బుల్లితెరపై వకీల్ సాబ్ హల్చల్

By iDream Post Jul. 18, 2021, 10:44 am IST
బుల్లితెరపై వకీల్ సాబ్ హల్చల్

మాములుగా ఒకప్పుడు ఏదైనా కొత్త సినిమా శాటిలైట్ ఛానల్ లో వస్తోందంటే దానికి విపరీతమైన క్రేజ్ ఉండేది. జనాలు కూడా ఆ టైంకల్లా పనులు చూసుకుని ఫ్యామిలీతో కలిసి కూర్చుని మూవీని ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఓటిటిలు వచ్చాక ఈ సీన్ మారిపోయింది. ప్రైమ్ లు నెట్ ఫ్లిక్స్ ల పుణ్యమాని కేవలం వారాల వ్యవధిలో ఎలాంటి యాడ్స్ గొడవ లేకుండా కోరుకున్న టైంలో తాపీగా చూసే అవకాశం దక్కింది. అయితే ఈ మాధ్యమం సామాన్యులకు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ఛానెళ్లకు ఇప్పటికిప్పుడు వచ్చిన రిస్క్ ఏమి లేదు కానీ మున్ముందు మాత్రం టెక్నాలజీ పెరిగే కొద్దీ ప్రభావం పెరగడం ఖాయం.

ఇదంతా చెప్పడానికి కారణం ఉంది. ఇవాళ జీ తెలుగు ఛానల్ లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రీమియర్ వేస్తున్నారు. సరిగ్గా 100 రోజుల తర్వాత టీవీలో టెలికాస్ట్ అవుతోంది. ఇదేమంత విశేషం కాదు కాని దానికి జరుగుతున్న ప్రమోషన్లు మాత్రం ఏకంగా థియేట్రికల్ రిలీజ్ రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో వరసగా పోస్టులు, బయట ఊళ్ళలో హోర్డింగ్ లు, ఫ్యాన్స్ తో బ్యానర్లు ఇలా మార్కెటింగ్ ని ఓ భీభత్సంగా చేస్తున్నారు. టిఆర్పి రేటింగ్స్ లో టాప్ లో ఉన్న అల వైకుంఠపురములోని వకీల్ సాబ్ దాటగలదా లేదా అనేదాని మీద ఆసక్తికరమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం.

వకీల్ సాబ్ ని ఏప్రిల్ లోనే అమెజాన్ ప్రైమ్ లో కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో స్ట్రీమింగ్ చేశారు. కోట్లాది ప్రేక్షకులు చూశారు. లోకల్ సిటీ కేబుల్ ఛానల్స్ లో గుట్టుచప్పుడు కాకుండా వేసేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయినా కూడా ఇలా చూస్తే వచ్చే కిక్కు వేరు. కానీ విపరీతమైన యాడ్స్ ని తట్టుకుని మరోసారి ఆడియన్స్ చూసేందుకు ఏ స్థాయిలో సిద్ధపడతారన్నది చూడాలి. మరోవైపు దీనికి పోటీగా జెమిని సరిలేరు నీకెవ్వరు వేయడం ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. లేకలేక ఇంత పెద్ద సినిమా వరల్డ్ ప్రీమియర్ చేస్తున్న జీ తెలుగుకు వకీల్ సాబ్ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఏదో స్పెషల్ ప్రోగ్రాం కూడా వేస్తున్నారట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp