కి దీనికి రోషన్ లో చాలా మార్పు వచ్చింది. శ్రీలీల బొద్దుగా ఆకట్టుకునేలా ఉంది. ఫార్ములా రొటీన్ గానే అనిపిస్తున్నప్పటికీ అసలు సినిమాలో ఏమైనా స్పెషల్ ఉందేమో తెలియాలంటే రిలీజయ్యే దాకా ఆగాలి

Also Read : రానా నాయుడు - ఇది క్రేజీ కలయిక

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp